27 April 2017
లూకా 5: 3 ఆయన ఆ దోనెలలో సీమోనుదైన యొక దోనె యెక్కిదరినుండి కొంచెము త్రోయుమని అతని నడిగి, కూర్చుండి దోనెలోనుండి జనసమూహములకు బోధించుచుండెను.
మనలో చాలా మందికి యేసయ్య పేతురును (తనను వెంబడించమని) పిలిచే ముందు జరిగించిన అద్భుతం గురించి తెలుసు, దీని గురించి లూకా 5:1-11లో చాలా స్పష్టముగా వ్రాయబడి ఉన్నది. అయితే మనము ఈ అధ్యాయం చదివేటప్పుడు సుపరిచితమైనదే కదా అని అలా పైపైన చదువుతూ ఈ రోజు వాక్య భాగాన్ని అనగా వచనము3 యొక్క ప్రాధాన్యతను గమనించడం మర్చిపోతాము. వాక్య భాగాన్ని చూసినట్లయితే, యేసు తన చుట్టూ గుంపుగా చేరిన ప్రజలకు బోధించడం కొనసాగించడానికి సీమోనును దోనెను దరినుంచి కొంచెము త్రోయుమని అడిగెను మరియు **పేతురు ఆయన మాటలకు వెంటనే విధేయత చూపెను**
(** యేసు కూర్చుండి దోనెలోనుండి జనసమూహములకు బోధించుచుండెను అని వ్రాయబడినది కనుక పేతురు దోనె జరిపి ఉంటాడని నేను నమ్ముతున్నాను)
ఈ అధ్యాయము ముఖ్యముగా 3వ వచనములో మనము గమనించ వలసిన కొన్ని విషయాలు:
*చూడండి, పేతురు రాత్రంతా చేపలు పట్టడానికి చేసిన ప్రయత్నం విఫలమైన చిరాకులో కావాలనుకుంటే యేసు అడిగిన పనిని పట్టించుకోకుండా వదిలేసి ఉండవచ్చు. ఒక వైపు తన చింత గురించి ఆలోచిస్తుంటే ఇంకొక వైపు ఒక ప్రసంగి వచ్చి దోనెను జరప మని అడగడం అది కూడా తనకు ఎదో సహాయ పడటానికి కాదు ఇతరులకు బోధించుటకు అడగడం. ఇదంతా ఆలోచించి పేతురు తాను ఆ పని చేయను అని చెప్పి ఉండవచ్చు కాని పేతురు సరియైన పని చేయడానికి నిర్ణయించు కున్నాడు, అతడు దేవునికి విధేయత చూపాడు మరియు అలా చేయడం వలన ఇది అతడి జీవితంలో చూడబోయే అద్భుతానికి మొదటి అడుగు అయ్యింది.
మనము కూడా పెద్ద విషయాల్లోనే కాకుండా చిన్న విషయాల్లో కూడా దేవునికి విధేయత చూపాలి. కొన్ని సార్లు మనము అస్సలు ఊహించ లేము, ఒక చిన్న ప్రాధాన్యత లేని విషయం తరువాత అదే మన జీవిత గమ్యాన్ని మారుస్తుంది అని. అలానే మనము మనకు నేరుగా ఉపయోగ పడని విషయాలలో కూడా దేవునికి విధేయత చూపాలి ఎందుకంటే దేవుని కోసం చేసిన ఏ పని అయినా వృధా కాదు. ఇతరుల అవసరతలను మన అవసరతలు కంటే ముందు పెట్టినట్లయితే, మనము దేవునిని వాటి నిమిత్తము అడుగక ముందే మన అవసరతలు తీర్చబడుట చూస్తాము.
*పేతురుకు ముందుగానే తెలీదు, దేవుడు తన పడవలో అద్భుతం చేస్తారని గాని, అనేక మైన చేపలు తనకు లభిస్తాయని కాని, ముఖ్యంగా దేవుడు తన యొక్క శిష్యునిగా పిలుస్తారని అస్సలు తెలియదు. తాను చేసిన దల్లా విధేయతతో కూడిన ఒక చిన్న పని కాని అదే ముఖ్యమై పని అయ్యింది.
అలానే మనము కూడా ఫలితం ఏమిటో ముందే తెలియక పోయినా దేవునికి విధేయత చూపాలి ఎందుకంటే దేవుడు ఎప్పుడయినా కూడా మన విధేయతకు ప్రతిఫలమిస్తారు.
*పేతురు యొక్క మొదటి విధేయత, చుట్టూ ఉన్న వారు దేవుని వాక్యము సరిగా వినడానికి సహాయ పడింది, అలానే దేవుడు మరియొక సారి వలను విసరమని చెప్పినప్పుడు అతడు చూపిన రెండవ విధేయత వలన పొందిన చేపల పంట తనకు మరియు తన కుటుంబానికి మరియు అతని స్నేహితులకు ఆశీర్వాదముగా మారింది.
దేవుని పట్ల మనము విధేయత చూపడం వలన మనమే కాదు మన కుటుంబం మరియు మన చుట్టూ ఉన్నవారు కూడా ఆశీర్వదింపబడతారు.
*పేతురు తన రోజువారి పనులు అనగా చేపలు పట్టడం, వలను శుభ్రం చేసుకోవడం చేస్తున్నప్పుడు యేసు అతని వద్దకు వచ్చారు.
కొన్ని సార్లు మనము పని చేసే స్థలమే మనకు దేవునితో ఒక గొప్ప అనుభవం కలుగ జేసే ప్రదేశం అవుతుంది. అందుకే దేవుడు మనలను ఎక్కడ ఉంచితే అక్కడ మనము నమ్మకముగా పని చేయాలి.
మరి ఇప్పుడు, ఎన్ని సార్లు మనము చిన్న విషయాలలో దేవునికి ఆవిధేయత చూపాము? ఒక వేళ అది ఒక పెద్ద నిర్ణయం లేదంటే దాని వలన మనకు ఎంతో ఉపయోగం అని అనిపిస్తే మనము దేవుని మీద కనిపెట్టి ఆయన చిత్తాన్ని తెలుసుకొని దానికి విధేయత చూపడానికి ప్రయత్నం చేస్తాం. మరి చిన్నవి, అంతగా ప్రాధాన్యత లేనివి లేదంటే మనకు నేరుగా ఉపయోగ పడని విషయాల సంగతేంటి? ఈ ప్రశ్న లన్నీ ఒక సారి ఈ రోజు వాక్య ధ్యానపు వెలుగులో ఆలోచించి చూడండి.
26 April 2017
యెహోషువ 24: 15 యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన యెడల మీరు ఎవని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవిం చెదరో నేడు మీరు కోరుకొనుడి; మీరె వరిని సేవింప కోరుకొనినను నేనును నా యింటివారును యెహోవాను సేవించెదము అనెను.
కొన్ని ప్రసిద్ధమైన వాక్యాలలాగనే ఈ వాక్యము, చెప్పాలంటే వాక్యం లోని చివరి భాగం కూడా మనము మన ఇంటిలో wall hanging లేదా తలుపుకు పెట్టే word frame లాగ పెట్టుకోడానికి చాలా ఇష్టపడతాం. కాని దీనిని మన ఇంటిలోని అలంకరణ వస్తువు లాగ పెట్టుకోవడమే కాకుండా అసలు ఈ వాక్యము లోని పదాల మీద మనలో ఎంత మంది దృష్టి పెట్టి ఉంటాం? అలానే యహోషువ లాగ, మనము కూడా దేవునిని వ్యక్తిగతంగా లేదా కుటుంబపరంగా సేవించడానికి సిద్ధముగా ఉన్నామా?
