Thursday, April 20, 2017

March Devotions

31 March 2017

కీర్తనలు 23: 1 యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు.

మనకు మనసు సరిగా లేనప్పుడు బైబిల్లోని ఏ పుస్తకాన్ని చదువుతాం? ఎక్కువ శాతం మంది కీర్తనలు అని చెబుతాం. మనము కీర్తనలు  ఎక్కువగా  ఎందుకు చదువుతామంటే, కీర్తనలు మనకు  ప్రోత్సాహం, ఆదరణ,  ఉన్నతి మరియు బలోపేతాన్ని ఇస్తాయి.  మరియు అన్ని కీర్తనలలో 23 కీర్తన చాలా తెలిసిన కీర్తన మరియు మనలో చాలా మందికి కంఠత వచ్చు. ఈ కీర్తన యొక్క మహత్వము దాని సరళతే, దీని లోని వాక్యాలు చదవడానికి తేలికగా ఉన్నా వాటి అర్థం చాలా లోతైనది.

ఇక్కడ కీర్తనాకారుడు దేవుని పైన ఉన్న తన నమ్మకాన్ని  ఈ విధంగా వ్యక్త పరుస్తున్నాడు   యెహోవా నా కాపరి నాకు కావలసినదంతయూ నేను కలిగి ఉంటాను.  మనము కూడా దేవునిపై ఇటువంటి విశ్వాసాన్ని వ్యక్త పరుస్తున్నామా ? లేదా నా అవసరతలు తీరలేదని  దేవునిపై అలిగి కూర్చుంటున్నామా?

మనము దేవునిపై దృష్టి నిలపక మన పరిస్థితుల వైపు చూసినప్పుడు మన విశ్వాసము ఊగిసలాడుతుంది. మన విశ్వాసము ఊగిసలాడితే మనకు దేవుడు మన అవసరతలను
తీరుస్తాడా అనే సందేహం కలుగుతుంది. మనకు దేవునిపై సందేహం కలిగితే నిరాశ లోనికి పడి పోతాం. నిరాశ లోనికి పడిపోతే ప్రతి చిన్న దానికి కోపము తెచ్చుకొని ఇతరులపై చిరాకు పడుతూ ఉంటాం.

ప్రియమైన వారలారా మనము కనుక దీనిని మొదటే గుర్తిస్తే  గొప్ప హృదయభారం నుండి తప్పించుకోగలం. ఒక వేళ వేరే వాళ్ళ ఉన్నతిని చూసి అసూయ పడుతున్నట్లయితే లేదా నిన్ను నీవు ఇతరులతో పోల్చుకొని బాధ పడుతున్నట్లయితే లేదా స్వీయ జాలిలో (self pity) పడి పొతే, అదే నీకు గుర్తు (reminder) దేవుని పాదాలపై పడి నీ విశ్వాసాన్ని పెంచమని ప్రాధేయపడు. అలానే ఆయన వాక్యము చదువుతూ, ధ్యానిస్తూ ఉంటే ఆయన నిన్ను వెలుగుతో నింపి తన సత్యము లోనికి  నడిపిస్తాడు. *అప్పుడు సత్యము నిన్ను విడిపించును*. లేదంటే మనము మనకే కాక మన చుట్టూ ఉన్న వారికి కూడా చాలా బాధను తెచ్చి పెట్టేవారమవుతాం.

 గుర్తుంచుకో యెహోవా మన కాపరి, ఆయన మన పక్షమున ఉన్నప్పుడు మనకు ఏది కొదువ కాదు. తన పరిపూర్ణమైన సమయమందు ఆయన మన ప్రతి అవసరతను తీరుస్తాడు.  ఆయనే సమకూర్చువాడు (V1), రక్షించువాడు(v 4), నడిపించువాడు(v 2-3),  హెచ్చించువాడు (v 5) మరియు మన నిత్యత్వము (v 6). మన ప్రాణములను నిజముగా తృప్తి పరుచువాడు ఆయనే కనుక మన హృదయమంతటితోను ఆయనను విశ్వసిద్దాం.

25 March 2017

2 కోరింథీయులకు 12: 9 అందుకు నా కృప నీకు చాలును, బలహీనతయందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నామీద నిలిచియుండు నిమిత్తము(లేక,నన్ను కప్పునిమిత్తము) , విశేషముగా నా బలహీనతలయందే బహు సంతోషముగా అతిశయపడుదును.

