31 May 2017
29 May 2017
యేసే మార్గము, సత్యము మరియు జీవము
యోహాను 14: 6 యేసు నేనే మార్గమును,సత్యమును,జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకురాడు.
ఈ మధ్య కాలంలో మనము, క్రైస్తవుల మని చెప్పు కుంటూనే ఏసు క్రీస్తు దేవుడని ఒప్పుకోని కొన్ని గ్రూపులను చూస్తున్నాము. వారు ఏసు క్రీస్తు ఒట్టి దేవుని కుమారుడని, మనము తండ్రి అయిన దేవుడిని మాత్రమే ఆరాధించాలని ఇలా మరి కొన్ని విషయాలు చెబుతూ ఉంటారు. అది నిజం కాదు ఎందుకంటే ఏసు క్రీస్తు దేవుడు మరియు ఆయన మరియు తండ్రి అయిన దేవుడు ఏకమైయున్నారు యోహాను 10:30.
అలానే మనము కొన్ని బోధలు విన్నప్పుడు వారు నిజాన్ని ఏ విధంగా వక్రీకరించి మనము అది తప్పుడు బోధ అని కూడా తెలుసు కోలేని విధంగా మన ముందు పెడుతున్నారో గమనించ వచ్చు. అందుకనే టీవీ లో వచ్చే ప్రోగ్రామ్స్ (క్రైస్తవ ఛానెల్స్ కూడా) చూసేటప్పుడు జాగ్రత్త వహించాలి. మొదటి నుండి మరి ముఖ్యంగా ఈ అంత్య దినాలలో సాతాను చాలా సూక్ష్మ బుద్ధితో వ్యవహరిస్తున్నాడు. వాడు సగం నిజం ద్వారా లేదా నిజాన్ని వక్రీకరించుట ద్వారా అబద్ధాలు వ్యాప్తి చేస్తున్నాడు. అందుకే తప్పుడు బోధల ద్వారా అబద్ధ ప్రవక్త ల ద్వారా సాతాను వ్యాపింప జేస్తున్న అబద్ధాలు గుర్తించ డానికి మనకు దేవుని యొక్క జ్ఞానము మరియు వివేచన ఎంతో అవసరము.
ఈ రోజు వాక్యభాగములో ఏసు క్రీస్తు తానే మార్గమును, సత్యమును, జీవమును అని చెబుతున్నారు. జాగ్రత్తగా గమనించండి తానే మార్గమును, సత్యమును జీవమును అని చెబుతున్నారు నేను ఒక మార్గాన్ని, ఒక సత్యాన్ని, ఒక జీవాన్ని అని చెప్పడం లేదు. అనేక మార్గాలు లేవు, అనేక సత్యాలు లేవు మరియు అనేక మంది జీవమును ఇచ్చు వారు లేరు.
యేసే మార్గము
ఆయన ఒక్కడే మార్గము నిత్యత్వానికి మరి ఇంక ఏ మార్గము లేదు. మరి ఎవనివలనను రక్షణ కలుగదు; ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని, ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అపో.కార్యములు 4: 12. అలానే మనము ప్రార్థన చేయునప్పుడు క్రీస్తు నామము పేరిట చెయ్యాలి తప్ప మరి ఏ నామము పేరిట చేయకూడదు. ఎందుకంటే ఆయన మన నిత్య ప్రధాన యాజకుడు మరియు మన కొరకు ఎల్లప్పుడు విజ్ఞాపన చేయుచున్నారు. హెబ్రీయులకు 7: 25 ఈయన తనద్వారా దేవునియొద్దకు వచ్చువారి పక్షమున, విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై యున్నాడు. మన పాప పరిహారార్థమై సిలువ పైన మరణించినది ఆయన ఒక్కడే కాబట్టి ఆయన నామమందే స్వస్థత మరియు రక్షణ కలుగును.
యేసే సత్యము
ఆయన వాక్యము సత్యము యోహాను 17:17 అందు వలన ప్రతి ఒప్పు, తప్పు మరియు ప్రతి నైతిక నీతి దేవుని వాక్యము మీద ఆధార పడి ఉండాలి కాని మన భావాల మీద కాదు. అంత్య దినాలలో ప్రజలు సత్యమునకు చెవినియ్యక కల్పనా కథలవైపునకు తిరుగు తారు, ఎందుకనగా వారు హితబోధను సహింపక తమ స్వకీయ దురాశలకు అనుకూల మైన బోధకులను పోగు చేసుకుంటారు 2తిమోతికి 4: 4 కాని దేవుని బిడ్డలమైన మనము దేవుని వాక్యమందు నిలిచి ఉండాలి అప్పుడు మనము సత్యమును గ్రహిస్తాము మరియు సత్యము మనలను స్వతంత్రులుగా చేస్తుంది యోహాను 8:31-32
యేసే జీవము
ఆయన ఒక్కడే నిజ జీవమును ఇవ్వ గలరు ఎందు కనగా ఆయనలో జీవముండెను; ఆ జీవము మనుష్యులకు వెలుగైయుండెను. యోహాను 1: 4
మనము అపరాధముల చేతను పాపముల చేతను చచ్చినవారైయుండగా, ఆయన మనలను క్రీస్తుతో కూడ బ్రదికించెను. ఎఫెసీయులకు 2: 1
కావున ఒకవేళ మీరు ఇంకనూ రక్షింపబడని వారై యుండి మరియు మీ హృదయములోని పరిశుద్ధాత్మ యొక్క ఒప్పింపును వ్యతిరేకిస్తున్నట్లయితే దయ చేసి అర్థం చేసుకోండి
కుమారునికి విధేయుడు కాని వాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వానిమీద నిలిచి యుండును. యోహాను 3: 36 మరియు దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవములేని వాడే. 1యోహాను 5: 11 అయితే విశ్వాసులమైన మనకు మాత్రం ఒక అద్భుత నిరీక్షణ కలదు అదేమిటంటే మనకు జీవమై యున్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనమును ఆయనతో కూడ మహిమయందు ప్రత్యక్షపరచబడుదుము. కొలస్సీయులకు 3: 4
చివరిగా ప్రియమైన వారలారా, మనము శ్రేష్ఠమైన కార్యములను వివేచింపగలవారగుటకు, మన ప్రేమ తెలివితోను, సకల విధములైన అనుభవజ్ఞానముతోను కూడినదై, అంతకంతకు అభివృద్ధి పొందవలెననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు, మనము యేసుక్రీస్తు వలననైన నీతి ఫలములతో నిండికొనిన వారమై క్రీస్తు దినమునకు నిష్కపటులును నిర్దోషులును కావలెననియు ప్రార్థించుచున్నాను. ఫిలిప్పీయులకు 1: 9-11
27 May 2017
మన దాగుచోటు
కీర్తనలు 32: 7 నా దాగు చోటు నీవే, శ్రమలోనుండి నీవు నన్ను రక్షించెదవు విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు
దేవుడు ఇశ్రాయేలీయులకు వాగ్ధాన భూమి చేరుకున్న తరువాత ఆశ్రయ పురములుగా ఉండుటకు వారు పురములను ఏర్పరచుకొన వలెను ఉపదేశించెను. ఎందుకంటే పొరబాటున ఒకని చంపినవాడు వాటిలోనికి పారిపోవచ్చును, ప్రతిహత్య చేయువాడు రాకుండ అవి వారికి ఆశ్రయపురములుగా ఉండును సంఖ్యాకాండము 35: 10-12. కొంతమంది పండితులు ఈ రోజు వాక్య భాగములో దావీదు మహారాజు దాగు చోటు అనే పదాన్ని ఆశ్రయ పురమునకు పరోక్షంగా వాడారు అంటారు.
దావీదు తన పాపమునకు క్షమాపణ పొందిన దాని బట్టి ఎంతో సంతోషించాడు మరియు అతని హృదయములో తాను తీర్పు యొక్క ఉగ్రతకు భయపడనవసరం లేదని నిశ్చయత కలిగి ఉన్నాడు. ఆయన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు, తనకు శ్రమ నుండి దాగు చోటుగా ఉన్నందుకు, హాని నుండి కాపాడుతున్నందుకు మరియు విమోచన గానములతో ఆవరించినందుకు.
విశ్వాసుల మైన మనము క్షమించబడిన బిడ్డలము కనుక మనలో దేవుని తీర్పు యొక్క భయము ఉండక పోవచ్చు కాని మనలో వేరే భయాలు ఉండొచ్చు. ఉదాహరణకు చీకటి అంటే భయము, వైఫల్యము యొక్క భయము, ఒంటరితనపు భయము, మరణము పట్ల భయము, భవిష్యత్తును గూర్చిన భయము ఇలా అనేకమైనవి. అయితే భయము ఏదైనా కాని మనము దేవుని పట్ల నమ్మకము కలిగి ఉండొచ్చు ఎందుకంటే ఆయన మన ఆశ్రయము మరియు మన కోట కీర్తనలు 91:2. ఆయన మన సర్వజ్ఞుడైన (సమస్తము తెలిసిన) దేవుడు కనుక ఆయనకు మన ప్రతి భయము తెలుసు మరియు దానిని ఆయన అర్థం చేసుకుంటారు. అదే సమయంలో ఆయన సర్వ శక్తి గల దేవుడు కూడా కనుక ఆయన మనలను ప్రతి విధమైన చెడు నుండి మరియు హాని నుండి కాపాడ గల సమర్థుడు.
అందుకే ఈ సారి భయం మన తలుపు తడితే మనము ధైర్యముగా కీర్తనలు 18: 2 యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించు వాడు నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు నేను ఆశ్రయించియున్న నా దుర్గము. అని చెబుదాం.
25,26 May 2017
సమర్పణ కలిగిన జీవితం
రోమీయులకు 6: 13 మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా( లేక ఆయుధములుగా) పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతులలోనుండి సజీవులమనుకొని, మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి, మీ అవయవములను నీతిసాధనములుగా దేవునికి అప్పగించుడి.నాకు తెలిసి ఈ విషయం ఇంతకు ముందు కూడా ఒకసారి చెప్పినట్లు ఉన్నాను అయినా మళ్ళీ చెబుతున్నాను క్రైస్తవ జీవితం రక్షణతో ఆగి పోదు కాని రక్షణతో మొదలవ్వుతుంది. అవును కొంతమంది మాకు రక్షణ వస్తే చాలు స్వర్గానికి టికెట్ దొరికింది కదా అనేటట్లు జీవిస్తారు. కాని వారు నిత్యత్వము లోనికి ప్రవేశించాక వృధా చేసిన జీవితం గురించి ఎంతో బాధ పడాల్సి వస్తుంది. అన్నీ కోల్పోయి నువ్వు మాత్రము అగ్నిలో నుండి తప్పించు కున్నట్లు స్వర్గం చేరితే ఏమి ఉపయోగం 1 కోరింథీయులకు 3:15. అంతే కాదు దేవుని వాక్యము చాలా తేట తెల్లగా చెబుతుంది, మన రక్షణను మనము భయముతో వణుకుతో కొనసాగించాలని ఫిలిప్పీయులు 2:12
ఫలభరిత మైన క్రైస్తవ జీవితం నడవాలంటే మనము విధేయత మరియు సమర్పణ కలిగి ఉండడం తప్పని సరి. దేవుని వాక్యమునకు మరియు ఆయన ఆజ్ఞల పట్ల విధేయత ఎంతో అవసరం అలానే సమర్పణ కలిగి ఉండడం కూడా చాలా అవసరం. మనము మొదట రక్షణ కొరకు మనలను సిలువ పాదాల వద్ద దేవునికి సమర్పించు కొనడమే కాదు, ప్రతి నిత్యము ప్రతి క్షణము దేవునికి మనలను మనము సమర్పించుకోవాలి, అప్పుడే ఆయనకు ఇష్టమైన జీవితం జీవించ గలుగుతాము. దేవునికి సమర్పణ అనేది భౌతికమైన, మానసిక మైన మరియు ఆధ్యాత్మిక మైన సమర్పణ కావచ్చు.
