Thursday, July 20, 2017

July Devotions

25 July 2017

హృదయములను కఠినపరచుకొనకుడి


హెబ్రీయులకు 3: 13 నేడు మీరాయన శబ్దమును వినినయెడల, కోపము పుట్టించి నప్పటివలె మీ హృదయములను కఠినపరచుకొనకుడని ఆయన చెప్పెను

మామూలుగా ఈ వచనాన్ని చాలా మంది దేవునిని ఇంకా నమ్ముకొనని వారిని విశ్వాసము లోనికి ఆహ్వానించే సువార్త వర్తమానములో ఉపయోగిస్తారు, అది తప్పు కాదు. అయితే ఈ వాక్యము యొక్క సందర్భము చూస్తే మాత్రము ఇది దేవుని సువార్తను విని దేవునికి తమ హృదయాలను సమర్పించి ఆ తరువాత విశ్వాసములో చల్ల బడిపోయిన విశ్వాసులకు ఉద్దేశించ బడినది. ఈ వాక్యము  ఉద్దేశించ బడిన హెబ్రీ విశ్వాసులు ఆ సమయంలో ఎంతో శ్రమల గుండా వెళ్తున్నారు అందువలన నిరాశ చేత కొంత మంది యొక్క విశ్వాసము ఊగిస లాడుతూ ఉండినది మరియు చల్ల బడినది. వారి లాగానే మన విశ్వాసము కూడా కొన్ని సార్లు ఊగిస లాడి చల్ల బడిపోతుంది ముఖ్యంగా చాలా కాలం మన ప్రార్థనకు జవాబు రాక పోతే లేదా మనము శ్రమల గుండా (శారీరిక మరియు మానసిక) వెళ్తున్నట్లయితే లేదా మనము నిరాశలో ఉన్నట్లయితే. కాని ఈ వచనము ద్వారా దేవుని వాక్యము మనలను హెచ్చరిస్తున్నది, ఇలాంటి విశ్వాస సంక్షోభ సమయంలో మనము దేవుని స్వరాన్ని విన్నప్పుడు మన హృదయాలను కఠిన పరచు కోకూడదు అని.  దేవుడు తన వాక్యములో మనకు ఒక వాగ్ధానము ఇచ్చి యున్నారు మిమ్ములను ఎన్నడు విడువను ఎడబాయను అని. అందుకే మనము విశ్వాసములో కింద పడిపోయి ఉన్నప్పుడు కూడా ఆయన మనకు తన సన్నిధిని గూర్చి మరియు తన ప్రేమను గూర్చి మనకు గుర్తు చేస్తూ ఉంటారు. మన దగ్గరి వారిని మనలను ప్రోత్సాహించ డానికి మన వద్దకు పంపి, మరొకరి ద్వారా ఆదరణ కలిగించే వర్తమానాన్ని పంపి, కొన్ని సార్లు వాక్యము ద్వారా మాట్లాడతారు మరి కొన్ని సార్లు మన చుట్టూ ఉన్న ప్రకృతి ద్వారా కూడా తన  సన్నిధిని మనకు గుర్తు చేస్తారు. అయితే మనము కనుక వాటిని పట్టించు కోకుండా మన హృదయాలను కఠిన పరుచు కుంటే అప్పుడు మనము దేవుని దగ్గరి నుండి ఇంకా ఇంకా దూరంగా వెళ్లి పోతాము మరియు మెల్లగా మన విశ్వాసాన్ని కూడా విడిచి పెట్టేస్తాము. 