యహోషువాకయితే, దేవునిని సేవించడం అంటే ఆయన కట్టడలను, ఆజ్ఞలను నమ్మకముగా అనుసరించట, దేవుడు తనకు అప్పగించిన పని అనగా ఇశ్రాయేలు ప్రజలకు వాగ్ధాన భూమిలో విశ్రాంతి దొరుకు వరకు వారిని నడిపించుట. మరి దేవునిని సేవించుట అంటే మనకు అర్థము ఏమిటి? దీని అర్ధం మనము దేవుని పిలుపును అనుసరించి ఆయన మనకు అప్పగించిన పనిని, ఆయన మనలను ఉంచిన చోట నమ్మకముగా చేయటమే. ఆయనను మనము మనం వెళ్లే చర్చిలో, మనము పని చేసే స్థలములో, మన వ్యాపారములో, మన ఇంటి దగ్గర సేవించవచ్చు. చెప్పాలంటే ఆయనను మనము ఎక్కడైనా సేవించవచ్చు ఎందుకంటే దేవుని సేవ చర్చి గోడల మధ్యకే లేదా ఒక ఫలానా పనికే పరిమితం కాదు.అలాగే మనము ఎక్కడ ఎలా ఆయనను సేవించాలి అని మనలో మనమే సంఘర్షణ పడనవసరం లేదు, మనము చేయవలసినదంతా ఏమిటి అంటే ప్రార్థనాపూర్వకముగా మనలను ఆయనకు అప్పగించు కొనుట మరియు ఆయన మనలను తగిన విధంగా వాడుకొనుటకు సిద్ధముగా ఉండుట. అలా మనము మన చిత్తాన్ని మరియు ఉద్దేశ్యాన్ని ఆయనకు సమర్పించి, ఆయన కొరకు కనిపెడితే, మన సేవ నిమిత్తం ఆయన తలుపులు తెరిచే విధానం చూసి మనము ఆశ్చర్య పోతాము.
D. L. Moodyగారు ఒక ప్రసంగి ఈ విధంగా అనడం విన్నారు, " దేవునికి సమర్పించుకున్న వ్యక్తిని దేవుడు ఏమి చేస్తారో ఈ ప్రపంచం ఇంకా చూడాల్సి ఉంది". ఇది విన్న మూడీ గారు ఆ రాత్రే దేవునికి "దేవుని కృప వలన ఆ వ్యక్తిని నేనే అవుతాను" అని చెప్పి తనను తాను ఆయనకు అప్పగించు కున్నారు. మూడీ గారి ప్రసంగాల వలన ఆయన సేవ వలన దాదాపు ఒక మిలియన్ ఆత్మలు ముట్ట బడ్డాయి అని చెప్తారు. అసలయితే మూడీ గారు పెద్ద చదువుకున్న వారు కాదట, ఆయన ప్రసంగము మొరటుగా ఉండేదట అయినా దేవుడు ఆయనను ఎంతో బలంగా వాడుకున్నారు.
మరి నీవు కూడా ఆయనకు సమర్పించుకుని ఆయన సేవ చేస్తావా? ఈ రోజు మన వాక్య భాగములో చూస్తే, యహోషువా వారు తీసుకోవాల్సిన నిర్ణయాన్ని ఇశ్రాయేలు ప్రజలకే వదిలేశారు అలానే దేవుడు కూడా నిర్ణయాన్ని మనకే వదిలేస్తారు, ఆయన కొరకు బ్రతకాలి మరియు ఆయనను సేవించాలి అనే నిర్ణయం మనమే తీసుకోవాలి. సరి అయిన నిర్ణయం తీసుకో ఈ రోజు.
25 April 2017
యెహోషువ 1: 9 నేను నీ కాజ్ఞయిచ్చియున్నాను గదా, నిబ్బరముగలిగి ధైర్యముగా నుండుము, దిగులుపడకుము జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును.
మనమందరం (కొంతమందిని మినహాయిస్తే) ఏదన్నా కొత్త ప్రదేశానికి మారాలన్నా లేదంటే ఒక కొత్త అవకాశాన్ని తీసుకోవాలన్నా కొంచం ఆలోచిస్తాం. ఒక వైపు కొత్త విషయాలు తెలుసుకోవచ్చనే ఉత్సాహం, మరొక వైపు ఎదో తెలియని భయం, సందేహం, ఇవన్నీ కాక మన మనస్సులో ఎన్నో ప్రశ్నలు, అక్కడ పని ఎలా ఉంటుందో, అక్కడి మనుషులు మనతో ఎలా ఉంటారో, అక్కడ పరిస్థితికి మనము త్వరగా సర్దుకుంటామో లేదో ....అని.
ఇక వాక్య భాగానికి వస్తే, అంత పెద్ద ఇశ్రాయేలు జనాంగాన్ని వాగ్ధాన భూమికి నడిపించడం మోషేకు అంత సుళువు కాలేదు, ఆ విషయం యహోషువాకు బాగా తెలుసు. అతడు ఇశ్రాయేలు ప్రజలు మోషే మీద ఎన్నో సార్లు గొణుగుకొని ఆయన ఓపికను పరీక్షించడం చూసాడు. మరి ఇప్పుడు వారిని నడిపించే బాధ్యత తన భుజాల మీద పడినప్పుడు అతడు తన ముందున్న ఆ గొప్ప పనిని బట్టి భయముతో వణికి పోయి ఉండొచ్చు. అలాగే వారందరు ఇప్పుడు మరొక సారి వాగ్ధాన భూమికి దగ్గరగా వచ్చారు కనుక, అతడు గతంలో ఇశ్రాయేలీయులు భయంతో ముందుకు వెళ్లకుండా వెనుదిరిగి దేవునికి ఏవిధంగా ఆవిధేయత చూపారో గుర్తు చేసుకొని ఉండొచ్చు. మరియు తన ముందు పొంగి పారుతున్న యోర్దాను నదిని చూసినప్పుడు, తన మనసులో ఎన్నో ప్రశ్నలు మెదలి ఉండొచ్చు, దేవుడు మళ్ళీ ఆ విధంగా చేస్తారా? అంతకు ముందు ఎర్ర సముద్రాన్ని రెండుగా చీల్చినట్లు యోర్దాను నదిని కూడా రెండుగా చేస్తారా? అని.
ఇలా ఈ ప్రశ్నలు, సందేహాలతో సతమత మవుతున్న యహోషువాకు, దేవుడు నీవు భయపడవద్దు అని పలుమార్లు గుర్తు చేయడంలో ఆశ్చర్యం లేదు. దేవుడు యహోషువా యొక్క భయాన్ని అర్థం చేసుకున్నారు, ఆయన అతడిని తీర్పు తీర్చడానికి బదులు పలు మార్లు నిబ్బరముగలిగి ధైర్యముగా నుండుము, దిగులుపడకుము జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును. అని చెబుతూ ప్రోత్సాహించారు. అంతే కాదు తాను వాగ్దానము చేసినట్లే దేవుడు చివరి వరకు యహోషువాకు తోడుగా ఉన్నారు, ఇశ్రాయేలు ప్రజలను జయవంతముగా వాగ్ధాన భూమికి చేర్చడంలో అతడికి సహాయం చేసారు.
మనము ఆరాధించే దేవుడు ఎంత గొప్ప దేవుడు! ఆయన మన సంశయాలను, భయాలను, ప్రశ్నలను అర్థం చేసుకో గలరు. మనము సందేహము కలిగి ఉన్నప్పుడు ఆయన మనలను తీర్పు తీర్చక, నెమ్మదిగా ముందుకు వెళ్ళమని మనలను ప్రోత్సాహిస్తారు.
అంతే కాదు ప్రియమైన వారలారా, మీరు ఏ వాగ్ధాన భూమి కోసం ఎదురు చూస్తున్నారో నాకు తెలీదు, కాని ఇది మాత్రం తెలుసు, దేవుడు మీకు మార్గాన్ని తెరుస్తారని మరియు సమృద్ధి ఆశీర్వాదము కలిగిన ఆ ప్రదేశానికి మిమ్ములను నడిపిస్తారని. అడ్డంకి ఏదైనా కావచ్చు, కాని దేవుడు దానిని తొలగించగల సమర్థుడు లేదంటే ఇంకా అద్భుత రీతిగా దాని మధ్యలో నుండే మిమ్ములను నడిపించగల సమర్థుడు. అందుకే ఒక వేళ ఆయన మిమ్ములను ముందుకు నడిపిస్తున్నట్లయితే మీ వంతుగా ఒక చిన్న విశ్వాసపు అడుగును ముందుకు వేయండి.
