Sunday, September 3, 2017

September Devotions

29 Sept 2017

అంతయు నెరవేరెను


యెహోషువ 21: 45 యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదియు తప్పియుండలేదు, అంతయు నెరవేరెను.

కొంచెము కాదు లేకుంటే ఒక వంతు కాదు లేకుంటే వాగ్ధానాలలో కొంత భాగము కాదు లేదంటే వాగ్ధానాలలో కొన్ని కాదు దేవుడు ఇశ్రాయేలీయులకు సెలవిచ్చిన మాటలన్నియు నెరవేరెను. ఆహా....ఇది యెహోషువ గ్రంథ కర్త యొక్క ఎంత గొప్ప వాదన. అయితే మనము కనుక ఇదే గ్రంథములో ముందరి అధ్యాయాలు చదివినట్లయితే ఇది ఒట్టి వాదన కాదు నిజము అని గమనించ గలము. యెహోషువ యొక్క నాయకత్వములో ఇశ్రాయేలీయులు గెలిచిన యుద్ధములు మరియు వారి మధ్య వాగ్ధాన భూమిని స్వాస్థ్యముగా విభజించు కొనుట మరియు అన్ని దిక్కుల యందు దేవుడు వారికి ఇచ్చిన విశ్రాంతి ఈ విషయాన్ని ధృవీకరిస్తాయి.

అందుకే దారి కష్టముగా ఉండి, ఆలస్యము చాలా అవుతుంది అనిపిసిస్తుంటే ఈ వాక్యము మనలను ఎంత గానో ఆదరిస్తుంది, దేవుడు సెలవిచ్చిన ఒక్క మాట కూడా నెరవేర్చ బడకుండా ఉండదు అని.  మనము ప్రయాణించే మార్గము ఎంత పొడుగాటి దయినా కావచ్చు లేదా దారి ఎంత చిన్న దయినా కావచ్చు, మలుపు ఎంత కష్ట మైన దయినా కావచ్చు లేదా వాలు (slope) ఎంత సులువైన దయినా కావచ్చు కాని ఒకవేళ దానిలో మనలను నడిపించేది కనుక మన ప్రభువు అయినట్లయితే ఆయన మనలను తప్పక విశ్రాంతి లోనికి నడిపిస్తారని మనము నిమ్మళము కలిగి ఉండవచ్చు ఎందుకంటే వాగ్దానము చేసినవాడు నమ్మదగిన వాడు - హెబ్రీయులకు 10:23a

23 Sept 2017

 సమస్తము ఆయన మహిమార్థమే


యెషయా 43: 19 ఇదిగో నేనొక నూతనక్రియ చేయుచున్నాను ఇప్పుడే అది మొలుచును మీరు దాని నాలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను ఎడారిలో నదులు పారజేయుచున్నాను.


అరణ్యములో తప్పిపోవడం చాలా సులువు, మంచి compass మరియు దిక్కుల గురించి మంచి అవగాహన లేక పోతే మనము వెళ్లిన మార్గంలోనే మళ్లీ మళ్లీ వెళ్తూ బయటకి రావడానికి చాలా కష్ట పడవలసి కూడా వస్తుంది. అరణ్యములో దారి వెదుకుట చాలా కష్టము కాబట్టే టీవీ లో కొన్ని reality shows కూడా వచ్చాయి ఈ విషయం మీద , ఒక వ్యక్తిని లేదా కొందరి వ్యక్తులను అరణ్యములో వదిలి పెడితే వారు తిరిగి నాగరికతకు చేరుకోవాలి మరియు అలా చేరుకున్న వారికి ఒక మంచి బహుమతి కూడా ఉంటుంది. 

ఈ రోజు వాక్య భాగము యొక్క సందర్భానికి వస్తే, దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో తన ప్రవక్త అయిన యెషయా ద్వారా వారి భవిష్యత్తు ప్రవచనమును గురించి మాట్లాడుచున్నారు, వారు దేవుని పై తిరుగుబాటు చేయుట, బబులోను దేశమునకు బానిసలుగా తీసుకొని వెళ్లుట మరియు బానిసత్వము నుండి విడుదల పొంది కనాను దేశమునకు తిరిగి వెళ్లుట, వీటిని గురించి. ముఖ్యంగా ఈ వచనములో  వారు బబులోను నుండి కనాను దేశమునకు తిరిగి వెళ్ళేప్పుడు అరణ్యములో మార్గమును కలుగ జేస్తానని మరియు ఎడారిలో సెలయేళ్లను పారజేసి వారికి మంచి నీటిని ఇస్తానని చెబుతున్నారు. భూగోళ శాస్త్రమును పరిశీలిస్తే బబులోను మరియు కనాను దేశముల మధ్య ఎన్నో మైళ్ళ వరకు అరణ్య ప్రాంతము ఉన్నది. నేనయితే దేవుని యొక్క నిర్దిష్టత చూచి ఆశ్చర్య పడ్డాను, ఆయన వారితో వారి తిరుగు ప్రయాణము గురించి  వాగ్ధానం చేసి వదిపెట్ట లేదు కాని వారిని  క్షేమముగా గమ్యము చేర్చుటకు అరణ్యములో మార్గము కలుగ జేస్తానని, ఎడారిలో సెలయేళ్లను కలుగ జేస్తానని, ఇంకా అడవి జంతువులు హాని చేయకుండా కాపాడుతానని (వ 20) కూడా చెప్పారు. ఆయన ఇవన్నీ తన ప్రజలు ఆయన స్తోత్రము ప్రచురము చేయుటకు చేయుచున్నారు.