ఇశ్రాయేలీయులు అందరూ మోషే ద్వారా దేవుని చేత ఐగుప్తు నుండి బయటకు తే బడ్డారు కాని  వాగ్ధాన భూమిలోకి అందరూ అడుగు పెట్ట లేదు. వారి అవిశ్వాసము మూలంగా కొందరు అరణ్యములోనే రాలి పోయారు. హెబ్రీయులకు 3: 16-19  ఎలా మొదలు పెట్టమా అన్నది కాదు ఎలా ముగించామా అన్నది ముఖ్యము. చాలా మంది తమ విశ్వాస యాత్రను ఎంతో ఘనంగా మొదలు పెడతారు కాని ఒక చిన్న విషయం తప్పుగా జరిగితే చాలు తమ విశ్వాసాన్ని విడిచి పెట్టేస్తారు. కొన్ని సార్లు ఒక చిన్న తప్పు, చిన్న ఆలోచన లేదా చిన్న ఆవిధేయత మనలను విశ్వాసములో కింద పడేసి దేవునికి దూరముగా తీసుకువెళ్తుంది అయితే మనము తిరిగి దేవుని వద్దకు వెళ్లి ఆయనను క్షమాపణ అడగ డానికి ఇష్ట పడుతున్నమా? నిన్న Mr.Ravi Zacharias గారి ఒక వర్తమానం వింటూ ఉండగా ఆయన ఈ మాటలు చెప్పడం గమనించాను 'కింద పడిపోవడం కన్నా పడిపోయిన తరువాత అక్కడే నేల మీద ఉండి పోవడం అనేది చాలా చెడ్డ స్థితి'.  అది నిజమే, మనము విశ్వాసములో కింద పడినప్పుడు అక్కడే కనుక ఉండి పోతే అది పరిస్థితిని ఇంకా పాడు చేస్తుంది, మనము ఇంకా ఇంకా నిసృహలోకి వెళ్తాము మరియు మన పైన మనము జాలిలో మునిగి పోతాము. మనము దేవునికి వ్యతిరేకముగా పాపము చేసినప్పుడు మన మనఃసాక్షి మనలను guiltyగా చేస్తుంది మరియు మనము దేవునిని క్షమాపణ అడగడానికి కూడా సిగ్గుతో సంశయిస్తాము. కాని అక్కడే ఉండి పోవద్దు, నిజానికి మన గర్వము మనలను క్షమాపణ అడగ నివ్వకుండా ఆపుతుంది అందుకే బలవంతముగా అయినా మనము పైకి లేవాలి మరియు దేవుని రెక్కల కిందకు పరిగెత్తాలి. ఆయన ముందుగానే అక్కడ మన కోసం  ఎదురు చూస్తూ, మనలను క్షమించి మరొక సారి ఇంకొక అవకాశము ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నారు.  


ఒకవేళ మీరు క్రీస్తుని మీ నిజ రక్షకునిగా ఇంకా అంగీకరించకపోతే, దేవుడు ఇప్పుడు మీ హృదయపు వాకిలి వద్ద నిలిచి ఉండి తలుపు తడుతున్నారు అని గుర్తించండి. దయ చేసి మీ హృదయములో పరిశుద్ధాత్మ యొక్క ఒప్పుకోలును అడ్డుకోవద్దు, మిమ్ములను మీరు దేవునికి సమర్పించు కొనండి. విశ్వాసము ఒక ఊహాత్మక మైనది కాదు మరియు అవాస్తవమైనది కాదు. అది ఒక నమ్మకము కాదు అది దేవునితో వ్యక్తిగత సంబంధము కలిగి ఉండుట. సువార్త నిజమైనది మరియు సంపూర్ణమైనది. యేసు క్రీస్తు ఈ లోకము లోనికి శరీర ధారియై వచ్చారు, మన పాపముల (నీది మరియు నాది) పరిహారార్థము సిలువపై మరణించారు మరియు మూడవ దినమున మరణాన్ని జయించి తిరిగి లేచారు. ఈ లోకములో జన్మించారు కనుక ఆయన మనలను సంపూర్ణముగా అర్థము చేసుకోగలరు, మన భయాలు, మన సంశయాలు, మన శోధనలు అన్నీ, ఆయన మనకు బదులు సిలువపై మరణించారు కనుక మన పాపములు క్షమించబడినవి మరియు ఆయన మరణము నుండి తిరిగి లేచారు కనుక మనము కూడా మరణమునకు భయ పడక ఉండగలము మరియు నిత్య జీవము లోనికి ప్రవేశించగలము. ఆయన సంపూర్ణ మనిషి మరియు సంపూర్ణ దేవుడు అయి ఉన్నారు. కొన్ని విషయాలు మన మానవ హృదయం అర్థం చేసుకోలేదు, కాని అలా అని ఆ విషయం నిజము కాదని అది ఉండదని అర్థం కాదు కదా. స్వర్గము నరకము అనేవి నిజమైనవి మరియు ఎటు వెళ్లాలో అన్న నిర్ణయము దేవుడు మనకే వదిలి పెడుతున్నారు. అందుకే ఈ రోజు మిమ్ములను సవాలు చేస్తున్నాను మీరు నిద్రించే ముందు మీ bed పక్కన మోకరించి ఈ చిన్న ప్రార్థన చేయండి, యేసయ్యా నేను మిమ్ములను నమ్మాలి అనుకుంటున్నాను. మీ సువార్తను నేను నమ్మ లేక పోతున్నాను, నాకు నిజమైన దానిని చూపించండి. మిమ్ములను నాకు బయలుపరచండి మరియు సత్యము లోనికి నడిపించండి. నా పాపములు క్షమించి నా హృదయము లోనికి రండి. యేసు క్రీస్తు నామమున అడుగు చున్నాను ఆమెన్.
నన్ను నమ్మండి, మీరు ఈ ప్రార్థన కనుక చేసి న్నట్లయితే మీ జీవితం తప్పక మారుతుంది.