భౌతిక సమర్పణ:
ఈ రోజు వాక్య భాగములో చెప్పిన విధముగా మనము మన శరీర అవయవములను నీతిసాధనములుగా దేవునికి అప్పగించుకోవాలి పాపమునకు కాదు. కేవలము చెడు అలవాట్లకు అలవాటు పడిన వారు మాత్రమే కాదు మన అందరికీ కూడా ఇది చేయడం చాలా కష్ట మైన పని. మన శరీరము సమర్పణ వైపు కాకుండా సౌకర్యము (comfort) మరియు ఆనందం (pleasure) వైపు లాగుతుంది. మనము పెందలాడ లేచి ప్రార్థన చేయడానికన్నా ఎక్కువ సేపు పడుకోడానికే ఇష్ట పడతాం, కఠినమైన ప్రదేశాలకు వెళ్లి దేవుని వాక్యము బోధించడానికి బదులు సౌకర్యమైన ప్రదర్శంలో ఉండడానికి ఇష్ట పడతాం, చర్చ్ కి వెళ్ళడానికి బదులు ఇంట్లో ఉండి టీవీ చూడడానికి ఇష్ట పడతాం, దేవుని కొరకు అన్నీ పోగొట్టు కోవడానికి సిద్ధమవకుండా మనము మాత్రం సురక్షితంగా ఉండడానికి ఇష్ట పడతాం. మనుష్య శరీరం ఈ విధంగానే ప్రవర్తిస్తుంది. అందుకే అపొస్తలు పౌలు చెప్పినట్లు చెయ్యాలి (1కోరింథీయులకు 9: 27 ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరమును నలగగొట్టి, దానిని లోపరచుకొనుచున్నాను.) మనలను మనము క్రమశిక్షణలో ఉంచుకొని, మన శరీర అవయవములను దేవునికి సమర్పించుకొనడానికి ఉద్దేశపూర్వకంగా నిర్ణయించుకోవాలి.
మానసిక సమర్పణ:
మనము మన భావోద్వేగాలు (emotions) మరియు భావాలు (feelings) దేవునికి సమర్పించాలి. అయితే మీరు కూడా నాలాగ భావోద్వేగమైన (emotional) వ్యక్తి మాత్రం ఇది చెయ్యడం కొంచం కష్టమే. ఒక వేళ మన భావోద్వేగాలు మనలను నియంత్రిస్తే (control) అప్ప్పుడు మనం కొన్ని సార్లు ఆనందంగా ఉంటాం, కొన్ని సార్లు మనసు బాగోదు, కొన్ని సార్లు ప్రార్థన చెయ్యాలి దేవునిని ఆరాధించాలి అనిపిస్తుంది మరి కొన్ని సార్లు ఇవన్నీ చెయ్యాలి అనిపించదు. ఇలా మనము కనుక మన భావాలకు తలొగ్గితే అప్పుడు మనము ఎప్పుడూ ఒక emotional roller coaster మీద ఉన్నట్లు ఉంటాము కొన్ని సార్లు పైన (మంచి mood లో) కొన్ని సార్లు కింద (చెడ్డ mood లో) మరియు అది చాలా అపాయకరం. Oswald Chambers అనే గొప్ప దైవ జనుడు ఈ విధంగా అన్నారు 'మనము moodiness ని ప్రార్థనతో వదిలించుకోలేము కాని దానిని మన జీవితంలోనుంచి గట్టిగా బయటకు తన్ని నెట్టి వేసి వదిలించుకోవచ్చు. నిజానికి మనోభావాలు (moods) ఎప్పుడూ బయట ఉన్న ఒక పరిస్థితి మీద ఆధార పడి ఉంటాయి, మన మనస్సు మీద కాదు. మన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి మనలో వచ్చే మనోభావాలను పట్టించుకోకుండా ఉండడానికి ఎడ తెగక చేసే ప్రయత్నం చాలా క్లిష్టమైనదే కాని ఒక్క క్షణం కూడా మనము మన మనోభావాలకు తల వంచ కూడదు. చెప్పాలంటే మనలను మనము మెడ పట్టి లేపి గట్టిగా విదిలించుకోవాలి, అప్పుడే మనము ఇప్పటి వరకు చేయలేము అనుకున్నది చెయ్యగలుగుతాము. ఒక విషయంలో కనుక దేవుడు ముందే మనకు విజయాన్ని పొందడానికి సమస్తము సమకూర్చి ఉంచినట్లయితే ఆ విషయంలో తిరిగి మళ్ళీ ఆయన మనకు సహాయం చేయరు. మనము మన భావోద్వేగాలను బట్టి వ్యవహరించకూడదు కాని దేవుని వాక్యము ఏ విధంగా చెబుతుందో ఆ విధంగానే చెయ్యాలి. ఎందుకంటే మనము వెలి చూపువలన కాక విశ్వాసమువలననే నడుచుకొనుచున్నాము 2కోరింథీయులకు 5: 6
ఆధ్యాత్మిక సమర్పణ:
ఇలా ఆధ్యాత్మిక సమర్పణ అనే పదాలు వాడడం సరియైనదో కాదో నాకు తెలీదు కాని నా ఉద్దేశం ఏమిటంటే మనము మన ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించిన ప్రతి విషయం దేవునికి సమర్పించాలి. జాగ్రత్తగా లేనట్లయితే మన ఆధ్యాత్మిక అలవాట్లు (ప్రార్థన, వాక్యము చదవడం
..) మన సేవ మరియు దేవుని కొరకు చేసే ఏ పని నైనా ఒక విగ్రహముగా చేసుకోగలం. మన గుర్తింపు దేవుని యందు కాక దేవుని కొరకు చేసే పనులలో పొందడానికి ప్రయత్నిస్తాము. అయితే మనము కనుక దేవునికి సమర్పించు కుంటే అప్పుడు ఆయన యొక్క ఆధిపత్యాన్ని మన జీవితంలో ఒప్పుకుంటాం మరియు ఆయన వదిలి పెట్టమని చెప్పినప్పుడు ఆయన కోసం చేసే పనినైనా, దేనినైనా వదిలి పెట్ట గలుగుతాం. ఫలానా పని లేదా ఫలానా స్థలంలోనే చేస్తాను అని అనకుండా ఆయన ఎక్కడకు వెళ్లమంటే అక్కడికి వెళ్ళడానికి ఏది చేయమంటే అది చేయడానికి విధేయత చూపిస్తాము.
చివరిగా మనము దేవునికి సమర్పించు కొనేది ఎదో ప్రతిఫలం పొందాలని (దేవుడు ప్రతిఫలం తప్పక ఇస్తారు కాని అదే మన ప్రధాన ఉద్దేశం కాకూడదు) లేదా ఏదన్నా పోగొట్టుకుంటామేమో అన్న భయముతో కాదు, మరి ఎందుకంటే మనము ఆయనను ప్రేమిస్తున్నాము కాబట్టి, ఆయన మనలను మరణము నుండి విడిపించి జీవము లోనికి నడిపించారు కాబట్టి.
విధేయత మరియు సమర్పణ కలిగిన జీవితం జీవించడం అంత సులువైన పని కాదు కాని అది చేసినట్లయితే మనము మునుపెన్నడూ అనుభవించని స్వాతంత్ర్యాన్ని పొందుతాము. ఎందుకంటే నిజమైన స్వేచ్ఛ క్రీస్తునందే లభిస్తుంది.
24 May 2017
విధేయతలో నడుచుట
రోమీయులకు 5: 19 ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయతవలన అనేకులు పాపులుగా ఏలాగు చేయబడిరో, ఆలాగే ఒకని విధేయతవలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు.
ఇంకొకరికి విధేయత చూపడం లేదా ఇంకొకరి మాటలకు తలొగ్గడం చాలా మందికి ఒక పెద్ద సవాలు. చిన్నగా ఉన్నప్పుడు ఒక వేళ మీ తల్లిదండ్రులకు విధేయత చూపించడం నేర్చుకోక పొతే తరువాత పెద్దయ్యాక వేరే వారికి విధేయత చూపడం ఇంకా కష్టం అవుతుంది. అలానే మనకు ఎదురుగా కనిపించే మన తల్లి దండ్రులకు లేదా మన బాస్ కి విధేయత చూపించడం ఒక ఎత్తు, మన కళ్ళతో చూడ లేని దేవునికి విధేయత చూపించడం ఇంకొక ఎత్తు. అయితే దేవుని వాక్యము ఆదికాండము నుండి ప్రకటన గ్రంథము వరకు దేవునికి విధేయత చూపమని చెబుతుంది.
మనము దేవునికి విధేయత మరియు ఆవిధేయత చూపించడం ఎలా? మనము దేవునికి, ఆయన వాక్యము మరియు ఆయన ఆజ్ఞలకు విధేయత చూపుట ద్వారా విధేయత చూపిస్తాం అలానే ఆయన వాక్యము మరియు ఆయన ఆజ్ఞలకు అవిధేయత చూపుట ద్వారా అవిధేయత చూపిస్తాం. మనము అన్ని విషయాల్లో దేవునికి విధేయత చూపించాలి ఎందుకంటే అసంపూర్ణ విధేయత కూడా అవిధేయతే.
కాని మనలో కొంతమంది పూర్తిగా దేవునికి విధేయత చూపించము, దేవుని వాక్యంలో మనకు నచ్చిన విషయాల పట్ల విధేయత చూపిస్తాం మరియు మనకు నచ్చని లేదా కష్ట మైన విషయాలు మనము పాటించం. మనము కొన్ని కారణాలు కూడా చెప్పొచ్చు నేను perfect కాదు, నేను ఒట్టి మనిషిని అన్ని పాటించలేను etc. అని. కాని సాకులు ఎవన్నా కావచ్చు నిజం మాత్రం ఏమిటంటే ప్రతి ఆవిధేయత అది తెలిసి చేసినా తెలియక చేసినా అది అవిధేయతే మరియు అది దేవునికి వ్యతిరేకముగా పాపము. ఇంకా మనకందరికీ తెలుసు పాపమునకు పర్యవసానము చెల్లించాల్సిందే అని.