అసలు మనలో ఎంత మంది మన బలహీనతల యందు  అతిశయ పడతాం? అవి శరీర సంబంధ మైనవి కావచ్చు, లేదా మనసుకు, ఆత్మకు  సంబంధించినవి కావచ్చు. సహజంగా ఎవరమూ ఇష్టపడం, పైగా అందరి ముందు మంచి వాళ్లలా కనిపించడానికి మన బలహీనతలను దాచి పెడతాం. ఈ లోకం కూడా నువ్వు ఎంత గొప్పగా ఉంటే, ఎంత శక్తిశాలివయితే, ఎంత తలాంతులు కలిగి ఉంటే, ఎంత తెలివి కలిగి ఉంటే అంత ఎక్కువ గౌరవం వస్తుంది అని నేర్పిస్తుంది. అంతే కాదు లోకంలో బలహీనత అనేది ఒక ఓటమి లాగ చూస్తారు.
కానీ పైన వచనంలో  అపొస్తలు పౌలు పూర్తిగా వ్యత్యాసమైన మాట చెప్తున్నారు, నా బలహీనతలయందే బహు సంతోషముగా అతిశయపడుదును. ఎందుకని? ఆయన అహంకారంతోను లేక మూర్ఖత్వముతోను అలా మాట్లాడుతున్నారా? ఖచ్ఛితంగా కాదు, మనము కనుక ఈ అధ్యాయాన్ని మొదటి నుంచి, ముఖ్యంగా 7 నుంచి 10 వచనాలు చదివితే ఆయన అలా ఎందుకన్నారో అర్థం అవుతుంది.

దేవుడు పౌలు భక్తుడికి పెట్టిన బలహీనత లేదా ముల్లు ఏమై ఉంటుందో అని ఎన్నో తర్జన భర్జనలు జరిగాయి, కాని మనకు ఆ విషయం అంత ముఖ్యమైనది కాదు. దేవుడు ఆ ముల్లుని పౌలును వినయముగా ఉంచడానికి ఉండనిచ్చారు అనేది  ముఖ్యమైన విషయం.
అవును ప్రియమైన వారలారా మనలను దేవుని ముందు విరిగి నలిగిన, వినయము కలిగిన వారిగా ఉంచేది మన బలాలు కాదు మన బలహీనతలే. ఎందుకంటె బలహీనులు, నిరాశ కలిగిన వారు, వారికే దేవుని అవసరత ఎక్కువ. దేవుని అవసరత ఎంత ఎక్కువ ఉంటే మనము ఆయన వైపు అంత ఎక్కువుగా చూస్తాం. దేవుని వైపు ఎంత ఎక్కువగా చూస్తే మనము అంతగా ఆయన లాగ మారుతాం. దేవుని లాగ ఎంత ఎక్కువగా మారితే మనము  ఇతరులకు అంత ఆశీర్వాదముగా ఉంటాము.

నీ బలహీనతలను దేవునికి సమర్పించు, ఆయన వాటి ద్వారానే లేదంటే వాటిని తొలగించి తన శక్తిని పరిపూర్ణము చేయగల సమర్థుడు.

22 March 2017

యిర్మియా 17: 7-8 ​యెహోవాను నమ్ముకొను వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలములయొద్ద నాటబడిన చెట్టువలె నుండును; అది కాలువల ఓరను దాని వేళ్లు తన్నును; వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగానుండును, వర్షములేని సంవత్సరమున చింతనొందదు కాపు మానదు.

మనం ఎప్పుడైనా నదిని కాని లేదంటే కనీసం చిన్న వాగునైనా చూసి ఉంటే, వాక్య భాగములో  యిర్మియా ప్రవక్త చూపుతున్న సారూప్యత (analogy) మనకు అర్థం అవుతుంది. ఆ నదుల పక్కన వాగుల పక్కన మొలిచిన మొక్కలు చెట్లు ఎంతగా ఫలిస్తాయో మనకు తెలుసు. అలానే మన ఇంటి దగ్గర స్థలంలో లేదా కుండీలలో నాటిన మొక్కలు కొన్ని రోజులు సరిగా నీళ్ళు పోయక పొతే ఎలా వాడి పోయి ఎండి పోతాయో కూడా చూస్తాం.

మన ఆత్మీయ జీవితం కూడా అంతే, మొక్కలు ఎలా అయితే నీళ్ళు లేక ఎండి పోతాయో, మనము  దేవునితో మన ప్రతి దిన సమయాన్ని గడపక పొతే ప్రతి చిన్న సమస్యకు ప్రతి చిన్న శోధనకు పడి పోతాం. అలా కాకుండా మనము మన దృష్టిని ఏసుక్రీస్తుపై ఉంచితే ఎటువంటి ఆటుపోట్ల నయినా తట్టుకొని నిలబడగలుగుతాం.