24 April 2017
కొలస్సీయులకు 3: 17 మరియు మాటచేత గాని క్రియచేత గాని, మీరేమి చేసినను ప్రభువైన యేసుద్వారా తండ్రియైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, సమస్తమును ఆయన పేరట చేయుడి.
ఒక పాస్టర్ గారు ఈ విధంగా చెప్పడం నేను విన్నాను, ఒక ప్రదేశం ఎంత అందమైనదయినా అద్భుతమైనదయినా కావచ్చు, మనము కనుక అక్కడ నివసించడం ప్రారంభిస్తే లేదంటే ఎక్కువ సార్లు దానిని చూడటానికి వెళ్తే మనలోని ఆ సంభ్రమాశ్చర్యము మెల్లగా తగ్గి పోతుంది. అలానే ఒక పని మొదట్లో ఎంత అద్భుతంగా అనిపించినా, మెల్ల మెల్లగా అదొక రోజువారి కార్యక్రమం లాగ, దానిని అవ్వగొట్టి పక్కన పెట్టాలి అన్నట్లు తయారవుతుంది. ఆ పని , మనము చేసే ఉద్యోగం కావచ్చు, సేవ కావచ్చు లేదంటే ఇంటిలో చేసే పని కావచ్చు. అదీ కాక ఒకవేళ మనము, మనము చేసే పనిలో promotion కోసం లేదంటే గుర్తింపు కోసం ఎదురుచూసి, మనము తలచినట్లు జరగకపోతే మెల్లగా నిరాశ లోకి వెళ్తాము అది కాస్త నిస్పృహగా మారుతుంది కొన్ని సార్లు డిప్రెషన్గా కూడా మారుతుంది. మరి దీనికి పరిష్కారం ఏంటి?
కొలస్సీయులకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయములో పౌలు భక్తుడు విశ్వాసులను తమ మనస్సును, హృదయాలను పైనున్న వాటి మీద (నిత్యమైన విషయముల మీద) పెట్టుకొనమని, విసర్జించ వలసిన చెడు స్వభావములు, ధరించి వలసిన దైవిక స్వభావములు, ఒకరినొకరు సహించుకొనుచు, ఒకరినొకరు బోధించుకొనుచూ ఉండమని ప్రోత్సాహించారు. అలానే ఈ విషయాలన్నీ *ప్రభువైన యేసుద్వారా తండ్రియైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, సమస్తమును ఆయన పేరట చేయమని* స్పష్టం చేసారు. ఇంకా చూస్తే తరువాత వచనాల్లో కూడా భార్య, భర్త, పిల్లలు, సేవకులు, అధికారులు ఏ విధంగా ప్రవర్తించాలో చెబుతూ మరి యొకసారి ఈ విషయాన్ని ప్రస్తావించారు. ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని యెరుగుదురు గనుక, మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మన స్ఫూర్తిగా చేయుడి, మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులైయున్నారు. కొలస్సీయులకు 3: 23,24
పౌలు ఈ విషయాన్ని ఎందుకు గట్టిగా చెప్పారంటే, ఆయన మనుష్యులు ఒక పనిని పదే పదే చేయడం వలన, ముఖ్యంగా ఆ పనికి కనుక గుర్తింపు లేనప్పుడు, వారు విసిగి పోతారని అర్థము చేసుకున్నారు కాబట్టి. అయితే మనము కనుక ఒక పనిని మనుషుల కొరకు కాక దేవుని కొరకు చేస్తే అప్పుడు మనలో విసుగుదలకు నిరాశకు చోటు ఉండదు. అలా చేసిన తరువాత కూడా ఒక వేళ మనలో ఒక చిన్న పాటి నిరాశ మిగిలి ఉన్నా, కృతజ్ఞతస్తుతి దానిని కూడా పూర్తిగా తీసివేస్తుంది. మనము దేవుని కొరకు పని చేస్తున్నామని తెలుసుకోవడం వలన మన పనిలో తెలియని ఒక మెరుపు చేరుతుంది ఎందుకంటే మనము ఇంక ఏ ఉద్దేశ్యము లేని వారమై ఉండము. మన ఉద్దేశ్యము దేవునిని సంతోష పెట్టుటలో ఉంటుంది మరియు మనము చేసే పనికి తగిన ప్రతిఫలం ఆయనే ఇస్తారని నమ్ముతాము. ఇది మనలను ఇతరుల నుండి ఆశించడం, సంతోషపెట్టడం వంటి అనవసరమైన భారం నుండి కూడా విడిపిస్తుంది. అంతే కాదు కృతజ్ఞతస్తుతి మన విశ్వాసాన్ని పరిపూర్ణం చేస్తుంది, ఎందుకంటే అది మన దృష్టి మన మీది నుండి దేవుని వైపు త్రిప్పుతుంది. మన దృష్టి దేవుని వైపు మరలితే అప్ప్పుడు మనం దేవుడు సార్వభౌముడని, మన పనుల మీద కూడా ఆయన నియంత్రణ కలిగి ఉన్నారని అర్థము చేసుకోగల్గుతాము. అలానే మనము కనుక నమ్మకముగా మన పనిని చేస్తూవుంటే దేవుడు ఆయన సమయమందు ఆయన విధానములో మనకు ఆ promotion, లేదా ఆ గుర్తింపు లేదా ఆ హెచ్చింపును ఇస్తారు.
అందుకే మనము హృదయపూర్వకంగా, జాగ్రత్తతో, శ్రేష్ఠమైన విధముగా దేవుడు మనకు అప్పగించిన పనిని చేద్దాం మరియు ఆయన మనకు ఆ పనిని ఇచ్చినందుకు కృతఙ్ఞతలు చెల్లించుదాం.
22 April 2017
కీర్తనలు 57: 1 నన్ను కరుణింపుము దేవా నన్ను కరుణింపుము నేను నీ శరణుజొచ్చి యున్నాను ఈ ఆపదలు తొలగిపోవువరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చి యున్నాను.
కీర్తనాకారుడు తన ఆపద కాలములో దేవునికి మొఱ్ఱ పెడుతున్నాడు. ఆ ఆపద ఒక శోధన కావచ్చు, కష్టము కావచ్చు లేదా హాని కావచ్చు. అతడు దేవునికి తనపై కరుణ చూపమని మరియు ఆ ఆపద తొలగి పోయే వరకు ఆయన రెక్కల నీడ కింద శరణుజొచ్చి యున్నానని మొఱ్ఱ పెడుతున్నాడు. మీరు కనుక ఎప్పుడైనా కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద కప్పడం చూస్తే ఈ సారూప్యత అర్థం చేసుకోగలరు. ఒక గ్రద్ద దగ్గర్లో ఎగురుతూ కనిపిస్తే కోడి తన పిల్లలకు కొక్కొక్కో అని శబ్దం చేస్తుంది, అప్పుడు ఆ పిల్లలు గబగబా దాని దగ్గరకు పరిగెత్తుతాయి. వాటిని కోడి తన రెక్కల కింద కప్పి వాటిని ప్రమాదం నుండి కాపాడుతుంది. తల్లి కోడి ఎంత చక్కగా కప్పుతుందంటే ఒక్కోసారి రెక్కల కింద మనకు పిల్లలు అసలు బయటకి కనిపించవు. కోడి పిల్లలకు తమ తల్లి రెక్కల కింద ఏంతో రక్షణగా అనిపిస్తుంది.
అవును ప్రియమైన వారలారా, మీ కష్ట కాలములో, మీ శోధనలో మీ ప్రమాదంలో దేవుని వైపు పరుగెత్తండి. మీ స్నేహితుల వద్దకు కాదు, మీ సోదర సోదరీల వద్దకు కాదు మరి వేరే ఏ వ్యక్తుల వద్దకు కాదు, మొదట దేవుని వద్దకు పరుగెత్తండి. ఎందుకంటే మహోన్నతుని చాటున నివసించు వాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండ నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును ఆయన సత్యము, కేడెమును డాలునై యున్నది.కీర్తనలు 91: 1,3,4.