అలాగే దేవుని పట్ల ఆయన వాక్యము పట్ల చూపే ప్రతి విధేయతకు బహుమతి లేదా ప్రతిఫలం ఉంటుంది. ఇంకా ఆ ఆశీర్వాదాలు మనకొక్కళ్ళకే కాదు మన కుటుంబాలతో సహా మన చుట్టూ ఉన్నవారికి కూడా ప్రవహిస్తాయి. ఇది నేను నా జీవితంలో మరియు ఇతరుల జీవితాల్లో కూడా చూసాను. అలానే బైబిల్ కూడా, దేవునికి విధేయత చూపించిన ప్రజలు ఏ విధంగా ఆశీర్వదింప బడ్డారో మరియు దేవునికి ఆవిధేయత చూపిన వారు ఏ విధంగా పర్యావసానాలు అనుభవించ వలసి వచ్చిందో వాటి గురించి అనేక ఉదాహరణలు మనకు తెలియ జేస్తుంది. ఈ రోజు వాక్య భాగము కూడా ఒక ఉదాహరణ, ఒక మనిషి, ఆదాము ఆవిధేయత వలన పాపము ఏ విధంగా ఈ లోకము లోనికి ప్రవేశించింది అలానే ఒక మనిషి (దేవుడు మనిషి), ప్రభువు ఏసు క్రీస్తు, విధేయత ఏ విధంగా అనేకుల రక్షణకు కారణమయ్యింది అని.
మరి, ఈ రోజు దేవుడు మీతో ఏదన్నా చెబుతున్నట్లయితే, ఆయనకు విధేయత చూపి అనేకులు ఆశీర్వాదకరముగా అవుతారా లేదంటే ఆయన మాటలు పట్టించుకోకుండా వదిలేస్తారా?
23 May 2017
దేవుని సేవ దేవుని మార్గములో
జెకర్యా 4: 6 అప్పుడతడు నాతో ఇట్లనెను జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే; శక్తిచేత నైనను బలముచేతనై ననుకాక నా ఆత్మచేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను.
ఒక వేళ మీరు కనుక దేవునిని సేవిస్తున్నట్లయితే అది అంత సులువైన పని కాదని మీరు కూడా నాతో అంగీకరిస్తారు. శత్రువైన సాతాను నుండి ఎన్నో దాడులు, కొన్ని బయట వారి ద్వారా మరి కొన్ని సార్లు మన ఇంటివారి ద్వారా ఎదుర్కోవాల్సి వస్తుంది. మనలో మనకు మరియు మన చుట్టూ ఉన్న మన సంబంధీకులతో సంఘర్షణలు తలెత్తుతాయి. ఇంకా అనేక సార్లు మనము చాలా ఖాళీగా, అలసినట్లు అయిపోయి మరియు సేవ విడిచి పెట్టడానికి సిద్ధమవుతాము. ఇదంతా ఎందుకు అవుతుందంటే మనము మన స్వశక్తితో సేవ చేయడానికి ప్రయత్నించడం వలన. మన ఉద్దేశాలు మరియు కారణాలు మంచివే కావచ్చు కాని దేవుడు ఉద్దేశించిన విధంలో మనము ఆయన సేవ చేయక పొతే చివరికి చిరాకుతో మరియు అలసటతో మిగిలి పోతాం.
ఈ రోజు వాక్య భాగం దేవుని సేవ దేవుని మార్గం లో ఏ విధంగా చేయాలో చెబుతుంది, మన శక్తి చేత కాదు మరియు మన బలము చేత కాదు కేవలము ఆయన ఆత్మ యొక్క నిర్దేశకత్వము బట్టి ఆయన మీద పూర్తిగా ఆనుకొనుట ద్వారా. వాక్య భాగము యొక్క సందర్భానికి చూసినట్లయితే జెరుబ్బాబెలు మరియు నెహెమ్యా మరి కొంత మంది యూదులతో కలిసి యెరూషలేము పట్టణమును తిరిగి నిర్మించ సాగారు. ఈ పనికి ఎన్నో అడ్డంకులు మరియు అవాంతరాలు సృష్టించ బడ్డాయి. కాని దేవుడు జెకర్యా అనే ప్రవక్తకు దర్శనాన్ని ఇచ్చి అతనిని జెరుబ్బాబెలును బల పరచ డానికి 'దేవుడు నీవు తల పెట్టిన కార్యాన్ని ముగించడానికి సహాయము చేస్తారు v9 ఎందువలనంటే అది జరిగేది మనుష్య బలము చేత కాదు కాని దేవుని ఆత్మ చేత v6 అని
ఒక సందేశముతో అతని వద్దకు పంపించారు. అయితే ఈ మాటలు దేవుని సేవ చేస్తాను అని ఆయన ముందు ఒప్పందం చేసుకున్న ప్రతి వ్యక్తికి వర్తిస్తాయి. మన సేవ చేయు ప్రాంతము మనము పని చేయు స్థలము కావచ్చు, మన బిజినెస్ కావచ్చు, చర్చి లేదా మన ఇల్లు కావచ్చు అది ఎక్కడయినా సరే దేవుడు మనకు అప్పగించిన పనిని చేయడానికి తన ఆత్మ ద్వారా సహాయము చేస్తానని చెబుతున్నారు. దేవుడు దేని కోసం పిలుస్తారో దాని కొరకు సంసిద్ధం చేస్తారు మరియు చేయడానికి సహాయం చేస్తారు ( for what God calls He equips and enables)
మనము ఎల్లప్పుడూ ఒక విషయం గుర్తుంచు కోవాలి, మనము దేవుని కోసం పని చేయడం కాదు ఆయనే మన ద్వారా పని చేస్తున్నారు అని. మనము కనుక ఈ సత్యాన్ని గ్రహించితే అప్పుడు ఇతరులు మనలను మెచ్చుకోలేదని బాధ పడము మరియు అడ్డంకులు అవాంతరాలు వచ్చినా బాధ పడము.
అయితే దేవుడు మన ద్వారా పని చేయాలి అంటే మనము మన జీవితము లోని ప్రతి విషయము ఆయనకు సమర్పించు కోవాలి మరియు మనలో ఒప్పుకోని పాపము ఏదీ ఉండ కూడదు, ఎందుకంటే పాపము ఉన్న చోట దేవుని ఆత్మ ఉండలేదు. మనము నిరంతరం మన కివ్వబడిన పని విషయమై ఆయన దిశ కొరకు మరియు జ్ఞానము కొరకు అడగాలి, పెద్ద విషయాల్లోనే కాదు అతి చిన్న విషయాల్లో కూడా. అలా మనము ఆయన బలము మరియు జ్ఞానము మీద ఆధార పడి ఆయనను నమ్మకముగా సేవిస్తే మనము చేసే ఆ పని ద్వారా చివరికి ఆయనకు మహిమ కలుగు తుంది. మాటచేత గాని క్రియచేత గాని, మీరేమి చేసినను ప్రభువైన యేసుద్వారా తండ్రియైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, సమస్తమును ఆయన పేరట చేయుడి. కొలస్సీయులకు 3: 17
20 May 2017
యెహోవా యందు ఆనందించుట
కీర్తనలు 37: 4 యెహోవానుబట్టి సంతోషించుము ఆయన నీ హృదయవాంఛలను తీర్చును.
బైబిల్ లో తప్పుగా వ్యాఖ్యానించబడే అనేక వచనాలలో ఒకటి ఈ వచనం కూడా. కొంత మంది దేవుడు నీ హృదయవాంఛలను తీర్చును అని ఒట్టి సగం వచనం చెప్తారు అయితే అసలు ఈ వచనములో కీలకమైన పదాలు మొదటి సగంలో ఉన్నవి, అవి యెహోవానుబట్టి సంతోషించుము. చూడండి బైబిల్ లోని కొన్ని వాగ్ధానాలు నిబంధనలతో కూడినవి, ఉదాహరణకు సామెతలు 3: 6 నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును; యోహాను 15: 10 మీరు నా ఆజ్ఞలు గైకొనినయెడల నా ప్రేమయందు నిలిచి యుందురు; కీర్తనలు 91: 9-10 యెహోవా, నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసికొనినచో, నీకు అపాయమేమియు రాదు ఏ తెగులును నీ గుడారమును సమీపించదు మొదలగునవి. నిబంధన నెరవేరిస్తేనే ఆ వాగ్ధానము నిజమవుతుంది. ఈ రోజు వాక్య భాగము కూడా అలాంటి నిబంధనతో కూడిన వాగ్ధానమే.
మరి, యెహోవా యందు ఆనందించుట అంటే ఏమిటి? ఒక దృష్టాంతముతో (scenario) వివరిస్తాను, మనము చిన్నగా ఉన్నప్పుడు, కొంత మంది అయితే ఇప్పుడు కూడా, ఏదన్నా picnicకి వెళ్ళడానికి ఎంతో సంతోషించే వాళ్ళము. Picnic విషయం తెలిసిన దగ్గరి నుంచి ఆ రోజు కోసం ఎలా ఎదురు చూసాం, దాని కోసం అన్నీ ఎలా సిద్ధం చేసుకున్నాం, అసలు వెళ్లే రోజు అయితే మన సంతోషం సంగతి చెప్పనవసరం లేదు. ఆ రోజు picnic కి వెళ్లడానికి car, bus, train లో కూర్చున్నప్పుడు మనకు వచ్చిన సంతోషం మాటల్లో చెప్ప లేము. ఇంక అక్కడికి వెళ్ళాక అక్కడ ఎంత సమయం గడిపినా చాలా తక్కువగా అనిపిస్తుంది అందుకే తిరిగి ఇంటికి వెళ్తున్నప్పుడు సమయం చాలా తొందరగా అయిపోయింది అనుకుంటాం. ఒక వేళ మీరు కూడా నాలాగ అయితే ఇంటికి వెళ్ళడానికి ఎక్కువ సమయం పడితే బాగుండు అని కూడా అనిపిస్తుంది.
నేను చెప్పేది అర్థం అయింది కదూ, మనకు ఎవరన్నా లేదా ఏదన్నా బాగా ఇష్టమయితే మనము వారితో లేదా అక్కడ ఉండాలని ఆశపడతాం, వారి దగ్గరకు లేదా అక్కడికి వెళ్ళడానికి మనలను మనము సిద్ధము చేసుకుంటాం. వారి వద్దకు లేదా అక్కడికి వెళ్ళినప్పుడు మన హృదయం సంతోషముతో నిండి పోతుంది మరియు ఎంత సమయం గడిపినా తనివి తీరదు. వారితో లేదా అక్కడ ఇంకా ఇంకా సమయం గడపాలి అనుకుంటాం.మరి సరిగ్గా ఇలానే మనము దేవుని యందు ఆనందించాలి.