15 July 2017

పైనుండి వచ్చు జ్ఞానము

యాకోబు 3: 17 అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణమైనను లేనిదియునైయున్నది.

జ్ఞానము, వివేకము మరియు గ్రహింపు అనే పదాలు కొంత మంది ఒక దానికి బదులు ఒకటి వాడతారు కాని ఆ పదాల యొక్క అర్థాలు చాలా వ్యత్యాసంగా ఉంటాయి. చదువుట ద్వారా మరియు పరిశోధించుట ద్వారా మన వివేకాన్ని పెంచుకోవచ్చు, గ్రహింపు లేదా తెలివి అంటే అర్థము చేసుకోగలిగే మానసిక ప్రక్రియ లేదా మేధస్సు మరియు జ్ఞానము అనగా అనుభవంతో కూడిన, వివేచనతో కూడిన సరియైన నిర్ణయము తీసుకొనుట లేదా తీర్పు తీర్చుట అని అర్థం. మన ఆధ్యాత్మిక ప్రయాణములో జ్ఞానము కలిగి ఉండుట చాలా అవసరము ముఖ్యంగా ఇతరులను విశ్వాసములో నడిపించే వారు మరియు ఆత్మీయ బోధకులు తప్పక జ్ఞానము కలిగి ఉండాలి.
ఈ మధ్య కాలంలో నా జీవితంలో ఒక సంఘటన జరిగినప్పుడు కొందరు మాట్లాడిన మాటలు మామూలుగా అయితే అవి మంచి మాటలే ఆధ్యాత్మికమైనవే అయినా ఆ సమయంలో నాకు బాధను కలిగించాయి. వారు మాట్లాడినది మరియు చెప్పినది సరియైనదే కాని నా మానసిక స్థితి అవి స్వీకరించే పరిస్థితిలో లేదు, నాకయితే ఒంటరిగా ప్రశాంతముగా జరిగిన విషయాలు దేవుని ఎదుట పెట్టి ఆయన నా మనస్సును పరీక్షించి నాలో ఉన్న తప్పును చూపించాలి అని అనిపించింది అప్పుడు. అలానే కొన్ని నెలల క్రితం ఇంకొక సంఘటన జరిగింది, నేను కొన్ని ప్రార్థన అవసరతలను నా స్నేహితురాలితో పంచుకున్నాను. అయితే తాను busy గా ఉండడం వల్ల వెంటనే reply ఇవ్వలేక పోయింది కాని తాను ఆఫీస్ నుండి ఇంటికి వస్తున్న సమయంలో bus లో కూర్చునే నా కోసం ప్రార్థన చేసింది. మరియు ఆ మధ్య సమయంలో ఆ ప్రార్థనా అవసరతలు గురించి దేవుడు నాకు కొన్ని విషయాలు వెల్లడించారు. అందుకే నా friend నాకు reply ఇవ్వక ముందే నేను దేవుడు నాకు కొన్ని విషయాలు చూపించారు ఆ విషయం గురించి అని తనతో చెప్పాను. ఈ రెండు సంఘటనలు నాకు ఇతరులతో మాట్లాడేటప్పుడు లేదా వ్యవహరించే టప్పుడు జ్ఞానము మరియు వివేచన కలిగి యుండుట ఎంత ప్రాముఖ్యమో గుర్తించేలా చేసాయి. మరి ముఖ్యంగా మన ఎదురుగా లేని వ్యక్తులతో మాట్లాడే టప్పుడు వారి పరిస్థితిని సరిగా అర్థం చేసుకోడానికి దేవుని జ్ఞానము కలిగి ఉండుట చాలా అవసరం. మనము కనుక దేవుని జ్ఞానము కలిగి ఉంటే అప్పుడు అవతలి వ్యక్తి ఎటువంటి పరిస్థితుల గుండా వెళ్తున్నారో అర్థం చేసుకొని వారికి ఆదరణ కలిగించే మాటలు మాట్లాడ గలుగు తాము అలానే వారి పరిస్థితిని బట్టి కొన్ని సార్లు ఏమీ మాట్లాడకుండా నిశబ్దంగా వారి గురించి ప్రార్థన చేయ గలుగుతాము.