దేవుడు మిమ్మల్ని ఆపద నుండి కాపాడ గల సమర్థుడే కాదు మిమ్మల్ని దాని నుంచి విడిపించగల సమర్థుడు కూడా. కాబట్టి ఆయన వద్దకు పరుగెత్తండి.
21 April 2017
నిర్గమకాండము 33: 13 కాబట్టి నీ కటాక్షము నా యెడల కలిగిన యెడల నీ కటాక్షము నాయెడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము. అప్పుడు నేను నిన్ను తెలిసికొందును
ఆహా! మోషే యొక్క ఎంత గొప్ప ప్రార్థన ! నిజంగా మనలో ఎంత మంది దేవునిని తెలుసుకోడానికి ఆయన మార్గము చూపించమని అడుగుతాము? మన జీవితంలో ముందుకు పోవడానికి (ఆయన చిత్తాన్ని జరిగించడానికే కావచ్చు) లేదా మనం అపజయాలలో పడకుండా ఉండడానికి ఆయన మార్గాలు తెలుసు కోవాలి అనుకుంటాం. ఇది తప్పు కాదు మనం అందరం ఇది చెయ్యాలి. కాని దేవునిని తెలుసు కోవడానికి మరియు ఆయనను ప్రేమించడానికి మాత్రమే మనం ఆయన మార్గాలు తెలుసు కోవాలని ఆశ పడతామా?
మరి అయితే దేవునిని తెలుసు కోవడం అంటే ఏమిటి? మొదటగా దేవుని గురించి తెలుసు కోవడం మరియు దేవునిని తెలుసు కోవడం రెండూ వేరు వేరు విషయాలు. నాకు మదర్ థెరిసా గురించి తెలుసు కాని మా అమ్మ నాకు తెలుసు. ఒక వ్యక్తి గురించి, మనం చదవడం ద్వారా, వేరే వ్యక్తులు వారి గురించి మాట్లాడడం, చెప్పడం ద్వారా తెలుసు కోవచ్చు. కాని ఒక వ్యక్తిని తెలుసు కోవడానికి వారితో కలిసి ఉండాలి, వారితో సమయం గడపాలి, వారితో సంబంధం కలిగి ఉండాలి.
అందుకే మరి దేవునితో సంబంధం కలిగి ఉండడం ఎలా అనేది తరువాతి ప్రశ్న? ఆయనతో సమయం గడపటం ద్వారా, వాక్యము చదువుతూ, ప్రార్థిస్తూ. ఇది మన అందరికి తెలిసిన జవాబే ఎందుకంటే ఇంతకు ముందు ఎన్నో సార్లు విని ఉన్నాం, అయినా మనం చెయ్యము ఎందుకని? ఈ ప్రశ్నకు జవాబు ఎవరికి వారే చెప్పు కోవాలి.
మనుష్య సంబంధాలు ఒకరితో ఒకరు సమయం గడపకుండా, ఒకరిని ఒకరు తెలుసు కోకుండా ముందుకు వెళ్లవు, అభివృద్ధి చెందవు, దేవునితో సంబంధము కూడా అలానే. ఇది మనకి తెలుసు అయినా పట్టించుకోము ఎందుకని? నిర్ణయం మన చేతిలోనే ఉంది, సరైనది చెయ్యొచ్చు లేదంటే పట్టించు కోకుండా వదిలేసి మన నాశనం వైపు వెళ్ళొచ్చు. నిర్ణయం మనదే.
మోషే అందరికన్నా దీనుడు అని ఎందుకు పిలువ బడ్డాడో తెలుసా, ఆయన perfect అని కాదు, ఆ విషయం నిర్గమాకాండం చదివితే మనకు అర్థం అవుతుంది, మరి ఎందుకు అంటే ఆయన హృదయం దేవునిని వెదకడానికి, దేవునిని తెలుసు కోవడానికి మొగ్గు చూపింది.దీని గురించి ఆలోచించండి !!!
20 April 2017
మత్తయి 16: 24 అప్పుడు యేసు తన శిష్యులను చూచి ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల, తన్నుతాను ఉపేక్షించుకొని, తన సిలువనెత్తి కొని నన్ను వెంబడింపవలెను.ఆసక్తికరంగా యేసయ్య ఈ విషయాన్ని పేతురు ఆయనని నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని మత్తయి 16: 16 అన్న తరువాత చెప్పారు. ఇక్కడ మీరు సమయ సందర్భాలను గమనించారా? శిష్యులు ఆయనను క్రీస్తు (అనగా అభిషిక్తుడు) అని గుర్తెరిగిన తరువాత, ఆయన తాను పడవలసిన శ్రమల గురించి చెప్పి, ఆ తరువాత వారు ఆయనను వెంబడించడానికి చెల్లించ వలసిన అసలైన మూల్యము గురించి చెప్పారు. మన జీవితంలో కూడా అంతే, మనం రక్షించబడిన కొత్తలో మన ప్రార్థనకు వెంటనే జవాబు రావడం, మన ప్రతి భారాన్ని దేవుడు తొలగించడం చూస్తాం కానీ పోగా పోగా దేవుడు ఆయనను నిజముగా వెంబడించడం అంటే ఏంటో చూపించడం మొదలు పెడతారు.
అవును ఆయనను వెంబడించడం మూల్యముతో కూడిన పని, ఎందుకంటే మనము నడిచే ఈ క్రైస్తవ మార్గం ఒట్టి పూల బాట కాదు, పూలతో మరియు ముళ్లతో రెండిటితో నిండిన మార్గం. ఇది ఆశీర్వాదాలు మరియు కష్టాలు, బాధలు కలగలిపిన మార్గం. అందుకే మనము కొంత మూల్యము చెల్లించాల్సిందే, అలానే ఆయన శిష్యులు కూడా చెల్లించారు, కొంత మంది తమ ప్రాణాలతో. యోహాను తప్ప ( తన ప్రాణం తానే తీసుకున్న యూదా తప్ప) మిగతా శిష్యులందరూ హతః సాక్షులయ్యారు, అలా చేయడం వృధా కాదని వారికీ తెలుసు మరియు తరువాత మనమూ తెలుసుకున్నాము. ఒక వేళ మీరు కనుక ఒట్టి ఆశీర్వాదాల కొరకు యేసుని వద్దకు వస్తే, నన్ను క్షమించాలి కాని చెప్పక తప్పదు మీరు యేసుకి మీ జీవితాన్ని సమర్పించాలి అనే మీ నిర్ణయాన్ని మరి ఒకసారి ఆలోచించాలి.
ఇక వాక్య భాగానికి వస్తే, తనను తాను ఉపేక్షించు కొనుట అంటే అర్థము ఏమిటి? మన అందరికీ సొంత కలలు, కోరికలు, ఆశలు, హృదయవాంఛలు ఉంటాయి కాని మనము కనుక దేవుని చిత్తము ఆయన ఉద్దేశ్యము కొరకు వాటిని వదిలి పెట్టి ఆయనకు సమర్పించుటకు సిద్ధమైతే అదే మనలను మనం ఉపేక్షించు కొనుట. మరి సిలువ అంటే? ఒక message చదివే వరకు ఈ సిలువ అంటే ఏమిటో నాకు చాలా సంవత్సరాలు అర్థం కాలేదు, message రాసిన వ్యక్తి ఈ విధంగా వివరించారు, మన ఆర్థిక ఇబ్బందులు, మన సంబంధ, బాంధవ్య ఇబ్బందులు, మనము తొలగి పోవాలనుకున్న బలహీనతలు, జవాబు రాని ప్రార్థనలు, మన సేవ లోని ఇబ్బందులు మొదలగునవి...ఇలా ఇవన్నీ సిలువలే. తాము మోయవలసిన సిలువ మనిషి మనిషికి వేరుగా ఉండవచ్చు. సిలువ చాలా బరువైనదే, మరియు ఒక్కోసారి దానికింద నలిగి పోతున్నట్లు అనిపిస్తుంది, దానిని వదిలేద్దాం అని అనిపించవచ్చు. కాని మనము కనుక దేవునికి విధేయత చూపి సిలువను మోయడానికి నిర్ణయించుకుంటే తరువాత దాని ఫలితం అద్భుతంగా ఉంటుంది. నాకెలా తెలుసు? యేసయ్య మోసిన సిలువను (మన పాప భారాన్ని) చూడండి, తరువాత ఏమయ్యింది? పునరుధ్ధారణ, మరణము పాపముపై ఆయన విజయం. అవును ప్రియమైన వారలారా, ప్రతి సిలువ తరువాత ఒక గొప్ప పునరుధ్ధారణ ఉంటుంది.
