Thursday, June 1, 2017

June Devotions

24 June 2017

గర్వము మరియు హెచ్చింపు

లూకా 18: 14 అతనికంటె ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన యింటికి వెళ్లెనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడుననియు తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడుననియు చెప్పెను.

ఈ వచనములోని రెండవ భాగము లూకా సువార్తలో రెండు సార్లు, 14 మరియు 18 అధ్యాయాలలో మరియు మత్తయి సువార్తలో ఒక సారి, 23 అధ్యాయములో కనిపిస్తుంది. వాక్య భాగము లోని సందర్భము చూస్తే అది ఆత్మీయ గర్వము గురించి. ఇద్దరు వ్యక్తులు ఒకరు పరిసయ్యుడు మరొకరు సుంకరి ఆలయములో ప్రార్థన చేయు చున్నారు.సుంకరి అయితే తనను తాను తగ్గించుకొని ప్రభువా నా మీద దయ చూపు నేను పాపిని అని ప్రార్థించగా పరిసయ్యుడు అయితే తాను ఇతరుల లాగ చెడ్డ వాడిని కాదని తలంచుచూ కపట ప్రార్థన చేసెను. యేసుక్రీస్తు ఈ ఉపమానము ద్వారా సొంత హెచ్చింపు, సొంత పొగడ్త మరియు సొంత ఘనత అవమానమును తెచ్చిపెడుతుంది అని మరియు ఎవరైతే తమను తాము తగ్గించు కుంటారో వారు హెచ్చింప బడతారని ప్రజలకు బోధించారు. 

గర్వము అనేది దేవుడు ఖచ్చితంగా ద్వేషించే విషయం. యేసు క్రీస్తు భూమి మీద నివసించి నప్పుడు ఆయన ఎంతటి పాపిని అయినా దయతో ఆదరించే వారు కాని స్వనీతి మరియు గర్విష్ఠులను ఆయన గద్దించేవారు. గర్వము లూసీఫరును పడిపోయిన దూతగా మార్చింది, గొప్ప రాజైన నెబుకద్నెజరును ఒక జంతువు మాదిరి గడ్డి తినేలాగ మార్చింది. గర్వము చరిత్రలోని అనేక మంది గొప్ప వ్యక్తుల జీవితాలను నాశనం చేసింది. ఒకరు ఎంత ఉన్నతి సాధించినా వారు కనుక గర్విస్తే వారు తప్పక కింద పడిపోవాల్సిందే. సామెతలు 16: 18 నాశనమునకు ముందు గర్వము నడచును. పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడచును. ఇంకొక వైపు ఎవరయితే తమను తాము తగ్గించుకున్నారో వారిని దేవుడే హెచ్చించారు, మచ్చుకు మోషే, దానియేలు, యేసేపు మరియు దావీదు జీవితాలను చూడండి. దేవుడు వారిని తమ దీన స్థితి నుండి ఎలా పైకి లేవ నెత్తారో.

అన్ని రకములైన గర్వములలో, ఆత్మీయ గర్వము చాలా ప్రమాదకరమైనది. అది ఎంత సూక్ష్మ మైన దంటే మనము కనుక జాగ్రత్తగా దేవుని వాక్యము ఎదుట మన హృదయాలను సరి చూసుకొనుక పోయినట్లయితే దానిని గుర్తించ లేము. మనము కనుక దేవుడు తన వాక్యము ద్వారా ఇచ్చిన సూచనలను పాటించక పోతే మనకు గర్వము అన్నట్లే యిర్మియా 13: 15 చెవి యొగ్గి వినుడి; యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, గర్వపడకుడి. దేవుని కంటే మనకే బాగా తెలుసు అని మనము ఆలోచిస్తున్నట్లే మరియు అది గర్వము. ఒక వేళ మీరు కనుక మీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకొని ఉండక పోతే దాని అర్థం మీరు గర్విష్ఠులనే కీర్తనలు 10: 4 దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడను కొందురు దేవుడు లేడని వారెల్లప్పుడు యోచించుదురు.

మన జీవితంలో గర్వాన్ని అధిగమించ డానికి, మనము  మనకు కలిగినవి,మన దగ్గర ఉన్నవి అన్నీ ఆశాశ్వతము అని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. అవి మన ఆస్తులు, మన అందము, మన సేవ, మన వరాలు, మన తలాంతులు ,ఏవైనా సరే, సమస్తము దేవుడు యొక్క ఆశీర్వాదము. యాకోబు 1: 17 శ్రేష్ఠమైన ప్రతియీవియు సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధమైనదై, జ్యోతిర్మయుడగు తండ్రియొద్ద నుండి వచ్చును; ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయయైనను లేదు. మరియు మనము వాటిని దేవునికి తిరిగి సమర్పించుకుని ఆయన ఆధిపత్యాన్ని మన సమస్తము మీద అంగీకరించినట్లయితే అప్పుడు దేవుడు వాటిని మనకు మరియు ఇతరులకు కూడా ఆశీర్వాదముగా చేస్తారు. మన విలువ దేవుని వద్ద నుండే వచ్చును మరియు ఆయన ఒక్కడే సమస్త మహిమకు పాత్రుడు. 