దేవునిపై ద్రుష్టి ఉంచడం ఎలా? ఆయనపై నమ్మిక ఉంచడం ఎలా నేర్చుకుంటాం? దీనికి జవాబు క్రీస్తుతో వ్యక్తిగత సంబంధము కలిగి ఉండుటయే.  ప్రతి దినము  ప్రార్థనలో ఆయనతో మాట్లాడుతూ, వాక్యము చదువుట ద్వారా, ఆయన సన్నిధిలో నిశబ్దముగా ఉండుట ద్వారా ఆయన స్వరాన్ని వింటూ, ఆయనతో సహవాసం కలిగి ఉండటమే.

దేవుడు మనకు పరిస్థుతులను, పరీక్షలను తట్టుకోగల విశ్వాసాన్ని ఇచ్చునుగాక. ఆమెన్.

21 March 2017

కీర్తనలు 103: 1-2 నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము. నా అంతరంగముననున్న సమస్తమా, ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము

మన హృదయాలను తాకే ఈ అద్భుతమైన ఆరాధనా కీర్తనను రాసినది, కొందరు దావీదు దేవుడు తన పాపమును క్షమించినప్పుడు రాసాడు అంటారు, కొందరు మరియొకరు రాసారు అంటారు. ఎవరు రాసినా ఏ సందర్బంలో రాసినా, ఇది మనకు కీర్తనాకారుడు ఇచ్చిన చక్కని కానుక, ఎందుకంటే అతడు తన హృదయాంతరాల లోని భక్తిని ఈ కీర్తనగా రాసాడు. మరియు ఈ కీర్తనలో  అతడు ఒక వైపు దేవుడు తన జీవితంలో చేసిన అద్భుత కార్యాలను గూర్చి సంతోష గానము చేస్తూ, ఇంకొక వైపు దేవునిని  ఆయన చేసిన పనులను బట్టి కాక ఆయనను బట్టియే స్తుతించుచున్నాడు.

అంతే కాక ఈ కీర్తన మనకు ఏమి నేర్పిస్తుందంటే ఈ జీవితం మన గురించి కాదు దేవుని గురించి అని. కీర్తనలోని వచననాలను చదివితే మనకు ఇలా ఒక  మాదిరి  (pattern)  కనిపిస్తుంది, దేవుడు దయాదాక్షిణ్య పూర్ణుడు కనుక ఆయన నిత్యము కోపించువాడు కాడు, ఆయన కృపాసమృద్ధిగలవాడు కనుక ఆయన మన దోషములను క్షమించును, ఆయన మన పరలోకపు తండ్రి కనుక ఆయన తనయందు భయభక్తులు గలవారి యెడల జాలి చూపించును

అవును ప్రియమైన వారలారా దేవుడు దయామయుడు, దేవుడు జాలి కలిగినవాడు, అంతే కాదు 19వ వచనాన్ని బట్టి ( కీర్తనలు 103: 19 యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరచియున్నాడు. ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు ) దేవుడు సార్వభౌముడు, ఆయన అన్నిటి మీద పరిపాలన చేయుచున్నాడు. అందుకే నువ్వు ఏదైనా అసాధ్యమైన పరిస్తితిలో ఉన్నప్పుడు, నీ తల ఎత్తి పైకి చూచి ఇది గుర్తు చేసుకో, ఈ విశ్వము పైన నేను కాదు దేవుడు ఉన్నారు. ఆయన సార్వభౌముడు కనుక ఆయన నీ జీవితములో  జరిగే ప్రతి విషయముపై ఆధీనం కలిగి ఉన్నారు. ఆయన అన్నిటి మీద పరిపాలన చేస్తున్నాడు కనుక నీ జీవితంలో చెడ్డదాన్ని తొలగించి మంచి దానినే రానిస్తారు.

అందుకే మన గురించి మర్చి పోయి ఆయనను మన ఆరాధనతో, స్తుతులతో పైకెత్తుదాం. ఎందుకంటే ఆయన స్తుతికి మహిమకు అర్హుడు.

20 March 2017

1యోహాను 1: 9 మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును.