ఇప్పుడైతే నీపై ఉన్న సిలువ యొక్క భారముతో దానిని మోయుడం లోని ప్రభావం అర్థం కాక పోవచ్చు కాని వదిలి పెట్టొద్దు, పక్కన పెట్టొద్దు, దానిని గట్టిగా పెట్టుకో, ఎందుకంటే ఒకరోజు తప్పక వస్తుంది, అక్కడ నీ సిలువ నీ పునరుధ్ధారణగా మారి పోతుంది. ఇలా ఆయన ఏసుక్రీస్తు జీవితంలో చేసారు, అలానే నీకు కూడా తప్పక చేస్తారు.
18 April 2017
యోహాను 3: 30 ఆయన హెచ్చవలసియున్నది, నేను తగ్గవలసియున్నది.బాప్తిస్మమిచ్చు యోహాను కావాలనుకుంటే చాలా సులువుగా తానే ముఖ్యమైన వ్యక్తినని ఉప్పొంగి ఉండొచ్చు, ఎందుకంటే తన బోధల వలన చాలామంది పశ్చాత్తాపపడి బాప్తీసము పొందారు. లేదంటే ఆయన కోపము అసూయ కూడా పడి ఉండొచ్చు , ఎందుకంటే ఏసు క్రీస్తు రాగానే తన శిష్యులతో పాటు అందరూ తనని వదిలేసి క్రీస్తు చుట్టు గుంపు కూడారు. కానీ యోహాను అలా చేయలేదు, ఆయన తన పిలుపును ఉద్దేశాన్ని బాగా అర్థం చేసుకున్నారు, తాను అసలైన మెస్సయ్యకు ముందు దారిని సిద్ధము చేసే ఒక దూత మాత్రమే అని. ఆ విషయాన్నే ఈ విధంగా తెలియజేసారు మార్కు 1: 7 మరియు అతడునాకంటె శక్తిమంతుడొకడు నావెనుక వచ్చుచున్నాడు; నేను వంగి ఆయన చెప్పులవారును విప్పుటకు పాత్రుడనుకాను;
కాని మనం మాత్రం, నేను దేవుని కోసం అది ఇది చేస్తున్నాను కాబట్టి నేను మిగతా వారి కన్నా గొప్ప లేదా భక్తి కలిగిన దానిని/వాడను, అందరూ నన్ను గొప్ప చెయ్యాలి, నాకు ప్రాధాన్యత ఇవ్వాలి... etc etc అని అనుకొని ఎన్ని సార్లు గర్వంలో పడిపోయాం. అలాగే మన పట్ల మన చుట్టూ ఉన్నవారు వ్యవహరించే తీరు (response) మన అంచనాలతో సరిపోక పొతే, మనం కోపము, పగ, నిరాశ మరియు నిస్ప్రుహలో పడిపోయాం. అంతే కాదు మన గురి అంతా ఎప్పుడూ మనుష్యులను సంతోష పెట్టడంలో మరియు వారు మనలను అంగీకరించడానికి అయితే తప్పకుండా మనం పెద్ద అగాధంలో పడిపోటానికి సిద్ధంగా ఉన్నామని అర్థం.
మరి దీనిని జయించడం ఎలా, మనము కేవలం మట్టి పాత్రలమేనని, మనలోని అసలైన ఐశ్వర్యము క్రీస్తే అని గుర్తు చేసు కోవడం వలన. 2కోరింథీయులకు 4: 7 అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదైయుండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. మన సురక్షత క్రీస్తునందే కాని మనం చేసే పనులు లేదంటే చేయని పనుల వలన కాదని గట్టిగా నమ్మాలి. మనము చేసే ప్రతి పని ఆయన కొరకు ఆయన మహిమ కొరకు అని మరియు ఇతరుల స్పందనతో సంబంధం లేకుండా మనకు నిజముగా బహుమతి ఇచ్చేది ఆయనే అని మరలా మరలా గుర్తు చేసుకోవాలి.
కాబట్టి మనలను మనం తగ్గించుకొని, ఆయనను సేవించుటకు కావలసిన ప్రతి వరం, ప్రతి తలాంతు ఆయన ఇచ్చినవే అని గుర్తుంచుకుంటే మనము కూడా బాప్తిస్మమిచ్చు యోహాను వలె ఆయన హెచ్చవలసి యున్నది, నేను తగ్గవలసియున్నది అని చెప్ప గలుగుతాము.
8 April 2017
కీర్తనలు 105: 19 అతడు చెప్పిన సంగతి నెరవేరువరకు యెహోవా వాక్కు అతని పరిశోధించుచుండెను.ఈ వాక్యాన్ని విడిగా చదివితే మనకు ఏమీ అర్థం కాదు, ఎవరు ఏం చెప్పారు, ఎవరు పరిశోధించ బడుతున్నారు అని. కొంచం ముందు అనగా 16వ వచనం నుండి చదివితే ఈ వాక్యం ఏసేపు గురించి, దేవుడు అతనికిచ్చిన కల/దర్శనం నెరవేరుట గురించి మాట్లాడుతుంది అని మనకు అర్థం అవుతుంది. దేవుడు ఏసేపుకు చిన్నగా ఉన్నప్పుడే ఒక కలను ఇచ్చినా అది చాలా కాలం తర్వాత కాని నెరవేర్చ బడలేదు (తగిన సమయమందు). ఆ సమయం వచ్చు వరకు దేవుడు అతని వ్యక్తిత్వాన్ని పరీక్ష చేసారు.
ఎన్ని సార్లు మనం కూడా మన జీవితం లో దేవుడు ఇచ్చిన కల, దర్శనం లేదా వాగ్ధానం నెరవేర లేదని అనుకున్నాం? అలా ఆలస్యం అవ్వడానికి కొన్ని కారణాలు ఉండవచ్చు, అవి ఏంటో చూద్దాం
1. మొదటగా, నీ జీవితం లో ఏదన్నా ఒప్పుకోని పాపం ఉందా, లేదంటే ఏదన్నా విషయంలో మన తీరు, స్వభావ మార్పు చేసుకోవాల్సి ఉందా లేదంటే దేవుడు చెప్పిన ఏదన్నా విషయంలో విధేయత చూప లేదా? అలా అయితే నీ ఆవిధేయతను దేవుని ముందు ఒప్పుకుని పశ్చాత్తాపపడు.
2. రెండవదిగా, నీకు దేవుడు ఏదన్నా నేర్పించాలని ప్రయత్నం చేస్తుంటే నీవు అది నేర్చు కోవడం లేదేమో. మొదటి సారే మనకు అర్థం కాక పోవచ్చు కానీ కొంచం నెమ్మదిగా ఆలోచిస్తే ఏదన్నా కొన్ని సంఘటనలు లేదా పరిస్థితులు మన జీవితంలో మళ్ళీ మళ్ళీ జరుగుతుండ వచ్చు. అలా అయితే దేవుడు ఆ పరిస్థితుల ద్వారా నీకు ఏమి నేర్పించాలనుకుంటున్నారో అడుగు అప్పుడు ఆయన నీకు చూపిస్తారు.