అందుకే దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్ఠమైన చేతిక్రింద దీనమనస్కులై యుండుడి.1పేతురు 5:6.

21 June 2017

కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి

1 థెస్సలొనికయులకు 5: 18 ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము.

నాకు తెలుసు ఇది మనందరికీ చాలా సూపరిచితమైన వచనమని మరియు ఈ వచనము మీద అనేక ప్రసంగాలు చదివాము విన్నాము అని. అయినప్పటికీ...ఈ వాక్యంలోని సత్యాన్ని మరొక సారి గుర్తు చేసుకొనడం మనకు మంచిది. ఎందుకంటే క్రైస్తవ మార్గములో నడచుచున్నప్పుడు ప్రతి ఒక్క సత్యాన్ని మరల, మరల గుర్తు చేసుకొనుట ఎంతో అవసరం, అప్పుడే ఆ సత్యం మన హృదయంలో నాట బడుతుంది. లేదంటే దుష్టుడు వచ్చి దానిని ఎత్తుకొనిపోయి మనలను విశ్వాసములో బలహీనులుగా చేసి తద్వారా ఫలహీనులుగా చేయును. మత్తయి 13:19

ఈ రోజు వాక్య భాగము అపొస్తలుడైన పౌలు థెస్సలోనికా క్రైస్తవులకు ఇచ్చిన 3 అంశములు గల సూచనలో చివరి భాగము. మొదటిది: ఎల్లప్పుడు సంతోషముగా ఉండుడి; రెండవది: ఎడతెగక ప్రార్థన చేయుడి మరియు మూడవది: ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇవన్నియూ చేయుట యేసుక్రీస్తునందు మన విషయములో దేవుని చిత్తము. గమనించండి, దేనినో బట్టి సంతోషించుట కాదు, ఎవరో ఒకరికి ప్రార్థించుట కాదు మరియు ఎవరో ఒకరికి కృతజ్ఞతలు చెల్లించుట కాదు కాని క్రీస్తు నందు దేవునిలో సంతోషించుట, ఆయనను ప్రార్థించుట మరియు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట.

కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట అనేది మనలను నిరాశ నుండి బయటకు తెస్తుంది అనేది మన అందరికి తెలిసిన విషయమే. కృతజ్ఞతా హృదయము కలిగిన వ్యక్తి  ఆశా దృక్పథం, సంతోషము కలిగి ఉంటారు మరియు తొందరగా ఒత్తిడికి లోను కారు. మనకు కలిగిన ఆశీర్వాదాలను బట్టి మరియు అంతా సవ్యముగా ఉన్నప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట సులువు. కాని పౌలు భక్తుడు మనలను అన్ని విషయములందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట అనే లోతైన అడుగు వేయమని చెబుతున్నారు. ప్రతి విషయము అనగా ఏమిటి? ప్రతి విషయమనగా సమస్త విషయములు, అనగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప లేని ఏ పరిస్థితి, సమస్య మరియు విషయము లేదు. మనకొచ్చే తరువాత ప్రశ్న ఇది ఏ విధంగా చెయ్యగలము? ముఖ్యంగా ఏదన్నా లేదా ఎవరినన్నా పోగొట్టుకొని ఉన్న బాధలో ఉన్నప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఎలా చెల్లించ గలము? అప్పుడే ముందు రెండు వచనాలు మనకు సహాయ పడతాయి, మనము దేవుని యందు ఆనందించుట మొదలు పెట్టినప్పుడు మరియు మన ప్రతి యొక్క ప్రార్థనా విజ్ఞాపనలను ఆయనకు సమర్పించు కొనుచూ ఉంటే అప్పుడు మనము దేవుడు సమస్తము మీద ఆధీనము కలిగి ఉన్నారని మరియు సమస్తమును మన మేలు కొరకు జరిగించునని నమ్మకము కలిగి ఉంటాము అప్పుడు స్వయంచాలకంగా (automatically) దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాము.

దేవుడు మనకు ఇచ్చే ప్రతి సూచన మన మేలు కొరకే, ఈ విషయాన్ని మనము  విశ్వసించాలి. దేవుడు మనకు ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని చెప్పి నప్పుడు మనము ఎదో చెయ్యాలి కదా అని చెయ్యడం కాదు కాని మనస్ఫూర్తిగా చెయ్యాలి అని ఆయన ఆశిస్తున్నారు. అవును కొన్ని సార్లు మొదట్లో మనము ఉద్దేశపూర్వకంగా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ప్రారంభించాలి అప్పుడు మన దృష్టి మనము ఉన్న కఠిన మైన సమస్య లేదా పరిస్థితి మీద నుండి దేవుడు మన జీవితంలో చేసిన మేలుల మీదికి మరలు తుంది అప్పుడు మనము మన కఠిన మైన సమస్య లేదా పరిస్థితిని బట్టి కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించ గలుగు తాము. అందుకే ఆశీర్వాదాలు లెక్కపెట్టడం అనగా దేవుడు మన జీవితంలో జరిగించిన మేలులను గుర్తు చేసుకోవడం అనేది కృతజ్ఞతా హృదయం కలిగి ఉండడానికి దోహదం చేస్తుంది.