ఈ వచనానికి అర్థం మనం పాపం చేస్తూ పోవచ్చు, తర్వాత దేవుని ముందు ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడు అనా. కాదు, కానే కాదు. ఇదే అధ్యాయంలో కొంచం వెనక్కి వెళ్తే ఈ విధంగా ఉంది 1యోహాను 1: 6 ఆయనతో కూడ సహవాసముగలవారమని చెప్పుకొని చీకటిలో నడిచినయెడల మనమబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము.  మరియు హెబ్రీయులకు రాసిన పత్రికలో ఈ విధంగా ఉంది హెబ్రీయులకు 10: 26 మనము సత్యమునుగూర్చి అనుభవజ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసినయెడల పాపములకు బలి యికను ఉండదు గాని ... హెబ్రీయులకు 10: 29 ఇట్లుండగా దేవుని కుమారుని, పాదములతో త్రొక్కి, తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి, కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించినవాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును?

అందుకే ప్రియమైన వారలారా,  దేవునికి వ్యతిరేకముగా పాపము చేసే ముందు భయముతో  వణుకుదాం. ఒకవేళ నువ్వు గొర్రె పిల్ల రక్తములో కడగ బడిన వ్యక్తివయితే నువ్వు ఇంకా జాగ్రత్తగా నడవాలి.  ఇది గుర్తు పెట్టుకో నీవు దేనికయితే లోబడతావో దానికి బానిసవవుతావు, నీవు గనుక పాపం చేసుకుంటూ పొతే పాపానికి బానిసవవుతావు 2పేతురు 2: 19 ఒకడు దేనివలన జయింపబడునో దానికి దాసుడగును గదా.  అంతే కాక నేను ఒక చోట చదివాను, మనము చేసే ప్రతి పని మన చుట్టూ ఉన్నవారి పైన ప్రభావం చూపుతుంది.  మనం అనుకోవచ్చు కొన్ని  పాపాలలో వేరే వారిని  involve చెయ్యము కదా ఏమి అవ్వదులే అని, కాని అది నిజం కాదు, నువ్వు చేసే ప్రతి పని నీ ప్రియ మైన వారిపైన పడుతుంది. ఇంకొక మాట నువ్వు దేవుని బిడ్డ వయితే నువ్వు పాపము చేసిన ప్రతిసారి ఆయనను మళ్ళీ మళ్ళీ సిలువ వేస్తున్నావు హెబ్రీయులకు 6: 5-6 దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన(మూలభాషలో-రుచిచూచిన) తరువాత తప్పిపోయినవారు,తమ విషయములో దేవుని కుమారుని మరల సిలువవేయుచు, బాహాటముగా ఆయనను అవమాన పరచుచున్నారు గనుక...

18 March 2017

కీర్తనలు 34: 8 యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలిసికొనుడి

ఈ వాక్యము చదివినప్పుడు నాకు మా అమ్మమ్మ చెప్పిన ఒక కథ గుర్తుకు వస్తుంది , ఒక వ్యక్తి ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళ్లి లోకంలో ఇన్ని ఘోరాలు జరుగుతుంటే మీరు దేవుడు మంచి వాడు అని ఎలా అనగలరు అని ప్రశ్నించాడట. అప్పుడు ఆ పాస్టర్ గారు ఎమీ సమాధానం చెప్ప కుండా ఒక కమలా పండు తీస్కొని తొక్క వలిచి మొత్తం పండు తిని ఈ పండు చాలా తియ్యగా ఉంది కదా అన్నారంట. ఆ వ్యక్తి నాకెలా తెలుస్తుందండి, నేను రుచి చూడ లేదు కదా అన్నాడంట. అప్పుడు పాస్టర్ గారు నవ్వి అవును నువ్వు రుచి చూడ లేదు, నేను దేవుని ప్రేమను రుచి చూసాను అందుకే ఆయన ఉత్తముడు, మంచి వాడు అని చెప్ప గలను అని అన్నారంట. ఆ వ్యక్తి ఈ విషయమై ఆలోచిస్తూ ఇంటికి వెళ్లాడు.
రుచి చూచి తెలిసికొనుడి యెహోవా ఉత్తముడని. నీవు ఎవరి వైనా, ఎక్కడ ఉన్నా నీ జీవితం లో దేవుని ప్రేమ అనుభవించినట్లయితే నువ్వు కూడా తప్పక దేవుడు మంచి వాడు అని చెప్ప గలుగు తావు.

ఒక ప్రశ్న, నీవు నీ దేవుని ప్రేమ అనుభవించావా? లేదంటే  అలా ఏది లేక ఏమి నిన్ను ఆపుతోంది?