3.మూడవదిగా, దేవుడు నిన్ను ఒక అడుగు ముందుకు వేయమన్నప్పుడు భయంతో లేదంటే అవిశ్వాసంతో ముందుకు వెళ్ళ లేదేేమో. ఆ అడుగు మనకు అప్పుడు అంత మహత్వమైనదిగా కనిపించక పోయినా కొన్ని సార్లు అదే ఆలస్యానికి కారణం కావచ్చు.
4. నాల్గవదిగా, నీ జీవితంలో దేవునికి సమర్పించని ఏదన్నా కోరిక, ఆశ, లేక మరేదైనా విషయం ఉందా? కొన్ని సార్లు మనం కొన్ని విషయాలను (అవి మనకు సరైనదిగా, గొప్పగా అనిపించినా) గట్టిగా పట్టుకొని ఉంటాము, అవి విగ్రహాలుగా మారతాయి. అలా అయితే వాటిని విడిచి పెట్టి దేవునికి సమర్పించు.
ఒక వేళ పైనున్న నాలుగు అంశాలలో దేనిలో నైనా మనం ఉంటే, ఆలస్యానికి ఏదైనా కారణం కావచ్చు , కానీ మనం కనుక మనలను మనం తగ్గించుకొని దేవుని చేతులకు అప్పగించుకుంటే, ఆయన ఆ పాడయి పోయిన దానిని కూడా ఒక అద్భుత కళాఖండంగా చేయగలరు. అవును కొన్ని సార్లు ఆ తలుపులు మళ్ళీ తెరుచుకోక పోవచ్చు, కొన్ని అవకాశాలు మళ్ళీ రాక పోవచ్చు అయినా ఫర్వాలేదు, దేవుడు మన జీవితంలో తన ముఖ్య ఉద్దేశాన్ని ఎలాగైనా జరిగించగలరు. మార్గము మార వచ్చు, అవకాశాలు పోగొట్టు కోవడం వలన కొంత ఇబ్బంది కలగ వచ్చు, అయినా ఫర్వాలేదు దేవుడు దానిని కూడా మన మంచికి మార్చ గలరు. అందుకే సంతోషించండి, రోమీయులకు 8: 28 దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగును
చివరిగా, ఒక వేళ నీవు కూడా ఏసేపు వలె ప్రతి అడుగు లోను దేవునికి విధేయత చూపుతున్నా, ఆలస్యం జరుగు తుంటే, దాని అర్థం ప్రియమైన వారలారా, ఇది ఇంకా తగిన సమయం కాదని. ప్రతి దానికి తగిన సమయము కలదు ప్రసంగి 3:1. తగిన సమయమందు శారా ఇస్సాకుకు జన్మనిచ్చెను, తగిన సమయమందు ఏసేపు ప్రధాన మంత్రి చేయబడెను, తగిన సమయమందు ఎస్తేరు రాణి చేయబడెను, తగిన సమయమందు నయోమి,రూతు బేత్లెహేము తిరిగి వచ్చెను మరియు ముఖ్యంగా తగిన సమయమందు మన రక్షకుడైన క్రీస్తు ఈ భూమిలో జన్మించెను. అలానే తగిన సమయమందు దేవుడు నీకిచ్చిన ఆ కలను, దర్శనాన్ని లేదా వాగ్ధానాన్ని నేర వేరుస్తారని సంతోషించుడి. ఎందుకంటే వాగ్దానము చేసిన వాడు నమ్మ దగినవాడు హెబ్రీయులకు 10:23
6 April 2017
లూకా 6: 37 తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు; నేరము మోపకుడి, అప్పుడు మీ మీద నేరము మోప బడదు; క్షమించుడి, అప్పుడు మీరు క్షమింప బడుదురు; ఇయ్యుడి, అప్పుడు మీకియ్యబడును; అణచి, కుదిలించి, దిగ జారునట్లు నిండుకొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరల కొలువబడునని చెప్పెను.మనందరికీ mathsలో ఉన్న rule తెలిసిందే, నీ దగ్గర ఉన్న దాంట్లోంచి కొంచం తీసి ఇస్తే నీ దగ్గర ముందర ఉన్న దాని కంటే తక్కువ మిగిలి ఉంటుంది. కానీ జీవితం ఇంకో వింతైన సమీకరణ (equation) చెబుతుంది, మనము ఇతరులతో పంచుకుంటే మనకు ఇంకా ఎక్కువ లభిస్తుంది, మనము ఇతరులకు ఆశీర్వాదముగా ఉంటే మనకి ఇంకా ఎక్కువ ఆశీర్వాదం లభిస్తుంది. దేవుని యొక్క వాక్యము లూకా 6:38లో ఇదే చెబుతుంది ఇయ్యుడి, అప్పుడు మీకియ్యబడును; అణచి, కుదిలించి, దిగ జారునట్లు నిండుకొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు. ఇది ఒట్టి భౌతిక సంబంధమైన విషయాలలో మాత్రమే కాదు ఇతర విషయాలలో కూడా నిజము అలా అని లూకా 6-37-38 వచనాలు చెబుతున్నాయి. మన జీవితంలో కూడా మనము ఎన్నో సార్లు ఇదే చూసి ఉంటాము, మన దగ్గర ఉన్న వనరులను (resources) ఇతరుల అవసరాలలో పంచుకున్నప్పుడు తర్వాత వాటిని మన సొంత అవసరతలో ఎలా అద్భుత రీతిగా తిరిగి పొందామో.
అందుకే మనము హృదయంలో భారము కలిగి దిగులుతో ఉన్నప్పుడు, మన బాధలో కూరుకు పోకుండా మన దృష్టిని ఇతరులకు సేవ చేయడం, పంచుకోవడం, వారి అవసరతలను తీర్చడం నిమగ్నమైతే, మనకు తెలియకుండానే మనము కూడా ఓదార్చబడతాము. అదే ఇచ్చుట లేదా పంచుకొనుట లోని గొప్పతనము.
దేవుని బిడ్డలమైన మనము మనలను ఆయన చేతులకు పూర్తిగా అప్పగించుకొని, ఆయన సంతోషము, ప్రేమ, సమాధానము మరియు ఓదార్పు ఇతరులకు వ్యాపింపజేద్దాం. ఇది గుర్తుంచుకో, నీవు ఎంత ఎక్కువగా ఇస్తావో నీకు మరి అంత ఎక్కువగా లభిస్తుంది.
5 April 2017
2 కోరింథీయులకు 1: 4 దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో, ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తిగలవారమగునట్లు, ఆయన మాశ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు.ఈ మధ్యన ఒక వ్యక్తి సాక్ష్యాన్ని విన్నాను, వ్యభిచారంలోకి బలవంతంగా అమ్మబడి, చెడు అలవాట్లకు బానిస అయిన ఆమెను దేవుడు అద్భుత రీతిలో విడిపించారు, తరువాత ఆమె అధికారులు, social workersతో కలిసి తను ఇంతకు ముందు ఉన్న పరిస్థితులలో మగ్గుతున్న స్త్రీలకు, యవ్వనస్తులకు సువార్త మరియు ఆదరణ కల్పించడంలో పని చేస్తోంది. ఆమె చెప్పిన మాటలలో ఈ మాట నన్ను ముఖ్యంగా ఆకట్టుకుంది "నన్నే ఎందుకు? నేను ఎందుకు అంత కష్టాలు అనుభవించాలి? ఎవరో ఒకరు ఆ జైలు గోడలు వద్దకు, కూడాలుల వద్దకు, సందు చివర్ల వద్దకు వెళ్లి ఆ స్త్రీలకు, యవ్వనస్తులకు అపరిమితమైన ప్రేమను చూపించాలి, అది నేను అయ్యి ఉండాలి." ("Why me Lord, why do I have to go through all that suffering? somebody has to go to those jails, those corners and those crossroads to these women and young girls and love them unconditionally, and it has got to be me")
ఎంత గొప్ప సాక్ష్యం! భక్తుడైన పౌలు పైనున్న వాక్య భాగములో ఇలాంటి విషయం గురించే చెప్తున్నారు.