ఇంకా మనము దేవుని యందు ఆనందిస్తే అప్పుడు మన హృదయ వాంఛలు సరియైనవో కాదో అని భయపడవలసిన పని కూడా లేదు. ఎందుకంటే మనము ఆయనతో సమయం గడపడానికి ఆశ పడితే, ఆయన సన్నిధిలో సంతోషించుచూ మరియు ఆయన ముఖ కాంతిని మళ్ళీ మళ్ళీ చూడాలని ఎదురు చూస్తూ ఉంటే, అప్పుడు మన హృదయం మార్చ బడుతుంది, మన చిత్తము మన వాంఛలు పవిత్ర పరచ బడతాయి, మరియు మన చిత్తం ఆయన చిత్తం అవుతుంది, మన వాంఛలు ఆయన వాంఛలు అవుతాయి.
అందుకే, మీ హృదయ వాంఛలు ఎవయినా సరే ఆయన పాదాల వద్ద సమర్పించండి మరియు మిమ్ములను మీరు ఆయనను బట్టి సంతోషించుటలో అనగా ఆయన వాక్యము చదువుటలో మరియు ప్రార్థించుటలో నిమగ్నం చేసుకొనండి అప్పుడు ఆయన మీ హృదయ వాంఛలు తీరుస్తారు.
19 May 2017
మీరు దేవునికి ప్రసస్థమైనవారు
యెషయా 43: 4 నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి నేను నిన్ను ప్రేమించుచున్నాను.
మనం మనుషులం, మన కంటే విభిన్నంగా ఉన్నవారిని అంగీకరించడానికి చాలా కష్ట పడతాం. ఇంకా మనలో కొంతమందిమయితే మనలను మనమే ఇష్ట పడం. వేరే లాగ ఉంటే బాగుండు అనుకుంటాం. అలానే మనలో కొంత మంది మనము ఉన్న విధానము బట్టి మన ప్రవర్తన బట్టి ఇతరుల తిరస్కరణకు గురై ఉంటాము. కాని ఇక్కడ దేవుడు ఈ వాక్యము ద్వారా మనతో, అయన మనలను ప్రేమిస్తున్నారని మరియు ఆయన దృష్టికి ప్రియమైనవారమని చెబుతున్నారు. దేవుడు మనలను తన స్వరూపములో సృజించారు ఆదికాండము 1:27 మరియు అయన మనలను ఒక్కొక్కరినీ వ్యక్తిగతంగా ప్రేమిస్తున్నారు. కీర్తనాకారుడు ఈ విషయాన్ని అర్థం చేసుకున్నాడు అందుకే 'నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతి నాకు బాగుగా తెలిసియున్నది.కీర్తనలు 139: 14' అని దేవునిని స్తుతించాడు.
నేను కొంత కాలం క్రిందట ఒక sunday school పుస్తకములో Amy Carmichael అనే వ్యక్తి గురించి చదివాను. ఆమె పుట్టిన దేశమైన Ireland లో ఎక్కువ మంది blue కళ్ళు కలిగి ఉండే వారు కాని Amy కి brown కళ్ళు ఉండేవి. చిన్న పిల్లగా ఉన్నప్పుడు ఆమె తాను ఇతరులతో కలవ లెనేమో అని చాలా భయ పడేది. కాని ఒక రోజు ఆమె తండ్రి దేవుడు మన ప్రార్థలకు జవాబు ఇస్తారు అని చెప్పడం విని, ఆమె ఆ రాత్రి తన గదిలో మోకరించి తెల్లారేసరికి నా కళ్ళ రంగు మార్చు ప్రభువా అని ప్రార్థన చేసింది. అయితే ఆమె ప్రార్థనకు జవాబు రాలేదు, అందుకు ఏడుస్తూ కూర్చున్న ఆమె వద్దకు ఆమె తల్లి వచ్చి ఆమెను ఓదార్చి, దేవుడు నిన్ను సృష్టించారు, ఆయన నిన్ను సంరక్షిస్తారు మరియు నీ పట్ల ప్రణాళిక కలిగి ఉన్నారు అని చెప్పారు. తరువాత ఆమె పెరిగి పెద్దదై దక్షిణ భారత దేశానికి మిషనరీ గా వచ్చింది. అక్కడ foreigners గుడి లోనికి రాకూడదు అనే ఆంక్ష ఉన్నా కూడా, ఆమె గుడిలో బానిసలుగా అమ్మబడుతున్న చిన్నారి ఆడ పిల్లలను కాపాడ గలిగింది ఎందుకంటే brown కళ్ళతో మరియు చీరలో ఉన్న ఆమెను ఎవ్వరూ foreignerగా గుర్తుపట్టే వారు కాదు. అప్పుడు ఆమెకు దేవుడు తనకు brown కళ్ళు ఎందుకు ఇచ్చారో అర్థం అయింది.
అలాగే నేను ఇంకో మిషనరీ గురించి కూడా విన్నాను, ఆమె కూడా తాను చిన్న పాదాలు కలిగి ఉండడం వలన తన చుట్టూ ఉన్నవారు గేలి చేస్తున్నారని, దేవునికి తన పాదాలను పెద్దవి చేయమని ప్రార్థించింది. తరువాత ఆమె పెరిగి పెద్దదై ఒక కొండ ప్రాంతానికి వెళ్ళినప్పుడు తన చిన్న పాదాల వలన కొండలు సులువుగా ఎక్క గలుగు తున్నానని గ్రహించి దేవునిని స్తుతించింది.
కొన్ని సార్లు మనము ఎదయితే సరిగా లేదు అనుకుంటామో దానినే దేవుడు తన ప్రణాళికను జరిగించడానికి వాడుకుంటారు. దేవుడు చేసే ప్రతి దాని వెనుక ఒక ఉద్దేశ్యము ఉంటుంది, అది నీకు నాకు ఆ సమయంలో అర్థం కాక పోవచ్చు కాని ఆయన ప్రతి దానిని, అనగా మనము ఏ విధంగా కనిపిస్తామో (our looks), మన ప్రవర్తన, మన తలాంతులు, మన వరాలు, మన బలాలు మరియు మన బలహీనతలు అన్నీ తన గొప్ప ఉద్దేశాన్ని మనలో మరియు మన ద్వారా జరిగించడానికి వాడుకుంటారు. అపొస్తలు పౌలు వ్రాసినట్లు, మనము దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్‌క్రియలు చేయుటకై, మనము క్రీస్తుయేసునందు సృష్ఠింపబడినవారమై ఆయన చేసిన పనియైయున్నాము.ఎఫెసీయులకు 2: 10
అందుకే మనకు ఉన్నవి మరియు లేని వాటి గురించి సణుగుకొనుట మానుకొని, దేవుడు మనలను సృష్టించారు మరియు మనలను సంరక్షిస్తారు; ఆయన మనలను ప్రేమిస్తున్నారు మరియు మనము ఆయన దృష్టికి ఘనమైన వారిగా ఉన్నాము అన్న సత్యాన్ని మన హృదయాలలో లోతుగా నాటుకుందాం.
13 May 2017
దేవుని యొక్క సమాధానం
న్యాయాధిపతులు 6: 24 అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠము కట్టి, దానికి యెహోవా సమాధానకర్తయను పేరుపెట్టెను.
మిద్యానీయులకు మరుగైయుండునట్లు గానుగ చాటున గోధుమలను దుళ్లగొట్టుచున్న గిద్యోనుకు అక్కడ దేవుని దూత కనిపించారు. అతడి సంభాషణ ముగిసిన తరువాత గిద్యోను తాను దేవుని దూతను ముఖా ముఖిగా చూసానని గ్రహించి చాలా భయపడ్డాడు. కాని దేవుడు 'నీకు సమాధానము, భయపడ వద్దు, నీవు చావవు' అని అతనితో చెప్పారు. అప్పుడు గిద్యోను ఒక బలి పీఠము కట్టి దానికి యెహోవా సమాధానకర్తయను ( The Lord is Peace) పేరుపెట్టెను.( పూర్తి విషయం కొరకు అధ్యాయం మొత్తం చదవండి ). ఇది ఎంత నిజమైన విషయం, సమాధానము దేవుని వద్ద నుండి రావడమే కాదు ఆయనే సమాధానం. సమాధాన అధిపతియైన యేసు క్రీస్తు మన హృదయములలో నివసించుచున్నారు కనుక విశ్వాసులమైన మనమందరము ఈ సమాధానమును అనుభవించవచ్చు.
మరి అయితే మనము ఎల్లప్పుడూ సమాధానం కలిగి ఎందుకు ఉండడం లేదు? దీనికి అనేక కారణాలు ఉండొచ్చు కాని నేను కొన్నిటి జాబితా కింద ఇస్తున్నాను.
మరి అయితే మనము ఎల్లప్పుడూ సమాధానం కలిగి ఎందుకు ఉండడం లేదు? దీనికి అనేక కారణాలు ఉండొచ్చు కాని నేను కొన్నిటి జాబితా కింద ఇస్తున్నాను.
భయము, ఆందోళన:
భయము మరియు ఆందోళన మన సమాధానాన్ని దొంగిలిస్తాయి. మీరు కాని ఒక వైపు దేని గురించి అయినా భయము కలిగి ఆందోళన పడుతూ కూడా నెమ్మదితో సమాధానంగా ఉన్నవారిని ఎవరినన్నా చూసారా? లేదు, అలా చూసి ఉండరు, ఆందోళన అనేది సమాధానానికి పూర్తి వ్యతిరేకం. మనము ఆందోళన భయము కలిగి ఉండడం అంటే దేవునిపై పూర్తి నమ్మకము లేకపోవడం, ఆయన మన అవసరతలను తీర్చగలరని నమ్మలేక పోవడం. దేవుని వాక్యం చెబుతుంది ఎవని మనస్సు నీమీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణశాంతిగలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీయందు విశ్వాసముంచి యున్నాడు యెషయా 26: 3. మనము దేవునిని నమ్మి మన హృదయము ఆయన మీద లగ్నం చేస్తే అప్పుడు మనము కూడా సమస్త జ్ఞానమునకు మించిన సమాధానమును కలిగి ఉంటాము. ఫిలిప్పియులకు 4:7.