చివరిగా ప్రియమైన వారలారా,  దేవుడు ఇచ్చిన మిగతా సూచనల వలె ఈ 3 సూచనలు కూడా మన స్వశక్తి తో పాటించగలగడం అనేది అసాధ్యం. దేవుడు కూడా మన అంతట మనమే వీటిని పాటించాలని ఆశించరు అందుకే ఆయన మనలను మనతో ఎప్పటికీ ఉండే ఆలోచనకర్త మరియు మార్గనిర్దేశకుడైన పరిశుద్ధాత్మతో ముద్రించారు. పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో, ఆయన నడిపింపునకు చెవియొగ్గి, ఆయన మనతో మాట్లాడినప్పుడు విధేయత చూపినట్లయితే మనము దేవుడు మనకు ఇచ్చిన ఈ ప్రశస్థమైన సత్యాలను అనుసరించ గలుగుతాము.
మన హృదయములు ఎల్లప్పుడూ అద్భుత ఆశ్చర్యకరుడైన మన దేవుని పట్ల కృతజ్ఞతాస్తుతులు కలిగి ఉండును గాక.

ఈ వాక్య ధ్యానాన్ని మనకు తెలిసిన పాట లోని ఈ క్రింది మాటలు వ్రాయకుండా ముగించలేక పోతున్నాను

ఎల్లవేళలందు కష్ట మందైనను
కృతజ్ఞతాస్తుతులు చెల్లింతున్
యేసువా నిన్ను నే స్తుతింతున్ స్తుతింతున్
జీవిత మంతయు స్తుతింతున్

20 June 2017

తృప్తి కలిగి యుండుడి

హెబ్రీయులకు 13: 5 ధనాపేక్షలేనివారై మీకు కలిగినవాటితో తృప్తిపొందియుండుడి.నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పెను గదా.

హెబ్రీయులకు వ్రాసిన పత్రిక ఆ సమయంలో గొప్ప హింసను వ్యతిరేకతను (persecution) ఎదుర్కొంటున్న యూదా క్రైస్తవులను ఉద్దేశించి వ్రాయ బడినది. మరియు ఈ చివరి అధ్యాయమైన 13వ అధ్యాయములో గ్రంథ కర్త హెబ్రీయులను విశ్వాసములో స్థిరముగా ఉండమని ప్రోత్సహించి, వారికి భక్తి జీవితం సఫలముగా జీవించుటకు కావలసిన కొన్ని మార్గదర్శకాలను ఇచ్చి ఉన్నారు.

ధనము అనేది మనకు ఎంత అవసరమైనదో అలానే అది మనకు అంత తలనొప్పులు తెచ్చి పెట్టేది గాను ఉంటుంది. కొంత మంది తమకు డబ్బు ఉంటే చాలు అప్పుడు అన్నీ దొరుకుతాయి అనుకుంటారు కాని అది చాలా తప్పు  ఆలోచన. డబ్బు ఎంతో ఖరీదైన మరియు వసతులు కలిగిన వైద్యాన్ని ఇవ్వగలదు కాని ఆరోగ్యాన్ని ఇవ్వ లేదు, ఎంతో విలాసవంతమైన జీవితాన్ని ఇవ్వగలదు కాని సమాధానం కలిగిన జీవితాన్ని ఇవ్వలేదు. ముఖ్యంగా ధనము ఆత్మ సంబంధమైన ఏ అవసరతను తృప్తి పరచ లేదు. ఇంకా అపొస్తలుడైన పౌలు చెప్పినట్లు 1తిమోతికి 6: 9-10 ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములును హానికరములునైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్షసమస్తమైన కీడులకు మూలము; కొందరు దానిని ఆశించి విశ్వాసమునుండి తొలగిపోయి నానాబాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి.
దయచేసి అర్థం చేసుకోండి ధనము చెడ్డది కాదు మరియు డబ్బు సంపాదించుట తప్పు కాదు. అలానే దేవుని ఉద్దేశం కూడా మనము ధనము కలిగి ఉండ కూడదు అని కాదు కాని మనము మన హృదయాన్ని ఆశాశ్వత మైన దానిపై ఉంచకూడదు అని ఎందుకంటే మత్తయి 6: 21 నీ ధనమెక్కడ నుండునో అక్కడనే నీ హృదయము ఉండును. దానికి బదులుగా ఆయన మన దృష్టిని అసలైన ఐశ్వర్యము మీద అనగా యేసుక్రీస్తను తన మీద ఉంచాలని ఆశించుచున్నారు.

మనము కనుక మిగతా అన్నిటితో పాటు డబ్బు కూడా దేవుడు మనకు అప్పగించ బడినదే అని మరియు మనము కేవలము దానిని నిర్వహించే వారమే (managers) కాని స్వంతదారులము (owners) కాదని గుర్తు పెట్టుకుంటే అప్పుడు దానిని గట్టిగా పెట్టుకోకుండా వదిలి పెట్ట గలుగుతాము. మరియు నిన్ను ఎన్నడూ విడువను ఎడబాయను అని ప్రమాణము చేసిన మరియు *మీ ప్రతి అవసరమును తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తుయేసునందు మహిమలో తీరుస్తాను ఫిలిప్పీయులకు 4: 19 అని ప్రమాణము చేసిన దేవుడు మన వైపు ఉన్నప్పుడు మనకు ఏమి కొదువ? ఏమీ కొదువ లేదు. అందుకే విశ్వాసుల మైన మనము దేనినీ కపటముగా ఆశింపక దేవుడు మనకు అనుగ్రహించిన దానితో సంతుష్టిగా ఉండవచ్చు ఎందుకంటే మన నిజ ధనము పరలోక మందు ఉందని అచ్చట చిమ్మెటయైనను, తుప్పైనను దాని తినివేయదు, దొంగలు కన్నమువేసి దొంగిలరు మత్తయి 6:20 అని ఎరుగుదుము కనుక.