17 March 2017

కీర్తనలు 121: 1-2 కొండలతట్టు నా కన్ను లెత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? యెహోవావలననే నాకు సహాయము కలుగును ఆయన భూమ్యాకాశములను సృజించినవాడు.

భూమ్యాకాశములు సృజించిన దేవుడు నీకు సహాయం చేస్తాడు.శూన్యము లోనుండి ఈ విశ్వాన్ని సృష్టించిన దేవుడు నీ అవసరతలను తీర్చలేడా? ఆయన సమర్థుడు. ఆయన నీకు సమకూర్చుటకు, కాపాడుటకు, తిరిగి ఇచ్చుటకు సమర్థుడు. బైబిల్ లోని పుటలను తిరగవెస్తే ఆయన ఏ విధంగా రెండింతలు తిరిగి ఇచ్చారో కనిపిస్తుంది. ఆయన పట్ల నమ్మకంగా నడిచిన వారినే కాదు, ఎవరైతే తమ పాపము విడిచి పశ్చాత్తాప పడ్డారొ వాళ్ళని కూడా దేవుడు బహుగా ఆశీర్వదించారు.  ఇశ్రాయేళీయులు తమ అతిక్రమముల విషయమై పశ్చాత్తాప పడగా దేవుడు వారిని క్షమించి ముందరి కన్నా ఎక్కువగా ఆశీర్వదించారు, యోబు పరీక్షించబడిన తర్వాత  రెండింతల ఆశీర్వాదం పొందుకున్నాడు. ఇవి బైబిల్ లోని కొన్ని examples మాత్రమే.

ప్రియమైన వారలారా నీవు ఎటువంటి పరిస్ధితిలో  ఉన్నా కూడా దేవుడు సమర్థుడు. ఒక వేళ దేవునికి నమ్మకముగా ఉన్నావేమో, ఆయన నీకు తప్పక బహుమానము ఇస్తాడు. ఒక వేళ దేవుని మార్గమును విడిచి ఆయన చిత్తమునకు దూరముగా వెళ్ళావేమో, నువ్వు తిరిగి వచ్చి పశ్చాత్తాప పడితే దేవుడు నీకు ఆశీర్వాదం తిరిగి ఇస్తాడు. ఒకవేళ ఆయనని ఇంకనూ నీ హృదయం లోనికి ఆహ్వానించలేదేమో, ఇప్పుడే నీ పాపములను ఒప్పుకొని ఆయనను నీ హృదయం లోనికి ఆహ్వానించితే, ఆయన నీకు రక్షణను నిత్య జీవాన్ని ఇస్తాడు.

కీర్తనాకారుని దేవుడే మన దేవుడు కూడా, ఆయన నిన్ను ఎన్నడు విడువడు, ఎడబాయడు.

16 March 2017

కీర్తనలు 27: 14 ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము యెహోవాకొరకు కనిపెట్టుకొని యుండుము.

నీవు దేని కోసం అయినా ఎదురు చూస్తున్నావా? ముఖ్యంగా ఏదన్నా ప్రార్థనకు జవాబు కోసం? ఆ విషయమై ఎన్నో రోజుల నుంచి లేదా నెలల నుంచి లేదా సంవత్సరాల నుంచి ప్రార్థిస్తూన్నావేమో?  కానీ దేవుని దగ్గరి నుంచి మాత్రం జవాబు రావడం లేదు . నువ్వు నమ్మకంగా దేవుని సేవ చేస్తుండ వచ్చు, ఇతరుల కోసం చేసిన ప్రార్థనలకు జవాబు వస్తోంది కానీ నీ అవసరతల విషయమై మాత్రం జవాబు రావడం లేదు.
నేను అదే పరిస్థితిగుండా వెళ్తున్నాను. వేరే వాళ్ల కోసం చేసిన ప్రార్థనలకు జవాబు వస్తోంది కానీ నా అవసరతల విషయమై  చేసిన ప్రార్థనలకు మాత్రం జవాబు రాలేదు. ఎన్నో సార్లు దేవునిని ప్రశ్నించాను ప్రభువా మీకు నేను గుర్తుకు రావడం లేదా నన్ను ఎందుకు మర్చి పోయావు అని. మరి కొన్ని సార్లు  complaint కూడా చేసాను ప్రభువా నా ప్రార్థనకు జవాబు చూడకుండా ఇతరులకు దేవుడు ప్రార్థనకు జవాబు ఇస్తాడు అని ఎలా చెప్పగలను అని.