అవిధేయత:
అవిధేయత అనేది మనలో సమాధానము లేక పోవడానికి ఇంకొక కారణం. దేవునికి ఆయన వాక్యానికి ఆవిధేయత చూపుతూ మనస్సులో పూర్ణమైన సమాధానము కలిగి ఉండుట అసాధ్యము. దేవుని వాక్యం ఈ విధంగా చెబుతుంది నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు వారు తూలి తొట్రిల్లుటకు కారణమేమియులేదు కీర్తనలు 119: 165 అందుకే ఆయనతో సహవాసము చేసినయెడల (submit to God) నీకు సమాధానము కలుగును యోబు 22: 21
క్షమించలేని తత్వము:
సమాధానము పోగొట్టు కోవడానికి మరి యొక కారణము క్షమించే గుణము లేక పోవడం. మీ హృదయంలో కోపము, ద్వేషము, పగ ఉంటే మీరు సమాధానంగా ఉండ లేరు. అందుకే ప్రభువు మిమ్ములను క్షమించిన విధముగా ఇతరులను కూడా క్షమించుటకు నిర్ణయం చేసుకోండి. దేవుని వాక్యం ఈ విధంగా చెబుతుంది సమాధాన పరచువారు ధన్యులు ; వారు దేవుని కుమారులన బడుదురు. మత్తయి 5: 9 అందుకే కలహము విడిచి సమాధానముగా ఉండుడి; ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడైయుండును. 2 కోరింథీయులకు 13: 11 b
ఇక సమాధానకర్తయగు ప్రభువు తానే యెల్లప్పుడును ప్రతి విధముచేతను మీకు సమాధానము అనుగ్రహించును గాక.2 థెస్సలొనికయులకు 3: 16 a ఎందుకంటే శాంతి
( లేక,సమాధానము) మీకనుగ్రహించి వెళ్లుచున్నాను; నా శాంతినే(లేక,సమాధానము) మీ కనుగ్రహించుచున్నాను; లోకమిచ్చునట్టుగా నేను మీ కనుగ్రహించుటలేదు; మీ హృదయమును కలవరపడనియ్యకుడి, వెరవనియ్యకుడి. యోహాను 14: 27 అని ఆయన వాగ్ధానము చేసి యున్నారు కనుక.
( లేక,సమాధానము) మీకనుగ్రహించి వెళ్లుచున్నాను; నా శాంతినే(లేక,సమాధానము) మీ కనుగ్రహించుచున్నాను; లోకమిచ్చునట్టుగా నేను మీ కనుగ్రహించుటలేదు; మీ హృదయమును కలవరపడనియ్యకుడి, వెరవనియ్యకుడి. యోహాను 14: 27 అని ఆయన వాగ్ధానము చేసి యున్నారు కనుక.
12 May 2017
దేవుని యొక్క విశ్వాస్యత
ద్వితియోపదేశకాండము 7: 9 కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు, తన్ను ప్రేమించి తన ఆజ్ఞల ననుసరించి నడుచుకొనువారికి తన నిబంధనను స్థిరపరచువాడును వేయితరములవరకు కృపచూపువాడును నమ్మతగిన దేవుడు ననియు,
దేవుడు నమ్మదగిన వాడు మరియు అయన విశ్వాస్యత చేత ఆయన ఆవరింపబడియున్నారు కీర్తనలు 89:8. మనము కనుక విశ్వాస్యత అను మాటకు అర్థాలు చూసినట్లయితే వాటిలో కొన్ని నమ్మదగిన, నమ్మకమైన, నిష్ఠగల, ప్రామాణికమైన, ఖచ్చితమైన, సత్యవంత మైన, ఎప్పుడూ తప్పు చేయని అనునవి. ఇవన్నీ కూడా దేవుని యందు నిజము అవుతాయి, ఎందుకంటే దేవుడు నమ్మదగిన వాడు, నమ్మకమైన వాడు, మన పట్ల నిష్ఠగల ప్రేమ కలిగిన వాడు, ఖచ్చితంగా చేసిన వాగ్దానము నెరవేర్చు వాడు మరియు ఎప్పుడూ తప్పు చేయని వాడు. బైబిల్ పుటలలో దేవుడు తన ప్రజల పట్ల ఏ విధంగా విశ్వాస్యత చూపారో మనము చూడవచ్చు. అసలు చెప్పాలంటే ఆయన నమ్మదగని వారి పట్ల కూడా నమ్మదగిన వారిగా ఉండును ఎందుకంటే ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏమీ చేయలేరు 2 తిమోతికి 2:13 ఆయన నోవాహుతో చేసిన నిబంధనకు నమ్మకముగా ఉన్నారు, అబ్రహామునకు ఇచ్చిన నిబంధనకు నమ్మకముగా ఉన్నారు, ఇశ్రాయేలు ప్రజలను నమ్మకముగా వాగ్ధాన భూమికి నడిపించారు, ఏసేపు కలను నమ్మకముగా నెరవేర్చినారు, ఇచ్చిన మాట ప్రకారము నమ్మకముగా, జనులను చీకటి నుండి పాపము నుండి విడిపించడానికి మెస్సయ్యను పంపించారు...ఇలా ఎన్నో చెప్పుకుంటూ పోవచ్చు.
మరి దేవుడు నమ్మదగినవాడు అయితే మనకేంటి? ఒక విశ్వాస్యత కలిగిన వ్యక్తి నమ్మకమైన వారు, నమ్మదగిన వారు, వారు చెప్పే విషయాలు కాని చేసే పనులు కాని మనము నిస్సంకోచంగా నమ్మవచ్చు. దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి మనము ఆయన మన కిచ్చిన వాగ్ధానములు నెరవేరుస్తారని నమ్మవచ్చు, ఆయన మనలను ప్రేమిస్తున్నారని చెప్పిన మాట నమ్మవచ్చు, నిత్య జీవానికి ఆయన ఒక్కడే మార్గమని నమ్మవచ్చు, మన పట్ల ఆయన తన ఉద్దేశాన్ని నెరవేరుస్తారని నిశ్చయముతో ఉండవచ్చు. అవును దేవుడు
- తన ప్రేమ యొక్క నిబంధనను స్థిరపరచుటలో నమ్మదగిన వాడు ద్వితియోపదేశకాండము 7: 9
- నిర్దోషియై నమ్ముకొన దగిన వాడు ద్వితియోపదేశకాండము 32:4
- చేయునదంతయూ నమ్మకమైనది కీర్తనలు 33:4, 145:17
- మిమ్ములను కాపాడుటలో సత్యమైన వాడు కీర్తనలు 40:11,91:4
- సత్యము ననుసరించి తీర్పు తీర్చును యెషయా 42:4
- నమ్మకముగా వాత్సల్యత చూపించేవాడు యిర్మీయా 3:12, విలాప వాక్యములు 3:23
- నీతిని బట్టి (ఆశీర్వాద) వర్షమును అనుగ్రహించును యోవేలు 2:23
- సహింపగలిగినంత కంటే ఎక్కువగా శోధింప బడనియ్యని నమ్మదగినవాడు 1 కోరింథీయులకు 10:13
- అంతము వరకు నిందా రహితముగా ఉంచగల నమ్మదగిన వాడు 1 కోరింథీయులకు 1:8,9 1 థెస్సలోనియులకు 5:23
- మిమ్ములను స్థిర పరచి దుష్టత్వము నుండి కాపాడగల నమ్మదగిన వాడు 2 థెస్సలోనియులకు 3:3
- క్షమించుటలో నమ్మదగిన వాడు 1 యోహాను 1:9
మరి మన విషయమేంటి? మనము చేసే పనులలో మాట్లాడే మాటలలో దేవుని ఎదుట మనుష్యుల ఎదుట నమ్మకముగా ఉన్నామా? మన చుట్టూ ఉన్నవారు మనలను గూర్చి వీరు నమ్మకస్తులు, సత్యవంతులు, నీతి మంతులు అని చెప్పగలరా? మనము దానియేలు, ఏసేపుల వలె ఏ పరిస్థితి లో అయినా దేవునికి నమ్మకముగా ఉంటున్నామా లేదంటే ఇశ్రాయేలు ప్రజల వలె మరల మరల దేవునికి నమ్మదగని వారముగా ఉంటున్నామా? మరియు మన దేవునిని వెంబడించ డములో, దేవునికి ఇచ్చుటలో, మన డబ్బుల విషయములో, దేవుడు ఇచ్చిన తలాంతులు, వరములు ఆయనను సేవించుటకు వాడుటలో, మనకు ఇచ్చిన పనిలో, కర్త వ్యాలలో, మనకు అప్పగించబడిన వాటిని నిర్వహించుటలో, మన యొక్క తల్లిదండ్రుల, భార్య లేక భర్త, పిల్లల,సోదరసోదరీల పట్ల మన సంబంధాలలో, ప్రార్థనలో మరియు మరణము వరకు నమ్మకముగా ఉన్నామా? ఈ ప్రశ్నలన్నీ ఎవరికి వారు వేసు కోవాలి.
మరి మీరు నమ్మదగిన వారయితే అప్పుడు దేవుడు మీకు తగిన ప్రతిఫలమిచ్చి మిమ్ములను అభినందిస్తారు *భళా, నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైనవాటిమీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని(మూలభాషలో-ప్రవేశించుమని) మత్తయి 25: 23
లేదంటే , ప్రార్థనా పూర్వకముగా మీరు మీ హృదయం లోనికి చూసుకొని, మీలో ఏమి విషయాలు సరిచేసుకుంటే మీరు నమ్మకస్తులుగా మారతారో అది దేవుని వాక్యము ద్వారా తెలుసుకొని అవి పాటించాలి.
11 May 2017
దేవుని యొక్క పరిశుద్ధత
1పేతురు 1: 14,16 నేను పరిశుద్ధుడనై యున్నాను గనుక మీరును పరిశుద్ధులై యుండుడని వ్రాయబడియున్నది. మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడైయున్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులైయుండుడి.
దేవుడు తన బిడ్డలు పరిశుద్ధులుగా ఉండాలని ఆశిస్తున్నారు. అది ఒక కట్టడ లేక ప్రామాణము పెట్టడానికే కాదు పాపము జీవితాలను నాశనం చేస్తుందని ఆయనకు తెలుసు కనుక. ఇదే విషయం బైబిల్ యొక్క పేజీలలో మరల మరల నిరూపించబడినది. ఆదాము హవ్వల యొక్క జీవితాలను చూస్తే వారు దేవునికి వ్యతిరేకముగా పాపము చేయక మునుపు దేవునితో చక్కని సహవాసము కలిగిన అద్భుతమైన జీవితాన్ని అనుభవించారు. కాని ఒక్కసారి ఆ చేయకూడని పని చేయడం వల్ల వారి జీవితం మొత్తం తలకిందులైంది. అలానే దావీదు దేవునికి వ్యతిరేకముగా పాపము చేసిన తరువాత అతడి జీవితం పూర్తిగా మారి పోయింది, కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు ఒక దాని తరువాత ఒకటి వస్తూనే ఉన్నాయి. మన జీవితంలో కూడా అంతే, ఆ ఒక్క చిన్న ఆవిధేయత, చిన్న చెడు అలవాటు, చిన్న ఆలోచన అది ఎంత హానిలేనిదిగా అనిపించినా మనము కనుక పశ్చాత్తాప పడి విడిచి పెట్టక పోతే అది మన ఆత్మీయ జీవితాన్ని నాశనం చేస్తుంది. చెప్పాలంటే పాపము మన శరీరం మరియు మానసిక జీవితం మీద కూడా ప్రభావం చూపిస్తుంది. మనము కనుక దేవుని దృష్టిలో సరి అయినది కాదు అని తెలిసి కూడా ఆ పని చేస్తూ ఉంటే అప్పుడు మన మనసు అశాంతి మరియు చిరాకుతో నిండి ఉంటుంది. మన ఆలోచనలలో, మన మనస్సాక్షితో ఎప్పుడూ ఒక పోరాటం జరుగుతూ ఉంటుంది, ఇది మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. దయ చేసి గమనించండి నేను ఇక్కడ విశ్వాసుల గురించే మాట్లాడుతున్నాను.