గుర్తుంచుకోండి, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్పలాభసాధనమైయున్నది.1తిమోతికి 6: 6

18 June 2017

బాధలో నిజమైన ఓదార్పు

కీర్తనలు 119: 50 నీ వాక్యము నన్ను బ్రదికించి యున్నది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది.

31 మే 2002 లో మా నాన్న చనిపోయినప్పుడు నన్ను  ఏదీ ఓదార్చ లేక పోయింది, ఒక్క  దేవుడు ఆ మరుసటి రోజు బైబిల్ తెరిచి చూసినప్పుడు చూపించిన వాక్యము తప్ప.  అది రోమీయులకు 8: 28 దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము. నేను అప్పుడు కొత్తగా దేవునిని నమ్ముకొని ఉన్నాను మరియు నాకు ఆ వచనము యొక్క అర్థం పూర్తిగా తెలీదు. అలానే నా మనస్సులో ఎన్నో ప్రశ్నలు మా నాన్న చనిపోవడం ఎలా నాకు మేలుకు కారణ మవుతుంది అని అయినా కూడా ఆ వచనం నా మనసుకు ఓదార్పు నిచ్చింది. అలా అని నా బాధ మాయమైంది అని కాదు, మా నాన్న చనిపోయినందుకు చాలా బాధ అనిపించి ఎన్నో రోజులు , సంవత్సరాలు ఎంతో ఏడ్చాను కాని అలానే ఆ వచనము ఇంకొక వైపు నా మనసుకు ఎంతో నెమ్మదిని ఇచ్చింది. ఈ రోజు వాక్య భాగములో కూడా కీర్తనా కారుడు ఆ విషయాన్నే చెబుతున్నారు, దేవుని వాక్యము అతనిని తన దుఃఖములో ఓదార్చినది మరియు బ్రదికించినది.

ఈ పడిపోయిన లోకములో జీవించే మనమందరము ఒకానొకప్పుడు కష్టము గుండా బాధల గుండా వెళ్లాల్సిందే. ఎంత కాలం మరియు ఎంత కఠినము అనేద ప్రతి ఒక్కరికీ వేరుగా ఉండొచ్చు కాని అందరూ వాటిని తప్పక ఎదుర్కో వాల్సిందే. అయితే దేవుని బిడ్డల మైన మనకు ఆయన సన్నిధి మరియు ఆయన ఓదార్పు యొక్క వాగ్ధానము ఉన్నది. ఆయన వాక్యము మరియు ఆయన వాగ్ధానాలు మనకు నిరీక్షణను ఇస్తాయి మరియు అన్నీ విఫలమైనప్పుడు కూడా అవి మన నిరీక్షణను పునర్జీవింప జేస్తాయి. 

అందుకే ప్రియ మైన వారలారా, మీ సమస్తము విషయయమై ఆయనను నమ్మండి, మీ సంతోషములో, మీ దుఃఖములో, మీరు సాధించిన విజయాలలో, మీ వైఫల్యాలలో, మీ బాధలలో మరియు కష్టాలలో, ఎందుకంటే ఆయన సమస్తమును మీకు మేలుగా మార్చగల సమర్థుడు.

గమనిక: ఈ రోజు fathers day సందర్భముగా ఈ వాక్య ధ్యానాన్ని మా నాన్నకి  dedicate చేస్తున్నాను.

17 June 2017

నమ్మకమా లేక అతినమ్మకమా?

లూకా 22: 33 అయితే అతడు ప్రభువా, నీతోకూడ చెరలోనికిని మరణమునకును వెళ్లుటకు సిద్ధముగా ఉన్నానని ఆయనతో అనగా

మనము దేవుని యందు విశ్వాసము కలిగి ఉండాలి కాని మన విశ్వాసమును బట్టి అతినమ్మకము (overconfidence) కలిగి ఉండకూడదు. ముఖ్యంగా మన భావోద్వేగంలో  దేవుని ఎదుట మనము చేసిన నిబంధనల విషయమై మరింత జాగ్రత్త వహించాలి. ఎందుకంటే భావోద్వేగంలో చేసిన నిబంధనలు పాటించే విషయంలో పడిపోయే అవకాశాలు ఎక్కువ. దీనిని నా జీవితంలో మరల మరల చూసాను, నేను ఎప్పుడయితే నా భావోద్వేగములో ప్రభువా నన్ను నేను పూర్తిగా మరొకసారి సమర్పించు కుంటున్నాను అని మరియు నా హృదయములో ఇప్పుడు అంతా బానే ఉంది, నేను ఏ విషయంలో కూడా పడిపోను అని అనుకున్నప్పుడు, కొన్ని రోజుల్లోనే ఏ పాపములో అయితే పడను అని నమ్మకముగా ఉన్నానో దానిలోనే పడిపోయే దాన్ని.  మరి దాని తరువాత జరిగే దేంటో  మీకు తెలుసు, అపరాధభావం, సిగ్గు, దేవునికి దూరంగా అనిపించడం..మొదలగునవి, నేను అయితే నా వెర్రితనాన్ని చూసి సైతాను గట్టిగా నవ్వుకోవడాన్ని ఊహించుకోగలను.