ఏదైనా కష్టాన్ని లేదా బాధను అలాంటి కష్టం గుండా లేదా బాధ గుండా వెళ్లిన వ్యక్తే బాగా అర్థం చేసుకో గల్గుతారు. వేరే వాళ్ళు కొంత వరకే అర్థం చేసుకోగలరు కాని అలాంటి కష్టం గుండా వెళ్లిన వారికి మాత్రం అది నిజముగా ఎంత బాధ కలిగిస్తుందో తెలుస్తుంది మరియు వాళ్ళు ఇతరులను నిజముగా ఓదార్చగలరు.
ఈ విషయంలో విశ్వాసులమైన మన ఎదుట గొప్ప సాక్యము ఇప్పటికే ఉంది 1పేతురు 2: 21-22
క్రీస్తుకూడ మీ కొరకు బాధపడి (ఆయన పాపము చేయకుండానే), మీరు తన అడుగుజాడలయందు నడుచుకొనునట్లు మీకు మాదిరి యుంచి పోయెను. హెబ్రీయులకు 4: 15 మన ప్రధానయాజకుడు మన బలహీనతలయందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని, సమస్త విషయములలోను మనవలెనే శోధింపబడినను, ఆయన పాపము లేనివాడుగా ఉండెను. ఆయన బాధపడ్డారు కనుక మన బాధలలో సహానుభవము కలిగి మనలను అర్థం చేసుకోగలరు మరియు మనలను నిజముగా ఆదరించగలరు. అలానే ఆయన వద్ద నుండి ఆదరణ పొందిన మనము ఇతరులను వారి దుఃఖములో ఆదరించాలి.
4 April 2017
సామెతలు 3: 5-6 నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మక ముంచుము. నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును.మన జీవితంలో జరిగే ప్రతి పరిస్థితి లేదంటే ప్రతి విషయమునూ రెండు విధాలుగా చూడవచ్చు, తార్కిక దృష్టితో (logical view) లేదంటే ఆధ్యాత్మిక దృష్టితో (దీనినే విశ్వాస దృష్టితో అనవచ్చు). మరియు అనేక సార్లు ఏదన్నా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు మనం ఏది ఎంచుకుంటాం, తర్కమా లేదంటే విశ్వాసమా? తర్కము (logic) మంచిదే, అది మనకు ఒక విషయాన్ని పైపైన కాక క్షుణ్ణముగా తెలుసు కోవడానికి ఉపయోగ పడుతుంది. కానీ జీవితానికి సంబంధించిన విషయాలలో అది ఎప్పుడూ సరైన పద్ధతేనా?
అంతే కాక మనందరికి, ముఖ్యంగా దేవుడు లేడు అనే వాతావరణం కలిగిన కుటుంబంలో పెరిగిన వారికి కళ్ళతో చూడలేని, చేతితో ముట్టుకోలేని విషయాలు మరియు తార్కికముగా నమ్మలేని విషయాలు అర్థం చేసుకోవడం చాలా కష్టం. అదీ కాక మనలో కొంత మందికి దేవునిని నమ్ముకున్న మొదట్లో అసలు నేను నమ్మేది నిజమేనా? లేదంటే ఇదంతా నా ఊహ లేదా కల్పితమా ? అనే ప్రశ్నలు రావడం కూడా జరుగుతుంది.
చెప్పాలంటే నేనూ కూడా దేవుడు ఈ వాక్యన్ని హెబ్రీయులకు 11: 1 విశ్వాసమనునది నిరీక్షింపబడువాటియొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునైయున్నది, నాకు చూపించే వరకు ఇలాంటి ప్రశ్నలతోనే పోరాడేదాన్ని. విశ్వాసమును బట్టి, దేవుడు ఈ సమస్తమును మరియు మనలను సృష్టించాడు అని నమ్ముతాము. విశ్వాసమునుబట్టి, ఆయన పుట్టుక, సిలువ పైన ఆయన మరణం, ఆయన పునరుద్ధారణను నమ్ముతాము. విశ్వాసమునుబట్టి మన పాపములను ఒప్పుకొని ఆయన రక్షణను స్వీకరించాము. ఇదే క్రైస్తవ భక్తికి పునాది హెబ్రీయులకు 11: 6 విశ్వాసములేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము; దేవునియొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. మరియు విశ్వాసమును బట్టియే మనము మన నిర్ణయాలలో దేవుని నడిపింపు ఉంటుందని నమ్ముతాము మరియు ఆవిధంగానే ఆయన మనలను నడిపిస్తారు.
ఇక వాక్య భాగానికి వస్తే _నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మక ముంచుట_ అంటే మనలను మనము పూర్తిగా దేవుని చేతికి అప్పగించుకొని, ఆయన పట్ల సంపూర్ణ సమర్పణ కలిగి, ఆయన వాక్యమునకు పూర్తిగా లోబడటం.
_ నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుట_ అంటే మన ప్రతి ఆలోచనను, ప్రతి planను, ప్రతి పనిని ఆయనకు లోబడునట్లు చేయడం. మరి ఆయనకు లోబడటం మరియు ఆయన మీద నమ్మకం ఎలా ఉంచగలం?
విశ్వాసమును బట్టి. మనము గనుక మన మనుష్య సంబంధమైన జ్ఞానము, ఆలోచన మరియు తర్కము విడిచి ఆయనను నమ్ముటకు నిర్ణయం చేసుకుని ఆయనకు లోబడితే ఆయన మనలను నడిపిస్తారు. ఆయన అరణ్యములో త్రోవ కలుగజేయ గలడు ఎడారిలో నదులు పారజేయ గలడు యెషయా 43: 19. మన జీవితాల్లో అద్భుతాలు జరగడం చూస్తాము, ఎందుకంటే దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు.
మీకు తెలుసా, సామెతలు 3: 5-6ను అనుసరిస్తే మనకు ఏ విషయంలో నైనా సరే దేవుని నడిపింపు లభిస్తుంది. నేను try చేశాను, మరి మీరు?
4 April 2017
మత్తయి 6: 33 కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును.ఎక్కువగా అందరూ ఈ వచనాన్ని మన జీవితంలో ఏదన్నా తీరని అవసరతలు ఉన్నప్పుడు లేదా భవిష్యత్తు గురించిన బెంగ ఉన్నప్పుడు, ఒక సలహాగా లేక ఆలోచన చెప్పడానికి గుర్తు చేస్తారు. అది కరక్టే, కానీ అంతేనా? కొన్ని సంవత్సరాల వరకు ఈ వాక్యము యొక్క అర్థం ఏంటి అని చాలా మథన పడేదాన్ని. ఈ వాక్యము యొక్క అర్థం, నా అవసరతల విషయమై నేను దేవుడికి ప్రార్థన చేయకూడదా? లేదంటే ఆయనతో ఎక్కువ సమయం గడపటమా? లేదా అసలేంటి దీని అర్ధం?
జవాబు నా జీవితంలో జరిగిన ఒక విషయం ద్వారా చెప్పాలి అనుకుంటున్నాను. ఒక సమయంలో ఒక విషయమై దేవుని చిత్తం తెలుసుకోడానికి ప్రార్థన చేస్తున్నాను. ఎంతగా ప్రార్థన చేసినా అర్థం కావడం లేదు, ఇంక నా మనస్సులో గందరగోళం (restlessness) మొదలయ్యింది. ఎంతగా restless అంటే ఒక చోట కుదురుగా కొంచం సేపు కూర్చోలేక పోయా, నిద్ర వచ్చేది కాదు. ఎప్పుడూ మనసులో ఒకటే ఆలోచన, నన్ను ఏమి చెయ్యమంటావ్ ప్రభువా, నీ చిత్తమేంటి. మీకు నేను చెప్తున్న పరిస్థితి అర్థం అయింది కదా?