మరి పరిశుద్ధమైన జీవితం జీవించడం ఎలా? విశ్వాసులమైన మనము మన పోలిక మరియు ప్రామాణికం దేవునితోనే ఉండాలి, మనము నిరంతరం ఈ ముందు విషయాలను జ్ఞాపకం చేసుకోవాలి
🔹మన దేవుడు పరిశుద్ధుడు మరియు ఆయన పాపమును ఖచ్చితంగా ద్వేషిస్తారు.
🔹మనము మన సొంతము కాదు, విలువ పెట్టి కొనబడిన వారము 1కోరింథీయులకు 6: 19,20
🔹మనము క్షయమైన వస్తువుల చేత కాదు కాని ప్రశస్థమైన క్రీస్తు రక్తము చేత విమోచింప బడినాము. 1 పేతురు 1:18,19
🔹అదే సమయంలో మనము ఈ విషయం కూడా అర్థం చేసుకోవాలి, దేవుడు పాపమును ద్వేషిస్తారు పాపిని కాదు. లేదంటే పాపులమైన మన కొరకు ఆయన ఈ భూమి మీదికి దిగి వచ్చేవారే కాదు.
🔹ఆయన మనలను తన రక్తము ద్వారా విడిపించింది తరువాత మన కష్టానికి మనలను వదిలెయ్య డానికి కాదు.
🔹ఆత్మీయ జీవితం జీవించడానికి కావలసిన సమస్తమును ఆయన మనకు ఇచ్చి యున్నారు 2 పేతురు 1:3
మామూలుగా ప్రతి పాపము ఒక ఆలోచన తోనే మొదలవుతుంది, మనమైతే ఆలోచనలు రాకుండా ఆపలేము కాని, దానినే ఆలోచిస్తూ, ఊహిస్తూ ఉండడాన్ని మాత్రం ఆపగలం. ఆలోచన మొదలు కాగానే దానిని అక్కడితో ఆపివేస్తే చాలా సార్లు పాపములో పడకుండా ఉండగలుగుతాం. అందుకే మీ ప్రతి ఆలోచనను, ఊహను క్రీస్తుకు లోబడునట్లు చెరపట్ట నివ్వండి. 2 కోరింథీయులకు10:5
చివరిగా ఒక వేళ మీరు ఇప్పటికే పాపములో పడి పోయినట్లయితే, దానిని దేవుని ఎదుట ఒప్పుకుని, ఆయన క్షమాపణ కొరకు, దయ కొరకు ఆయనకు మొఱ్ఱ పెట్టండి. అయన మిమ్ములను క్షమించి మీ సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేస్తారు 1 యోహాను 1:9 అప్పుడు మీరు ఆయన క్షమాపణను స్వీకరించి మీ పాపమును విడిచి పెట్టండి.
ఇది గుర్తుంచుకోండి, దేవుడు మనలను ప్రేమిస్తున్నారు మరియు పరిశుద్ధతతో సహా కలిపి ఆయన ఆజ్ఞలన్నియు మన లాభము కొరకే ఇవ్వబడినవి అని
10 May 2017
దేవుని యొక్క మంచితనము
నహూము 1: 7 యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గము, తనయందు నమ్మికయుంచువారిని ఆయన ఎరుగును.
నహూము అనగా ఆదరణ మరియు ప్రోత్సాహము. నహూము గ్రంథము, ప్రవక్త అయిన నహూము చేత యూదా ప్రజలకు, నీనెవే పట్టణము యొక్క జరగబోవు నాశనమును గూర్చి ఇవ్వబడిన ప్రవచనము. నీనెవే పట్టణము యూదా ప్రజలను ఎంతో ఇబ్బంది మరియు బాధ పెట్టిన అష్షూరు దేశస్తుల రాజధాని. ఇదే పట్టణమునకు వ్యతిరేకముగా అంతకు ముందు యోనా ప్రవక్త కూడా ప్రవచించారు, అప్పుడు వారు పశ్చాత్తాప పడగా దేవుడు వారి మీదకి పంపబోయే ఉగ్రతను, నాశనమును ఆపి వేశారు. కాని చరిత్ర ప్రకారము తరువాత వారు మరల ఇంకా ఎక్కువగా పాపములో పడిపోయి దేవునికి వ్యతిరేకముగా చెడు పనులు చేసారు. ఆయన పిల్లలయిన ఇశ్రాయేలు, యూదా ప్రజల పట్ల ఎంతో దుర్మార్గంగా క్రూరంగా వ్యవహరించారు. అందువలననే దేవుడు తన బిడ్డలకు ఆదరణ కలిగించడానికి ఆ పట్టణము యొక్క నాశనమును ప్రకటించారు.
విశ్వాసులమైన మనము కూడా ఈ వాక్యము ద్వారా కొన్ని ముఖ్యమైన సంగతులు నేర్చుకోవచ్చు.
1. మొదటగా, దేవుడు తన యందు నమ్మికయుంచువారిని ఆయన ఎరుగును. ఆయన పిల్లల పట్ల ఆయన మంచితనము ఎప్పటికీ తరిగి పోదు.
2. రెండవదిగా, కొన్ని సార్లు నీతిమంతులు కష్టాలు పడుతూ, చెడుతనము గెలుస్తూ ఉన్నట్లు అనిపించివచ్చు, కాని నిజానికి ఒక రోజు న్యాయమైన తీర్పు రాబోతోంది. దేవుడు చెడుతనముకు తప్పక ప్రతీకారము తీరుస్తారు. నహూము 1: 2 యెహోవా రోషముగలవాడై ప్రతికారము చేయువాడు, యెహోవా ప్రతికారము చేయును; ఆయన మహోగ్రతగలవాడు, యెహోవా తన శత్రువులకు ప్రతికారము చేయును, తనకు విరోధులైన వారిమీద కోపముంచుకొనును.
3. చివరిగా, దేవుడు ఆయనకు విరోధముగా పాపములో జీవించు వారి పట్ల కూడా దయను, దీర్ఘశాంతమును చూపిస్తున్నారు. ఆయన మంచితనమును బట్టి వారికి అనేక హెచ్చరికలు పంపిస్తున్నారు. ఒక వేళ వారు కనుక పశ్చాత్తాపపడి తమ పాపములు విడిచి పెట్టి న్నట్లయితే ఆయన వారిని మరణము నుండి నాశనము నుండి తప్పిస్తారు. అలా కాకుండా వారు తమ పాపములో కొన సాగితే వారు దేవుని యొక్క ఉగ్రతను ఆయన తీర్పును చూడ వలసిందే.
కాబట్టి ప్రియమైన విశ్వాసీ, నీవు ఎలా జీవిస్తున్నావో జాగ్రత్తగా గమనించుకో, ఒక రోజు మన ప్రతి ఆలోచనను దేవుడు తీర్పు తీర్చ బోతున్నారు. రోమీయులకు 2: 6, 16 ఆయన ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. దేవుడు నా సువార్త ప్రకారము యేసు క్రీస్తుద్వారా మను ష్యుల రహస్యములను విమర్శించు దినమందు ఈలాగు జరుగును.
మన రక్షణను భయముతోను వణకుతోను కొనసాగించుకొందాము.ఫిలిప్పీయులకు 2: 12
8 May 2017
నీ పట్ల దేవుని ఉద్దేశం
యిర్మియా 29: 11 నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును, రాబోవు కాల మందు మీకు నిరీక్షణకలుగునట్లుగా అవి సమాధానకర మైన ఉద్దేశములేగాని హానికరమైనవి కావు; ఇదే యెహోవా వాక్కు.
ఆయనే దేవుడు మరియు దేవుడు మనలను ప్రేమిస్తున్నారు అని తెలుసుకున్న తరువాత కూడా మన భవిష్యత్తు గురించి, పరిష్కారం కాని సమస్యల గురించి, ఇంకా తీరని అవసరతల గురించి మరియు తెలియని మార్గాల గురించి మనము చింతిస్తూనే ఉంటాము. ముఖ్యంగా భవిష్యత్తును గూర్చిన చింత మనకు అధికముగా ఉంటుంది. నాకు మంచి job దొరుకుతుందా? నాకు ప్రమోషన్ వస్తుందా? నాకు మంచి partner దొరుకుతారా? నేను బాగా settle అవుతానా లేదా? ...మొదలగు అనేక ప్రశ్నలు. ఇలా ఈ ప్రశ్నలు మనము కలిగి ఉండడం సహజమే మరియు దేవుడు ఇది అర్థం చేసుకుంటారు. ఆయనకు తెలుసు, మనము మానవులం చాలా బలహీనుల మని మరియు మన జీవితానికి సంబంధించిన అన్ని విషయాల్లో ఆయనను పూర్తిగా నమ్మడము మనకు కష్టమని తెలుసు. అందుకే ఆయన మరల మరల భయ పడవద్దని,ఆయనను నమ్మ మని మనకు గుర్తు చేస్తూనే ఉంటారు. అంతే కాదు మనము కొన్ని సార్లు అవిధేయతతో దారి తప్పి పోతాము అని కూడా ఆయనకు తెలుసు. మరియు మనము కనుక పశ్చాత్తాప పడి ఆయన వైపు తిరిగితే మళ్ళీ మనలను ముందుకు నడిపిస్తారు.