ఈ రోజు వాక్య భాగము యొక్క సందర్భం చూస్తే, పేతురు కూడా తన విశ్వాసము మీద చాలా నమ్మకము కలిగి ఒక ధైర్యవంతమైన ప్రకటన చేశారు, ఎవరు అభ్యంతర పడినను తాను అభ్యంతర పడనని మరియు చావ వలసి వచ్చినా క్రీస్తును ఎరుగనని చెప్పనని. బహుశా ఆయన క్రీస్తు   యొక్క రూపాంతరము చూడడము వలన కావచ్చు, యేసు యెరూషలేము జయవంతముగా ప్రవేశించినప్పుడు ప్రజల యొక్క స్పందన చూచుట వలన కావచ్చు.  ఒక వేళ ఆయన క్రీస్తే మెస్సయ్య కాబట్టి తాను గెలిచే వైపు ఉన్నానని, దేని గురించి లేదా ఎవరి గురించి కూడా భయపడ వలసి లేదని అలా నమ్మకము కలిగి ఉండొచ్చు. అతని నమ్మకము సరియైనదే కాని సంపూర్ణమైనది కాదు ఎందుకంటే అతని దృష్టి కేవలము ఈ లోకము మీద ఉండినది.

ఈ వాక్యభాగము మనకు మనము ఎంత బల హీనులమో మరియు సొంతముగా మనము ఈ విశ్వాస జీవితము జీవించ లేమని గుర్తు చేస్తుంది. అవును మనము మన సొంత శక్తితో ఈ విశ్వాస జీవితము జీవించ లేము కాని ఈ వాక్యము ఇంకొక విషయము కూడా గుర్తు చేస్తుంది, మన ప్రధాన యాజకుడైన యేసు క్రీస్తు మనలను నిస్సహాయులుగా వదిలి పెట్టరని. ఆయనకు మన వైఫల్యాల గురించి తెలుసు అయినా కూడా మన కొరకు విజ్ఞాపన చేస్తూనే ఉంటారు.

మనము కింద పడి పోయినప్పుడు మరియు మన నిబంధనలు నెరవేర్చ లేక పోయినప్పుడు ఆయన మనలను ఖండించారు, బదులుగా తన ప్రేమను ఇంకా ఇంకా మనపై కురిపిస్తారు. నేను ఈ విషయాన్ని వ్యక్తిగతంగా అనుభవించాను, నేను విఫలమైన ప్రతిసారి, ఆయన నన్ను ఖండించ లేదు, దానికి బదులు నా హృదయములో ఒక ఖచ్చితమైన ఆయన ప్రేమను అనుభవించాను. సరిగా మాటలలో చెప్పలేను కాని ఖచ్చితంగా చెప్ప గలను ఆయన నన్ను ఆ సమయంలో మరింత ఎక్కువగా ప్రేమించారని. మరియు ఆ ప్రేమయే నన్ను నా మోకాళ్ళ మీద పడి ఆయన ఎదుట పశ్చాత్తాప పడే లాగ చేసింది. అవును ప్రియమైన వారలారా, దేవుని ప్రేమ, ఆయన కృప మనలను పాపమును తేలికగా తీసుకొని దాని వైపే పరిగెత్తే లాగ చేయదు కాని ఆయన ప్రేమ మనలను పాపము విడిచి ఆయనకు దగ్గర కావడానికి బలవంతము చేస్తుంది. 

మన అందరికీ తప్పిపోయిన కుమారుని (లూకా 15:11-32)గురించి  ముఖ్యంగా తండ్రి తిరిగి వస్తున్న కుమారుడిని దూరము నుండే చూసి పరిగెత్తుకొని అతని వద్దకు వెళ్లడం తెలుసు. ఆయన తన కుమారుని ఖండించరు కాని అతనిని ప్రేమతో హత్తు కుంటారు. ఈ సంఘటనను నేను పూర్తిగా అన్వయించుకోగలనని నా హృదయ మంతటితో నేను చెప్పగలను. ఎందుకంటే కింద పడిన స్థితిలో ఉన్న ప్రతి సారి నేను దేవుని వద్దకు తిరిగి వెళ్ళాలి అని నిర్ణయించు కున్నప్పుడు నా పరలోకపు తండ్రి నన్ను తిరిగి రమ్మని ఆహ్వానించడానికి ఎదురుగా నిలిచి ఉండుట చూసాను. 