ఈ రోజు వాక్యంలో మన ప్రభువైన ఏసు క్రీస్తుకి సోదరుడైన యాకోబు ఇటువంటి దేవుని జ్ఞానము లేదా పైనుంచి వచ్చు జ్ఞానము గురించే మాట్లాడుచున్నారు. అట్టి జ్ఞానము మొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణమైనను లేనిదియునైయున్నది. యాకోబు 3:17 ఇది లోకమునకు సంబంధించిన  భూసంబంధ మైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము యాకోబు 3: 15 వంటిది కాదు. మనము ఇతరులతో మాట్లాడే టప్పుడు మరియు ఇతరులను నడిపించే టప్పుడు మన మాటలు మరియు మన వైఖరిని ఈ లేఖనములతో పోల్చు కోవాలి. మన ఉద్దేశం పవిత్రమైనదా? వారిని నడిపించుటకు లేదా మార్గ నిర్దేశము చేసేటప్పుడు లేదా దిద్దుబాటు చేసేటప్పుడు మన ఉద్దేశం వారి లాభము కొరకా లేదా మన ఆత్మీయ ఆధిక్యతను చూపించుకోవడానికి చేస్తున్నామా? మనము కూడా దేవుని కృప చేత రక్షించ బడిన పాపులమే అని కేవలము దేవుని కృప వలననే ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నామని మరిచి పోయి మనము అవతలి వ్యక్తి కంటే ఆత్మీయంగా గొప్ప వారిమని ఆత్మీయ గర్వంలో పడిపోవడం చాలా సులువు. మన మాటలు సమాధాన కరమైనవా మరియు మృదువైనవా లేదంటే మన ఆలోచనలను బలవంతంగా వారిపై రుద్దు తున్నామా? వారి మానసిక పరిస్థితిని అర్థం చేసుకుని వారితో కనికరముగా వ్యవహరిస్తున్నామా లేదంటే వారి గాయాల మీద కారం చల్లుతున్నామా? గతాన్ని తవ్వి వారిని ఇంకా ఎక్కువ బాధ పెడుతున్నామా? మనము పక్షపాతమైనను వేషధారణమైనను లేనివారమై ఉన్నామా? మన ఉద్దేశం ఎంత మంచిదైనా కావచ్చు మన మాటలు వేదాంత పరముగా సరి అయినవి కావచ్చు కాని అసందర్భముగా మాట్లాడిన మాటలు అవతలి వ్యక్తిని బాగా గాయ పరుస్తాయి. ఇలా అసందర్భమైన సలహాల వలన చర్చిని మరియు వారి విశ్వాసాన్ని విడిచి పెట్టిన కొందరి గురించి నేను విన్నాను చదివాను. అందుకనే పరిస్థితిని బట్టి కొన్ని సార్లు మనము ఏమీ మాట్లాడ కుండా వారిని దేవుని ఎదుట ప్రార్థనలో ఎత్తి పెట్టుటయే శ్రేష్ఠము.

అలాంటి జ్ఞానము కలిగి యుండుట అంత సులువు కాదు కాని దేవుని వాక్యము చెబుతున్నది జ్ఞానము కొరకు దేవునిని అడిగితే ఆయన మనకు దానిని తప్పక ఇస్తారు అని యాకోబు 1:5, యెహోవాయే జ్ఞానమిచ్చువాడు తెలివియు వివేచనయు ఆయన నోటనుండి వచ్చును.సామెతలు 2: 6. మరియు అపరంజిని సంపాదించుట కంటే  జ్ఞానము సంపాదించుట మేలు మరియు వెండిని  సంపాదించుట కంటే తెలివిని సంపాదించుట మేలు  సామెతలు 16:16 . జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్ఠము సామెతలు 8:11, యుద్ధా యుధముల కంటె జ్ఞానము శ్రేష్ఠము ప్రసంగి 9: 18. అంతే కాదు దేవుని వాక్యము మనలను జ్ఞానము సంపాదించు కొనమని సామెతలు 4:5 కూడా ఆదేశించు చున్నది. మరి మనము దేవునికి ఇష్టులుగా జీవించుటకు మరియు ఇతరులకు ఆశీర్వాదముగా జీవించుటకు కావలసిన జ్ఞానము, వివేకము మరియు గ్రహింపు ఇవ్వమని దేవునిని వేడుకుందాం.

అపోస్తలుడైన పౌలు కొలస్సీయులు 1:9 లో ప్రస్తావించిన విధంగా నేను కూడా, మనము అందరము సంపూర్ణ జ్ఞానము, ఆత్మ సంబంధమైన వివేకము గలవారము మరియు ఆయన చిత్తము పూర్ణముగా గ్రహించిన వారమై ఉందుము గాక అని ప్రార్థించు చున్నాను.


No comments:

Post a Comment