ఈ రోజు వాక్య భాగము యొక్క సందర్భాన్ని చూస్తే, దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఎన్నో హెచ్చరికలు పంపారు, తమ దుష్టత్వాన్ని వదిలి ఆయన వైపు తిరుగమని. అలా చేయని పక్షంలో బబులోను రాజైన నెబుకద్రెజరును పంపి యెరూషలేము పట్టణమును నాశనము చేస్తాను అని చెప్పారు. కాని వారు ఆయన మాట వినకుండా తమ సొంత మార్గాల్లోనే నిలిచారు. దేవుడు తాను హెచ్చరించిన విధంగానే బబులోను వాసులు యెరూషలేమును కొల్లగొట్టుటకు అనుమతించారు, మరియు వారు అనేక మంది ఇశ్రాయేలీయులను చెర పట్టి తీసుకొని వెళ్లారు. దాని తరువాత దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు బబులోను లొనే ఉండి ఆ రాజును సేవించమని ఉపదేశించారు. 70 సంవత్సరాల తరువాత వారిని తిరిగి తమ స్వంత దేశానికి తీసుకొని వెళ్తాను అని వాగ్ధానం చేశారు ( పూర్తి వివరముల కోసం 2 దిన వృత్తాంతములు 36, యిర్మీయా గ్రంధము చదవండి_) చెరలో ఉండడ మనేది అంత సులువైన పని కాదు, మనకు కలిగిన వన్నీ విడిచి పెట్టి, సొంత ఇంటిని, ప్రదేశాన్ని విడిచి ముందు ఏమి జరుగుతుందో తెలియకుండా మనకు తెలియని ప్రదేశానికి వెళ్లడం, అది చాలా కష్టం మరియు భయముతో కూడినది. మరి దేవుడు ఇశ్రాయేలు ప్రజల యొక్క భయాన్ని అర్థం చేసుకున్నారు అందుకే తన ప్రవక్త అయిన యిర్మీయా చేత ఒక లేఖను వారికి పంపారు. ఆ లేఖలో వారికి స్పష్టమైన ఒక హామీ ఇచ్చారు, ఆయన వారి పట్ల సమాధానకర మైన ఉద్దేశము కలిగి ఉన్నారని, హానికరమైన ఉద్దేశములు కావని మరియు ఆయన వారి పట్ల భవిష్యత్తు ప్రణాళిక కలిగి ఉన్నారు కనుక వారికి ఇంకా నిరీక్షణ ఉందని. ఈ వాగ్ధానము ఇశ్రాయేలు ప్రజల యొక్క భయముకు, ప్రశ్నలకు సరిగా సమాధానమిచ్చింది ఎందుకంటే చెర అనేది ఎవరికీ సమాధానకరమైన ఉద్దేశముగా కనిపించదు అది హానికారంగానే కనిపిస్తుంది. అలానే చెరలో ఉన్నప్పుడు ఎవరికైనా ఇక భవిష్యత్తు లేదని నిరీక్షణ లేదని అనిపిస్తుంది.
దేవుడు ఇచ్చిన ఈ వాగ్ధానము ఇశ్రాయేలు ప్రజలకే కాదు ఇప్పటి మనకు కూడా వర్తిస్తుంది. జీవితపు నాలుగు కూడలి వద్ద ఉన్న వారికి, భవిష్యత్తును గూర్చిన నిరీక్షణ కోల్పోయిన వారికి మరియు నిరీక్షణనే కోల్పోయిన వారికి దేవుడు, నీ పట్ల నేను ప్రణాళిక కలిగియున్నాను అని చెప్తున్నారు. ఆయన మార్గాలు, ఆయన ఆలోచనలు కొన్ని సార్లు మనకు అర్థం కాక పోవచ్చు, కాని అవి మన మార్గములు, మన ఆలోచనల కన్నా ఉత్తమమైన వని నమ్మండి యెషయా 55:8-11. ఇంకా శ్రేష్ఠమైన విషయం ఏమిటంటే దేవుడు పరిపూర్ణ పరిశుద్ధుల పట్లే కాదు, కింద పడి ఓడిపోయి తరువాత మరల పశ్చాత్తాపముతో ఆయన వైపు తిరిగిన వారి పట్ల కూడా ప్రణాళిక కలిగి ఉన్నారు. మన దేవుడు మరియొక అవకాశం ఇచ్చే దేవుడు నేనయితే మరి ఒక అడుగు ముందుకు వేసి ఆయన మరి ఎన్నో అవకాశాలు ఇచ్చే దేవుడు అని చెబుతున్నా. ఆయన నీ అంగలార్పును నాట్యముగా మార్చును మరియు దుఃఖమును సంతోషముగా మార్చును కీర్తనలు 30: 11. మీ అవమానమునకు, నిందకు ప్రతిగా రెట్టింపు ఘనత నిచ్చును యెషయా 61: 7. కేవలము ఆయన మీద నమ్మిక ఉంచండి.
అలానే ఈ తరువాత చెప్పబోయే విషయం చెప్పకుండా ఈ message ముగించలేక పోతున్నాను, ఒక వేళ మీరు కనుక ఇంకా దేవునిని నమ్ముకొనని వారై, మీ భవిష్యత్తును గూర్చి చింత కలిగి ఉన్నట్లయితే, మీరు ఇప్పుడే మీ పాపముల విషయమై పశ్చాత్తాపపడి దేవునికి మొఱ్ఱ పెట్టండి. ఆయనను మీ హృదయంలోకి ఆహ్వానించండి. అప్పుడు ఆయన మిమ్ములను మొదట తన
రక్షణ భాగ్యము లోనికి నడిపించి ఆ తరువాత దీవెనకరమైన భవిష్యత్తునకు నడిపిస్తారు.
6 May 2017
సంపూర్ణ మహా ఆజ్ఞ
మత్తయి 28: 20 నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొన వలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నానని వారితో చెప్పెను.
ఆసక్తికరంగా ఈ వాక్యము కూడా దేవుడు తన శిష్యులకు చెప్పాలంటే తన బిడ్డలందరికి అప్పగించిన మహా ఆజ్ఞలో (great commission) భాగమే. మనం మామూలుగా మహా ఆజ్ఞ అంటే వ19, కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు వద్ద ఆపేస్తాం. కాని మహా ఆజ్ఞలో సమస్త జనులను శిష్యులుగా చేయుట, వారికి బాప్తీస మిచ్చుట మరియు వాళ్ళని విశ్వాసములో ముందుకు ఎలా సాగాలో బోధించుట ఇవన్నియు భాగమే.
అపొస్తులు పౌలు విశ్వాసులందరితో ఎప్పుడు touch లో ఉండేవారు, తాను ప్రభువు దగ్గరకు నడిపిన వారితో మరియు ఇతరులు నడిపించిన వారితో కూడా. ఆయన రాసిన పత్రికలే దీనికి ఆధారం. ఆయన ఎక్కడికి వెళ్లినా అవిశ్వాసులను దేవుని వైపు తిరుగమని మరియు విశ్వాసులను ప్రభువునందు నమ్మకముగా నడవమని ఉత్సాహ పరిచే వారు. అయితే మనమందరము పౌలుగారి లాగ పత్రికలు వ్రాయలేము మరియు ఆయన లాగ బోధించ లేము అని తెలుసు మరి మనము ఏమి చేయగలం? మనము చేయవాల్సినదేంటంటే దేవుడు మనకు నేర్పిస్తున్న విషయాలను వారితో పంచుకోవడం. వారిని దేవుని వాక్యము బోధించి, విశ్వాసములో ముందుకు నడిపించగల మంచి దైవజనుని వద్దకు నడిపించడం. వారి విశ్వాసాన్ని బల పరిచే వనరులు చూపించడం.
మన సంఘములో నేను గమనించిందేమిటంటే చాలా మంది దేవుని పైన తమ విశ్వాసాన్ని ఒప్పుకుని అక్కడితో ఆగి పోతున్నారు, మరి కొంత మంది బాప్తీసము తీస్కొనె వరకు వస్తున్నారు కాని ఆ తర్వాత చెప్పటానికి బాధగా ఉన్నా 70% మంది (నాకు 70% అనిపించింది, నా అంచనా తప్పు కావాలని నా ప్రార్థన) అక్కడితోనే ఆగి పోతున్నారు. ఇలా జరగడానికి కారణాలు అనేకం కావచ్చు కాని తప్పకుండా ఒక కారణం మాత్రం వారికి ముందుకు ఎలా వెళ్లాలో తెలియక పోవడం. రక్షణ పొందిన తరువాత ఏమి చెయ్యాలి ఎలా దేవునితో నడవాలి అని చెప్పే వారు లేక పోవడం వలన.
అందుకనే ఒక వేళ నీకు దేవుని కొరకు ఆత్మలు సంపాదించాలి అని ఆశ కలిగి ఉంటే అక్కడితో ఆగి పోవద్దు, వారిని నిత్యము ప్రార్థనలో ఎత్తి పడుతూ వారికి కావలసిన సహకారాన్ని నీకు సాధ్యమైనంత వరకు ఇవ్వమని ప్రాధేయ పడుతున్నాను. అలానే ఒక వేళ నీవు కనుక కొత్తగా దేవునిని నమ్ముకొని ఉన్నా, లేదంటే నమ్మి బాప్తీసము పొంది ఆ తర్వాత ఏమి చెయ్యాలో తెలియక ఉన్నా, లేక దేవుని నుండి దూరంగా వెళ్లి ఉన్నా నీవు వెంటనే మంచి ఆత్మీయ సహవాసం వైపు తిరుగు. అలానే ఖచ్చితంగా చెయ్యాలి అని లేదు కాని మనకు మన ఇంటిలోని వారో లేదంటే friends లో కానీ, మన ఆత్మీయ జీవితం గురించి open గా మాట్లాడగల ఒక వ్యక్తి ఉంటే అది మనకు మంచిది. అప్పుడు మనము జవాబుదారీతనం కలిగి ఉంటాం.
దేవునికి సమీపముగా నడుచుటకు సహాయం చేసే ఆత్మీయ స్నేహితులను, అభిషేకం కలిగిన దైవ జనులను మన మంచి దేవుడు మనకు దయ చేయును గాక.
5 May 2017
దేవుని యొక్క ప్రేమ
మలాకీ 1: 2 యెహోవా సెలవిచ్చునదేమనగా నేను మీయెడల ప్రేమ చూపియున్నాను, అయితే మీరు ఏ విషయమందు నీవు మా యెడల ప్రేమ చూపితివందురు.
నిన్నటి దినాన, ఊరక ఉండి ఆయనే దేవుడు అని తెలుసుకోండి అనే విషయము గురించి వ్రాయడం జరిగింది. అది మన క్రైస్తవ ప్రయాణములో మొదటి అడుగు. ఈ రోజు తరువాతి అడుగు గురించి వ్రాయబోవు చున్నాను, అది దేవుడు మన ఎడల (అనగా నీ పట్ల నా పట్ల) కలిగిన ప్రేమను గురించి తెలుసుకొని దానిని నమ్మడం. దేవుడు నిన్ను ప్రేమించుచున్నాడు, అను ఈ విషయమే క్రైస్తవ విశ్వాసము యొక్క ముఖ్యమైన సంగతి మిగతావన్నీ దీనిపై ఆధార పడినవే. మన విశ్వాసము, మన విధేయత, మన సేవ అన్నీ, దేవుడు నన్ను ప్రేమించుచున్నాడు అనే దాని పైన ఆధార పడి ఉండాలి. మరి ప్రశ్న ఏమిటంటే నీవు దీనిని నమ్ముతున్నావా, యోహాను 3:16 వచనాన్ని నీ హృదయమంతటితో నమ్ముతున్నావా? నీవు ఎలా ఉన్నావో అలానే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నారని నమ్ముతున్నావా? నీవు నిజముగా రోమీయులకు 5:8 ని నమ్ముతున్నావా? ఆయన ప్రేమ పరిమితులు లేనిది, షరతులు లేనిది అని నీవు నమ్ముతున్నావా?