పేతురు విషయములో కూడా అదే జరిగింది, యేసు అతనిని నిస్సహాయునిగా వదిలి పెట్ట లేదు, తనను పేతురు ఎరుగనని చెబుతాడని హెచ్చరిస్తూనే, అతని కొరకు ప్రార్థన చేయుచున్నానని కూడా చెప్పారు (వ 32-32). మరియు పేతురు పశ్చాత్తాప పడిన తరువాత ఇతరులను విశ్వాసములో ప్రోత్సాహించే బాధ్యతను అతనికి ప్రభువు అప్పగించారు (యోహాను 21:15-17). ఆయన అంత అద్భుత మైన ప్రేమగలిగిన దేవుడు, ఆయన ప్రేమకు అవధులు లేవు.

ఒక వేళ మీరు కనుక దేవునికి దగ్గరగా నడుచు చున్నట్లయితే, మీ నడక విషయమై జాగ్రత్త వహించండి ఎందుకంటే మార్కు 14: 38 మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగానుండి ప్రార్థన చేయుడి; ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనము నాకేమీ కాదులే, నేను ఫలానా ఫలానా పాపములో పడనులే అని అనుకోవద్దు ఎందుకంటే మనము పడము అనుకున్నప్పుడే పడిపోతాము 1కోరింథీయులకు 10: 12 తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను.

ఒక వేళ మీరు కనుక కింద పడి పోయి దేవునికి దూరముగా వెళ్లి మరియు నా విశ్వాసము చాలా వృధా అయినది ఎందుకంటే నేను మరలా పడిపోయాను అనుకోని దేవునికి దూరముగా వెళ్లి పోతూ ఉంటే, దయ చేసి దేవుని వద్దకు తిరిగి రండి. మీరు ఎంత కాలము లేదా ఎంత దూరము వెళ్లినా ఫర్వాలేదు మీరు కనుక వెను దిరిగితే మన పరలోకపు తండ్రి  మీ కన్నా ముందే మీ వద్దకు పరిగెత్తి రావుటను చూస్తారు. జెకర్యా 1: 3b మీరు నాతట్టు తిరిగినయెడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు; ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు.

మరి చివరిగా ఒకవేళ మీరు కనుక ఇంకనూ క్రీస్తును మీ హృదయములో అంగీకరించని వారయితే దయతో మీ హృదయములో జరుగుతున్న పరిశుద్దాత్మ యొక్క ఒప్పుదలను అడ్డుకోవద్దు. ఆయనకు మిమ్ములను సమర్పించుకోండి అప్పుడు మీ జీవితంలో కూడా రక్షణ అనే గొప్ప అద్భుతాన్ని చూడ గలుగుతారు. దయ చేసి ఆ నిర్ణయాన్ని వాయిదా వేయవద్దు ఎందుకంటే 2కోరింథీయులకు 6: 3 ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము.

16 June 2017

శుద్ధ హృదయం

కీర్తనలు 51: 10 దేవా, నాయందు శుద్ధహృదయము కలుగజేయుము నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతన ముగా పుట్టించుము.

మనిషి శరీరంలో గుండె ఒక ముఖ్యమైన అవయవం, అది ఎప్పుడూ విశ్రాంతి తీసుకోదు. ఒక వేళ గుండె కనుక కొన్ని నిముషాలు కొట్టు కోవడం మానితే మనిషి తన ప్రాణాలు కోల్పోయే ప్రమాదముంది. ఆ విధంగానే హృదయం కూడా మనిషి జీవితంలో ప్రాధాన్యమైనది. ఒక వ్యక్తి తన హృదయము నిండిన దానిని బట్టి మాట్లాడును మత్తయి 12: 34-35 . మరియు దూరాలోచనలు, పాపపు తలంపులు హృదయం లోనుండి వచ్చును మత్తయి 15:19.  అందు వలననే శుద్ధ హృదయం కలిగి ఉండుట మరియు దేవుని వాక్యమును హృదయంలో నింపుకొని పాపము మరియు చెడుతనము నుండి దానిని కాపాడు కొనుట ఎంతో ముఖ్యము. 

మన చుట్టూ చూసినట్లయితే ఎంతో చెడు, ఎంతో హింస మరియు ఎంతో బాధతో నిండి యుండుట చూస్తాము. కాని ఎవరి వైపైనా వేలెత్తి చూపే ముందు  మనము ఒకటి అర్థం చేసుకోవాలి, ప్రతి మనుష్యుడు చెడు చేయగలిగిన సమర్థత కలిగి ఉంటారు అని. చరిత్ర చూసినట్లయితే ఎంతో హింసాత్మక మరియు చెడ్డ పనులు చేసిన వారు ఎంతో మంది చాలా సామాన్య మనుషులు. ప్రతి వ్యక్తి చెడు హృదయంతో జన్మిస్తారు, ఈ విషయం మనము ఏ చిన్న బిడ్డను చూసినా అర్థం చేసుకోవచ్చు, చిన్న పిల్లలకు మనము అబద్ధం చెప్పడం, కోప పడటం నేర్పించ నవసరం లేదు, వారికి అది సహజం గానే వస్తుంది. యిర్మియా 17: 9 హృదయము అన్నిటికంటె మోసకరమైనది, అది ఘోర మైన వ్యాధికలది, దాని గ్రహింపగల వాడెవడు? అందుకనే సమాజము మారాలంటే మొదటగా మనుషుల హృదయాలు మారాలి. ఎంతగా బయటి విషయాల్లో క్రమశిక్షణ కలిగి ఉన్నా హృదయం మారక పోతే ఉపయోగం లేదు మరియు లోపలి నుండి మార్పు వస్తేనే ఆ మార్పు శాశ్వత మవుతుంది. మరియు హృదయాలను మార్చ గలిగినది ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కరే. 