అప్పుడు దేవుడు ఈ వాక్యాన్ని చూపించారు *ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము యెహోవాకొరకు కనిపెట్టుకొని యుండుము.* దీని ముందు వచనాన్ని చూస్తే అది ఈ విధంగా ఉంది కీర్తనలు 27: 13 సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదు నన్న నమ్మకము నాకు లేనియెడల నేనేమవుదును? యెహోవా కొరకు కనిపెట్టుకొని యుండుము english  లో అయితే ఈ విధంగా ఉంటుంది సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదు నన్న నమ్మకము నాకు ఉంది

ప్రియమైన వారాలారా మన నిరీక్షణ కూడా ఇలానే ఉండాలి. దేవుడు నమ్మదగిన వాడు ఆయన వాగ్దానము నెరవేర్చేవాడు. ఆయన *తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తుయేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును* అని వాగ్దానం చేసి యున్నాడు కనుక ఆయన నీ అవసరతలను తప్పక తీరుస్థాడు. ఆయన మార్గం, ఆయన timing వేరుగా ఉంటాయి. ఆయన సమకూర్చే వరకు నమ్మకంగా ఆయన నీకిచ్చిన పనిని చెయ్యి. తగిన సమయమందు దేవుడు నువ్వు ఊహించిన దాని కంటే మరి ఎక్కువగా ఆశీర్వాదాన్ని నీ జీవితం లోనికి పంపిస్తారు.
ఒకటి గుర్తు పెట్టుకో ఆలస్యం కనిపించని ఆశీర్వాదం. ఒక అక్క నాతో అన్నట్లు ఏదన్నా అవసరత మనకు ఆలస్యం అయినట్లు అనిపిస్తే దాని అర్థం దేవుడు మన giftని  మంచి wrapperలో చూడుతున్నారు దాన్ని మరింత అందంగా చెయ్యడానికి.

ధైర్యము తెచ్చుకొని...యెహోవాకొరకు కనిపెట్టుకొని యుండుము

14 March 2017

కీర్తనలు 42: 1-2 దుప్పి నీటివాగులకొరకు ఆశపడునట్లు దేవా, నీకొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవునికొరకు తృష్ణగొనుచున్నది జీవము గల దేవునికొరకు తృష్ణగొనుచున్నది దేవుని సన్నిధికి నేనేప్పుడు వచ్చెదను? ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడెదను?

నీవు ఎప్పుడైనా బాగా దాహం వేసి తాగడానికి నీళ్ళు లేని పరిస్థితిలో ఉన్నావా? ముఖ్యంగా  చాలా వేడిగా ఉన్న రోజున ప్రయాణములో నువ్వు ఉన్నావు, చాలా దాహంగా ఉంది, కాని మంచి నీళ్ళు దగ్గర లేవు అప్పుడు ఎవరో ఒకరు ఒక్క గుక్క నీళ్ళు ఉన్న చిన్న bottle ఇచ్చారు. ఆ నీళ్ళు తాగిన తర్వాత ఉండే తృప్తి ఎంత మంచి costly   drink తాగినా రాదు
.
వాక్య భాగములో చూస్తే కీర్తనాకారుడు దేవుని పట్ల ఇటువంటి దాహాన్ని కలిగి ఉన్నాడు.  అతడు నేను ఎప్పుడు ఎప్పుడు దేవుని సన్నిధికి వెళ్లాను అని ఆశ కలిగి ఉన్నాడు.
నీ హృదయం దుఃఖము కలిగియున్నప్పుడ, నిరాశ తో ఉన్నప్పుడు ఎవరి వైపు లేదా ఎవరి వైపు తిరుగుతున్నావు?  దేవుని కొరకు తృష్ణ కలిగి ఆశ కలిగి ఉన్నావా?  ప్రార్థన ద్వారా ఆయన సన్నిధికి వెళ్లాలని ఆశ కలిగి ఉన్నావా?

ప్రియమైన వారలారా మనము మన జీవితపు ప్రతి యొక్క ఘడియయందు  దేవుని పట్ల ఆకలి దప్పులు కలిగి ఉందాము. సంతోషమేమి దుఃఖమేమి ప్రతి సమయమందు మన రాజుల రాజు వద్దకు  పరుగెత్తుదాం.  మన ప్రాణమంతటితోనూ ఆయన కొరకు తృష్ణ కలిగి ఉందాము ఎందుకంటే మన ప్రాణమును తన జీవ జలములతో తృప్తి పరచగలిగినది ఆయన ఒక్కడే.

No comments:

Post a Comment