ఈ మధ్య కాలంలో నేను చాలా మథన పడ్డాను, కొన్ని విషయాల్లో నా ప్రార్థనకు జవాబు ఎందుకు రావడం లేదు, కొన్ని విషయాల్లో ఆశీర్వాదం ఎందుకు చూడలేక పోతున్నాను, కొన్ని విషయాల్లో సిగ్గును అవమానమును ఎందుకు పొందుతున్నాను అని . అయితే సమస్య ఏమిటంటే, ప్రియమైన వారలారా, మనము, మన జీవితంలో కొన్ని కొన్ని కలిగి ఉండడానికి మనము అర్హుల మని అనుకుంటాము. మన నిజమైన తగ్గింపు లేదంటే వేషధారణమైన తగ్గింపును పక్కన పెడితే, మన హృదయాంతరంగములో ఎక్కడో ఒక మూల కొన్ని వస్తువులు కలిగి ఉండుటకు మనము అర్హులము అనే భావన ఉంటుంది. అవి మనకు దొరకనప్పుడు మనము కోపము తెచ్చుకొని ఆగ్రహము చెందుతాము. నేనూ అదే తప్పు చేసాను, నా దగ్గర అప్పటికే ఉన్నవన్నీ నాకు చెందాల్సినవే అని, అవి ఆశీర్వాదాలు కావని, ఇంకా ఏవో నాకు దేవుడు ఇవ్వాల్సిందే అన్నట్లు ఆలోచించాను. చూడండి, మనుష్య హృదయం ఎంత దుష్ట మైనది, బుద్ధిహీన మైనది. మన అవివేకములో శ్రేష్ఠమైన మరియు సంపూర్ణమైన ప్రతి వరమును తండ్రియొద్ద నుండి వచ్చును యాకోబు 1: 17 అను సంగతిని మర్చిపోతూ ఉంటాము, మనము పీల్చే గాలి, మన యొక్క శ్వాస కూడా దేవుని యొక్క వరమే.
దేవుడు తన మంచితనాన్ని బట్టి, ఆయన నన్ను ప్రేమించుచున్నారు అనే ఈ వెలుగును నా హృదయములో ప్రకాశింప జేశారు. గొప్ప విషయం ఏమిటంటే మనము అపనమ్మకముతో ఉన్నప్పుడు, తండ్రి హృదయం ఎంతో బాధ పడుతుంది అయినా కూడా ఆయన మనలను ప్రేమతో నిజములోనికి నడిపిస్తారు. మనము కనుక ఒక్కసారి దేవుని యొక్క ప్రేమపు వెలుగులో చూస్తే అప్పుడు మనము కలిగి ఉన్నదంతయూ ఆయన ప్రేమను బట్టియే అని అర్థం అవుతుంది. అలానే ఒక ధైర్యవంత మైన విషయం చెప్పాలంటే మనకు లేనిదంతయూ కూడా ఆయన ప్రేమను బట్టియే. సమయం కాని సమయంలో వాటిని కలిగి ఉండడం ద్వారా మన జీవితాలను పాడు చేసుకోకూడదని ఆయన ఆశిస్తున్నారు. ఒక వేళ తరువాత అవి కలిగి ఉండుట మనకు మేలైతే ఆయనే మనకు వాటిని ఇస్తారు. కీర్తనలు 121:5 చెప్పినట్లు "యహోవాయే నిన్ను కాపాడువాడు" ఆయన మనలను ఆపద నుండి, చెడు నుండి, పాపము నుండి, మన జీవితాలను నాశనము చేసుకోకుండా కాపాడువాడు. అదే తండ్రి యొక్క హృదయం. ఆయనకు అంతా బాగా తెలుసు, ఆయనే దేవుడు మరియు ఆయన మనలను ప్రేమించుచున్నారు. ఎంత అంటే మనకు ఉపయోగ పడేవి ఇచ్చేటంత, మన జీవితాన్ని నాశనము చేసేవి ఇవ్వనంత అంతగా ఆయన మనలను ప్రేమిస్తున్నారు.
ఈ రోజు వాక్య భాగాన్ని చూసినట్లయితే, ఇశ్రాయేలీయులు దేవుని ప్రేమను ప్రశ్నిస్తున్నారు, మనము కూడా ఎన్ని సార్లు ప్రశ్నించాము ఆయన ప్రేమను, ఎన్ని సార్లు ఆయన ప్రేమను అర్థం చేసుకో కుండా ఆయన మీద కోపం తెచ్చుకున్నాం?
మన విశ్వాసము మరియు మన విధేయత కనుక దేవుడు నన్ను ప్రేమిస్తున్నారు అనే విషయం మీద ఆధారం చేసుకుంటే మన జీవితంలో ఎన్నో తలనెప్పులు తగ్గించు కోవచ్చు. మనము ఎంత బాగా ఉన్నామా లేదా ఎన్ని పనులు చేస్తున్నామా, మనము ఏమేమి కలిగి ఉన్నామా, లేక మనము దేవుని కొరకు ఎంత, ఏమేమి చేస్తున్నామా అనేది కాదు ఆయన మనలను ప్రేమిస్తున్నారు అనేదే ముఖ్యము. ఆయన ప్రేమయే మనలను పరిశుద్ధముగా జీవించడానికి, ఆయనను ప్రేమించడానికి, ఆయనను సేవించడానికి మరియు ఆయన కొరకు జీవించడానికి పురి కొల్పుతుంది. అదే దేవునితో నడుచుటకు సరైన పద్ధతి. ఈ నిజాన్ని మన హృదయములో నాటబడనిస్తే మనము లోపలి నుండి బయటకు మార్చ బడతాము, ఆయన ఆజ్ఞలను పాటించడానికి, బైబిల్ చదవడం ప్రార్థన చేయ డానికి కష్ట పడము, ఆయన సేవ చేయడం భారంగా అనిపించదు ఎందుకంటే అలా చేయడం మనకు సంతోషముగా అనిపిస్తుంది. దేవునితో సమయం గడపడానికి ఇష్టంగా ఎదురు చూస్తాం ఎందుకంటే మానవుల మైన మనం మనలను ప్రేమించే వారి వద్ద ఉండడానికి ఇష్ట పడతాం. మన హృదయాలు ప్రేమించబడుటకు చేయ బడినవి.
అందుకే ఇక పోరాడుట మాని, ఆయన ప్రేమను నీ హృదయములో అంగీకరించు. దేవుడు నిన్ను ప్రేమించుచున్నారు, అను ఈ విషయం నీవు తెలుసుకో, నమ్ము, నీ హృదయములో నాటబడనివ్వు.
4 May 2017
ప్రభువే దేవుడు
కీర్తనలు 46: 10 ఊరకుండుడి నేనే దేవుడనని తెలిసికొనుడి అన్యజనులలో నేను మహోన్నతుడ నగుదును భూమిమీద నేను మహోన్నతుడ నగుదును
ఊరకుండుట ఎంత కష్టమైన పని, wait చేయడం ఒక ఎత్తు కాని కదలకుండా ఊరక ఉండడం, అమ్మో! అది ఎంత కష్టమైన పని. కాని ఇక్కడ వాక్య భాగములో దేవుడు కీర్తనా కారుడిని మరియు ఈ కీర్తన ద్వారా మనలను కూడా ఊరక ఉండమని చెప్తున్నారు. అక్కడితో ఆగి పోలేదు ఊరక ఉండి ఆయనే దేవుడు అని తెలుసుకోమంటున్నారు. ఇక్కడ తెలుసు కోవడం అంటే దాని అర్థం, అర్థము చేసుకొని గుర్తించడం, ఆయనే దేవుడని మనము అర్థము చేసుకుని గుర్తించాలి. ఆయనే దేవుడు, ఆయనే అధిపతి, ఆయనే సర్వశక్తిగల ప్రభువు, ఆయనే సమస్తము తెలిసిన వాడు, ఆయనే సమస్త శక్తి గలవాడు, ఆయనే సమస్త జ్ఞానము కలిగిన వాడు. మరియు ఆయన దేవుడు కనుక, అధిపతి కనుక, సర్వశక్తిగల ప్రభువు కనుక, సమస్తము ఎరిగిన వాడు కనుక, సమస్త జ్ఞానము కలిగిన వాడు కనుక, సమస్త శక్తి కలిగిన వాడు కనుక, ఆయన ఆధీనము కలిగి ఉన్నారు, మన జీవితంలోని సమస్త విషయముల మీద ఆధీనము కలిగి ఉన్నారు. మనము అక్కడికి ఇక్కడికి పరిగెత్తాల్సిన పని లేదు, అటు ఇటు తిరుగుతూ నెమ్మది లేకుండా ఏమి చెయ్యాలా అని మనలో మనమే మథన పడాల్సిన అవసరం లేదు. ఆయనే దేవుడు మరియు ఆయనకు ఏమి చెయ్యాలో బాగా తెలుసు. సమస్య ఏదైనా, ఇబ్బంది ఏదైనా, చిక్కులు ఏవైనా ఆయన వద్ద పరిష్కారం ఉంది,దొరుకుతుంది, ఎందుకంటే ఆయన దేవుడు.
అందుకే ప్రియమైన వారలారా మనము ఊరక ఉండి ఆయనే దేవుడు అని తెలుసుకుందాం.
ఆయన సృష్టించిన సమస్తము మరియు ఆయన చేయునదంతయు ఆయన మహిమార్థమే. ఒక రోజు రాబోతోంది ఆ రోజు ప్రతి మోకాలు వంగును, ప్రతి నాలుక ఆయనే దేవుడని ఒప్పుకొనును. మొదటి సారి, వధించుటకు సిద్ధమైన దేవుని గొర్రెపిల్ల వలె వచ్చారు, ఈ సారి సమస్త జనులకు తీర్పు తీర్చే యూదా రాజ సింహము వలె రాబోవు చున్నారు. మొదటి సారి సమాధానకర్తయగు అధిపతిగా వచ్చారు, ఈ సారి నీతిమంతుడైన న్యాయాధిపతిగా రానున్నారు.
అవును ప్రియమైన వారలారా అన్యజనులలో ఆయన మహోన్నతుడగును, భూమిమీద ఆయన మహోన్నతుడగును. మన తలలు వంచి ఆయనను స్తుతించుదాం ఎందుకంటే ఆయన దేవుడు మరియు ఎత్తైన స్థలములలో ఆయన మహోన్నతుడగును.
No comments:
Post a Comment