విశ్వాసుల మైన మన విషయానికి వస్తే, మనము మన హృదయాలను దేనితో నింపుకుంటున్నామో దాని పట్ల జాగ్రత్త వహించాలి. నేను దైవ జనుడైన రవి జకరయాస్ గారు తన ఒక ప్రసంగములో ఈ విధంగా చెప్పడం విన్నాను, 'ఒక వ్యక్తి చిన్న (కాగితపు కొస తగిలి తెగిన గాయము) గాయము కలిగి ఉన్నప్పుడు అతను కనుక వ్యాధి కలిగిన మనిషి రక్తము ముట్టుకుంటే అతనికి ఆ భయంకరమైన వ్యాధులు శోకే అవకాశము చాలా ఉంటుంది మరి అలాంటిది మన ఆత్మకు కలిగించే గాయాల విషయంలో మనము ఇంకెంత జాగ్రత్త వహించాలి', నిజమే కదా. సైతాను చాలా మోసకరమైన వాడు, వాడు మెల్లగా చిన్న చిన్న అబద్ధాలను మనకు హాని లేనివిగా కనిపించే టీవీ ప్రోగ్రామ్స్ ద్వారా మరియు మనము చదివే పుస్తకాల ద్వారా మనలోకి పంపిస్తూ ఉంటాడు. అందుకే మనము చూసే టీవీ ప్రోగ్రామ్స్ మరియు చదివే పుస్తకాల పట్ల జాగ్రత్త వహించాలి. యేసు క్రీస్తు మన కన్ను దేహమునకు దీపమని, కన్ను కనుక చెడినదైతే మన దేహమంతా చీకటితో నిండి ఉంటుందని మత్తయి 6:23 చెప్పడంలో ఆశ్చర్యం లేదు. మన కనుల ముందు ఏ చెడు విషయములు ఉంచు కోమని దేవునితో మనము నిబంధన చేసు కోవాలి కీర్తనలు 101:2-3.

మరియు ఈ రోజు వాక్య భాగములోని కీర్తనా కారుని వలె మనము కూడా శుద్ధ హృదయం మరియు స్థిర మైన మనస్సు కొరకు దేవునికి మొఱ్ఱ పెట్టినట్లయితే ఆయన మన ప్రార్థనను ఘన పరిచి, జవాబుగా నూతన హృదయము మరియు నూతన మనస్సును దయ చేస్తారు. యెహేజ్కేలు 36: 26 నూతన హృదయము మీ కిచ్చెదను, నూతన స్వభావము మీకు కలుగజేసెదను, రాతిగుండె మీలోనుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చెదను.

7 June 2017

సందేహ పడినప్పుడు

మత్తయి 14: 31 వెంటనే యేసు చెయ్యిచాపి అతని పట్టుకొనిఅల్పవిశ్వాసీ, యెందుకు సందేహపడితివని అతనితో చెప్పెను.

యేసు క్రీస్తు యొక్క శిష్యులందరిలో ఎప్పుడూ ముందుగా లేదా తొందరగా స్పందించేది పేతురు భక్తుడే. ఆయన అత్యుత్సాహం అప్పుడప్పుడూ ఆయనను ఇబ్బందులలో పడవేసినా, అదే ఉత్సాహం ఆయనకు కొన్ని గొప్ప లోతైన అనుభవాలను చూడడానికి అవకాశం కూడా ఇచ్చింది. నీటి మీద నడిచే ధైర్యం, యేసే మెస్సయ్యా అని చెప్ప గలగడం, క్రీస్తు కొరకు చావడానికైనా సిద్ధమని చెప్ప గలిగే తెగువ ఆయనకు మాత్రమే ఉన్నాయి. అలానే అయన తొందరగానే తొట్రిల్ల పడే వాడు, ఉదాహరణకు ఈ రోజు వాక్యము యొక్క సందర్భాన్ని చూసినట్లయితే ఆయన నీటి మీద నడవ సాగి ఎప్పుడయితే తన దృష్టిని క్రీస్తు మీద నుండి తీసి వేశారో అప్పుడు నీటిలో మునగ సాగారు. 

ఎన్ని సార్లు మనం కూడా మన జీవితాలలో ఇలాంటి అనుభవం గుండా వెళ్ళాము, మనము మన ఆధ్యాత్మిక ఎత్తులో ఉండి, దేవునితో మన సంబంధం చాలా బాగా ఉంది అని అనుకొంటూనే అదే సమయంలొ చుట్టూ చూస్తాం (మన పరిస్థితుల వైపు, మనుషుల వైపు) మరియు వెంటనే నిరాశలో మునుగడం ప్రారంభిస్తాం. మరి పేతురు లానే మునిగి పోతున్న మనలను కూడా రక్షించ గల ఒకే ఒక వ్యక్తి మన ప్రభువైన యేసు క్రీస్తు.