అలాంటి సమయంలో నేను చదువుతున్న messages ద్వారా దేవుడు నాతో ఇలా మాట్లాడినట్లు అనిపించింది, 'నీ దృష్టిని ఆ విషయం మీద నుండి వేరే వాటి మీద అంటే వాక్యం చదవడం (ఆ ఒక్క విషయంలో దేవుని చిత్తాన్ని తెల్సుకోవడానికే కాకుండా), పాటలు పాడి ప్రభువుని స్తుతించడం, ప్రార్థన చెయ్యడం (ఆ ఒక్క విషయం కోసమే కాకుండా) మీదకు మళ్లించు అని. అలా ఎప్పుడయితే నేను నా దృష్టిని ఆ విషయం మీద నుండి తీసేసి దేవుని వైపు పెట్టానో అప్పుడు నాకు మనస్సులో నెమ్మది వచ్చింది అలానే కొన్ని రోజుల తర్వాత నేను ప్రార్థిస్తున్న విషయంలో కూడా దేవుని చిత్తం ఏంటో దేవుడు బయలు పర్చారు. అప్పుడు నాకు పైన ఉన్న వచనము యొక్క అర్థం ఏమిటో తెలియడం మొదలయ్యింది. అదేంటంటే మనము దేవునిని ఆయన చేసే పనుల కోసం కాక ఆయన నిమిత్తమై ఆయనను వెదకితే అప్పుడు ఆయన మన అవసరతలు మన విన్నపాలు అన్నీ తీరుస్తారు. ఆయన ఎంత మంచివాడు, ఎంత ప్రేమామయుడు అంటే మాట మన నాలుకకు రాకమునుపే అది ఆయనకు పూర్తిగా తెలిసియున్నది (కీర్తనలు 139: 4) మనం అడగక ముందే మనకు ఏమి కావాలో ఆయనకు తెలుసు, అవన్నీ మనకు ఇవ్వడానికి ఆయన సంసిద్ధుడు. కానీ మనము ఆయనను మన ఆరాధనకు, స్తుతికి, మహిమకు, ఘనతకు అర్హుడైన, అధిపతిగాను ప్రభువుగాను వెదకుట నేర్చుకోవాలి.
అవును ప్రియమైన వారలారా కొన్ని సార్లు మనం మొక్కుబడిగా బైబిల్ చదవడం, ప్రార్థన చెయ్యడం లేదా ఆయనను సేవించడంలో వ్యస్థమై పోవడం లేదా మనస్ఫూర్తిగానే దేవుని చిత్తం తెల్సుకోవడానీకి ప్రయత్నిస్తూ ఒక ముఖ్యమైన పనిని మర్చిపోతాం. అదేంటంటే దేవునితో సమయాన్ని గడపడం, ఆయన సన్నిధిని అనుభవిస్తూ ఆయనను ప్రేమించడం, ఆయన వాక్యం ద్వారా ఆయనను తెలుసు కోవడం. దేవుని యొక్క స్థానాన్ని ఆయనకు చెంద వలసిన ఆరాధన మనము దేనికీ ఇవ్వ కూడదు. అవును మనము మన జీవితంలోని ప్రతి విషయములో దేవుని చిత్తం తెలుసుకోవాలి, ఆయనను సేవించాలి, ప్రార్థించాలి, వాక్యాన్ని చదవాలి కానీ ఆయన చిత్తం తెలుసుకోడానికి మాత్రమే బైబిల్ చదవడం, ప్రార్ధించడం చెయ్యకూడదు లేదంటే ఎదో మొక్కుబడిగా బైబిల్ చదవడం, ప్రార్ధించడం చెయ్య కూడదు. ఆయనే మన ముఖ్యమైన, ప్రాథమిక ఉద్దేశం కావాలి, మన దృష్టి ఎప్పుడూ ఆయన పైన ఉండాలి.
కీర్తనా కారునితో కలిసి మనం కూడా (కీర్తనలు 27: 4) యెహోవాయొద్ద ఒక్క వరము అడిగితిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిర ములో నివసింప గోరుచున్నాను. అని చెప్పడానికి దేవుడు మనకు తన కృప నిచ్చునుగాక.
1 April 2017
ప్రకటన గ్రంథం 20: 15 ఎవని పేరైనను (మూలభాషలో-ఎవడైనను) జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడనియెడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను.ప్రవచన గ్రంథమైన ప్రకటన గ్రంథాన్ని మనలో చాలా మంది చదవడాన్ని వాయిదా వేస్తాం లేదంటే బైబిల్ మొత్తం చదవడం అవగొట్టడానికి గబగబా చదివేస్తాం. యేసు క్రీస్తు శిష్యుడైన యోహాను, ఆయన చివరి దినాలలో క్రీస్తు యొక్క సాక్ష్యార్థం, పత్మాసు ద్వీపమునకు బహిష్కరింపబడ్డాడు, అయితే అక్కడే దేవుడు ఆయనకు రెండవ రాకడ గురించి, దాని తర్వాత జరిగే విషయాలు అనగా మహా శ్రమలు, విశ్వాసులకు ఇవ్వబడే బహుమతులు, క్రీస్తు వెయ్యేండ్ల పాలన, సైతాను యొక్క శిక్ష మొదలగునవి గురించిన ఎంతో గొప్ప దర్శనాన్ని ఇచ్చారు. ఆ దర్శనము ఈ గ్రంథములో లిఖింప బడినది.
ఇక వాక్య భాగానికి వస్తే అది అవిశ్వాసులు పొందబోయే రెండవ మరణాన్ని గురించి చెబుతుంది. ఎవరి పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడనియెడల వారు, సైతాను మరియు తన అనుచరులు ముందుగానే వేయబడిన అగ్నిగుండములో పడవేయ బడుదురు. వారు యుగయుగములు రాత్రింబగళ్లు బాధింపబడుదురు. ఒక్క సారి ఆలోచించండి, యుగయుగములు, నిత్యమూ బాధింప బడుట మంటే ఎలా ఉంటుందో. తల్చుకుంటేనే మన హృదయం భయంతో వణికి పోతుంది.
మరి రెండవ మరణం నుండి తప్పించు కోవడం ఎలా? దీనికి జవాబు మన విశ్వాసాన్ని క్రీస్తుపై ఉంచడమే. ఇది ఒక వైపు వినడానికి ఎంతో నులువుగా ఉన్నా ఇంకొక వైపు చాలా కష్టమైనది కూడా ఎందుకంటే చాలా మంది ఈ పని చెయ్య లేక పోతున్నారు. మన పాపములను ఒప్పుకొని యేసు క్రీస్తును మన హృదయములోనికి రక్షకునిగా, అధిపతిగా అంగీకరిస్తే చాలు మన పేర్లు జీవ గ్రంథములో వ్రాయబడతాయి. మరి నీ పేరు జీవ గ్రంథములో వ్రాయబడిందా? లేదంటే ఈ రోజే ఇప్పుడే నీ జీవితాన్ని ప్రభువుకి సమర్పించు. ఒక వేళ వ్రాయబడితే నీ చుట్టూ ఉన్న దేవుడు తెలియని వారి కోసం నువ్వు ఏమి చేస్తున్నావు?
బైబిల్ ఇలా చెబుతుంది రోమీయులకు 10: 13-14 ఎందుకనగా ప్రభువు నామమునుబట్టి ప్రార్థనచేయు వాడెవడోవాడు రక్షింపబడును. వారు విశ్వసింపనివానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? విననివానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండ వారెట్లు విందురు?
దేవునిని తెలుసుకున్న మనకు దేవుని సువార్త లోకమంతటా ప్రకటించుట అనేది ఆయన మనకు స్వయంగా ఇచ్చిన ఒక గొప్ప ధన్యత మరియు బాధ్యత. ఆయన మనలను ఎక్కడ ఉంచినా ( సేవలో, బిజినెస్లో, స్కూల్లో...) ఎలా చెయ్యమన్నా (బోధించుట, ఇవ్వుట, చెప్పుట) ఆయన నడిపింపుకు లోబడితే మనము ఆయనను సేవించ గలము. రండి,మన మందరము ఆయన మహా గొప్ప కోతలో జత పనివారమవుదాం
No comments:
Post a Comment