సైతాను మనలో ఎన్నో సందేహాలను నాటాలని ప్రయత్నిస్తూ ఉంటాడు, రక్షణ పొందిన మొదట్లో మనము నమ్మేది నిజమేనా లేక ఊహించు కుంటున్నామా అని సందేహం, తరువాత మన రక్షణ నిజమైనదా కాదా అనే సందేహం, దేవుడు తన వాగ్ధానాలు నెరవేరుస్తారా లేదా అనే సందేహం ఇలా అనేక మైన సందేహాలను కలుగ జేస్తాడు. మనము కనుక జాగ్రత్త వహించక పొతే ఈ సందేహాలలో పడిపోయి అనవసరంగా మన ప్రశాంతతను  పోగొట్టు కోవాల్సి వస్తుంది. గుర్తుందా, సైతాను ఆదాము హవ్వల మనసులో నాటిన ఒక చిన్న సందేహం మనుష్యులందరి దిశగతులను మార్చి వేసింది. 

సందేహం, అది ఎంత చిన్న దైనా దానిని మన మనస్సులోకి రానిస్తే అది మనకు చాలా కష్టాన్ని తెచ్చి పెడ్తుంది. నేను కూడా గత కొద్ది రోజులు కొన్ని విషయాల గురించి సందేహంలో పడిపోయి నా సంతోషాన్ని ప్రశాంతతను పోగొట్టు కున్నాను. కాని మంచి విషయం ఏమిటంటే పేతురును వదిలి పెట్టనట్లుగా దేవుడు నన్ను కూడా వదిలి పెట్ట లేదు,  ఆయన ప్రమాణం చేసినట్లుగా ఎన్నడూ నన్ను విడిచి పెట్ట లేదు, నా సందేహంలో కూడా. మరియు  దేవుని మహా కృపను బట్టి నన్ను నేను ఆయన వాక్యంలో, devotions చదవడంలో, messages వినడంలో నిమగ్నం చేసుకుంటూ ఉండగా ఆయన నెమ్మదిగా నా సందేహమనే మబ్బును విడ గొట్ట డానికి తన వెలుగును నా హృదయము లోనికి ప్రకాశింప జేస్తున్నారు. ఎంత గొప్ప ప్రేమ కలిగిన దేవుడు కదా ఆయన. 

మనమందరము లేదంటే మనలో అనేకులము మన క్రైస్తవ నడకలో ఒక సమయములో సందేహం మరియు గందరగోళం గుండా వెళ్లాల్సి వస్తుంది అయితే దాని లోనుండి తొందరగా బయటకు రాగలిగే ఉత్తమ మార్గం ఏమిటంటే దేవుని వాక్యములో మరియు ఆయన సన్నిధిలో  ఎక్కువగా సమయం గడపడం ద్వారా. ఒక వేళ మీకు కనుక ఆత్మీయ స్నేహితుల fellowship ఉంటే ఇది కొంచం సులభ మవుతుంది, వారితో కలిసి వాక్యము చదవడం, ఒకరికొకరు తమ తమ అవసరతల విషయమై ప్రార్థన చేయడం మరియు ఒకరినొకరు ప్రోత్సహించు కోవడం ద్వారా. అలా కాని పక్షంలో, మిమ్ములను మీరు దేవుని వాక్యంలో మునిగి పోయేలా చేసుకోండి, మంచి క్రైస్తవ పుస్తకాలు చదవండి, messages వినండి, devotions చదవండి అలా చేస్తూ ఉంటే సందేహాలు నెమ్మదిగా కరిగి పోవడం మొదలు పెడతాయి. 

ప్రతి దానిని ప్రశ్నించే గుణం కలిగిన నాలాంటి వారికి ఒక చిన్న మాట, మనము ఏదైనా నమ్మే ముందు ఆధారం లేదా సాక్ష్యం కావాలి అనుకుంటాం కాని దేవుడు మాత్రం ముందు నమ్మండి అప్పుడు ఆధారం,సాక్ష్యం చూస్తారు అని చెప్తున్నారు. అలానే కొన్ని సార్లు మన విశ్వాసపు సాక్ష్యం ఈ జీవితంలో చూడక పోవచ్చు, మరి అయినా కూడా దేవునిని నమ్మడానికి సిద్ద మేనా? అలాంటి సమయాల్లో చేయ వలసిన ఉత్తమ మైన పని ఏమిటంటే మనకు మనము ఈ ప్రశ్న వేసుకోవడం, మనము వెలిచూపు వలన నడుచు చున్నామా లేదా విశ్వాసము వలనా? మరియు దేవుని వాక్యము దేనిని ఎంచుకోమని చెబుతుంది ?

ఈ కొండ గుర్తును మరువ వద్దు, మీకు సందేహము, భయము లేదంటే చింత కలిగి నప్పుడు వెంటనే క్రీస్తు వద్దకు పరుగెత్తండి (మీ మనసంతా ఆయనకు దూరంగా పరిగెత్తమని చెబుతున్నా కూడా). ఒప్పుకుంటాను ఇలా చేయడానికి చాలా ధైర్యం మరియు శక్తి అవసరం అవుతుందని కాని చివరకు అదే తగినదని మనమందరము ఒప్పుకుంటాం.

No comments:

Post a Comment