దేవుడు చేయు సమస్తమును ఆయన మహిమార్థమే చేయును. మన జీవితంలో కూడా దేవుడు ఏ మార్గము లేని చోట మార్గము తయారు చేయగలరు. ముఖ్యంగా ఆయన మార్గము కొరకు ఎదురు చూస్తున్న మనతో దేవుడు ఈ వాక్యము ద్వారా స్పష్టముగా మాట్లాడుచున్నారు, ఆయన మనలను నడిపించుట మాత్రమే కాదు మన కొరకు కొత్త మార్గము కూడా చేయగలరు అని. మనకు ఏ హాని రాకుండా చూడగలరు మరియు మార్గములో కావలసిన సమస్తమును కూడా సమకూర్చ గలరు. ఇంతకు ముందు మనము ఎలాంటి వారిమైనా, ఏమి చేసినా ఇప్పుడు మనము కనుక మనలను మనము తగ్గించు కొని మన చెడు కార్యములు వదిలి పెట్టి నట్లయితే అప్పుడు దేవుడు మన జీవితంలో కూడా అద్భుత కార్యాలు చేస్తారు. మరియు దానంతటిలో దేవుని నామము మహిమ పరచ బడుతుంది.

21 Sept 17

దేవుని సన్నిధి కొరకు ఆశ


కీర్తనలు 27: 4 యెహోవాయొద్ద ఒక్క వరము అడిగితిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిర ములో నివసింప గోరుచున్నాను.



ఈ కీర్తనను ప్రభువుకు ఇష్టాను సారుడైన (1 సమూయేలు 13:14,అపోస్తుల కార్యములు 13:22) దావీదు మహారాజు వ్రాసాడు అనడంలో ఆశ్చర్యం లేదు. దావీదు పరిపూర్ణమైన వాడేమీ కాదు, తనకు కూడా కొన్ని బలహీనతలు మరియు లోపాలు ఉన్నాయి, కాని అతని హృదయ వాంఛ మాత్రము ఎప్పుడూ దేవునిని గురించి తెలుసుకోవాలి మరియు ఆయన చిత్తాన్ని చెయ్యాలి అని ఉండేది. అందుకనే దేవుడు స్వయంగా ఆయనను తన చిత్తనుసారమైన మనస్సుగలవాడు అని సాక్ష్యమిచ్చారు. తాను దేవుని యొక్క సన్నిధిలో ఉండాలని మరియు ఆయన ప్రసన్నతను చూడాలన్న దావీదు యొక్క మనస్పూరిత కోరికను ఈ రోజు వాక్యభాగము చక్కగా వర్ణిస్తుంది. ప్రేమలో ఉన్న ఒక వ్యక్తిని ఊహించుకోండి, అతను లేక ఆమె ఎప్పుడు తాము ప్రేమించుచున్న వ్యక్తి యొక్క ఆలోచనలలో మునిగి ఉంటారు మరియు వారితో ఉండాలని ఆశ పడతారు. దేవుని పట్ల దావీదు కలిగి యున్న  ప్రేమ కూడా అటువంటిదే. పాత నిబంధన కాలములో యాజకులు మాత్రమే దేవుని ఆలయములో ఉండగలరు మరి దావీదు ఒక వేళ దేవుని సన్నిధిలో ఉండటానికి తన రాజకత్వాన్ని యాజకత్వంగా మార్చుకోవాలని ఆశ పడ్డారేమో. లేదంటే ఆయన దేవుని ఎదుట నేల మీద కూర్చుని ఉండాలని (2 సమూయేలు 7:18) మరియు ఆయనను పాటతో స్తుతించాలని (2 సమూయేలు 22) ఆశ పడ్డారేమో. ఏది ఎలా అయినా ఆయన మనస్సు మాత్రము దేవుని దగ్గరకు వెళ్లాలని మరియు ఆయన సన్నిధిని అనుభవించాలని తహ తహ లాడేది.


కొత్త నిబంధన విశ్వాసులమైన మనము రాజులైన యాజకసమూహము, ఏర్పరచుకున్న జనాంగము అని పిలువ బడుచున్నాము (1 పేతురు 2:9) మరియు మనకు ఎప్పుడైనా ఎక్కడైనా సరే దేవుని సన్నిధి లోనికి ప్రవేశించడానికి అధికారము ఇవ్వబడినది (హెబ్రీయులకు 4:16,10:19-20). మరి ఇంతటి స్వేచ్ఛతో మరియు అధికారముతో దేవుని కృపా సింహాసనమును సమీపించుట మనకు ఎంతో సులభము. అయితే నిజముగా మనలో ఎంత మందిమి దేవుని దగ్గరకు కేవలము ఆయన సన్నిధిలో ఉండడానికి మరియు ఆయన ప్రసన్నతను చూడటానికి వెళ్ళాలని ఇష్ట పడతాము? మన పెదవులతో మాత్రము దేవుని దగ్గరకు వెళ్లాలని ఆశ ఉన్నది మరియు ఆయన సన్నిధిలో ఉండాలని కోరుచున్నాము అని చెప్ప వచ్చు కాని నిజముగా మన హృదయమంతటితో అలా ఆశ పడుచున్నామా? 

అలానే ప్రార్థనలో దేవుని వద్దకు మన అభ్యర్థనలను, మనవులను, విజ్ఞాపనలను తీసుకొని వెళ్లడం ఒక ఎత్తు మరియు ఆయన సన్నిధిలో ఊరకనే కూర్చుని నిశబ్దముగా కనిపెట్టడం ఇంకొక ఎత్తు. మరి ఒక వేళ ఇప్పటి వరకు మీరు అలా చేసి ఉండకపోతే ఈ రోజే తప్పక ప్రయత్నించి చూడండి. ఎందుకంటే ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు మరియు ఆయన కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు (కీర్తనలు 16:11) ఇవి ఏ లోకము ఇవ్వలేదు మరియు ఏ డబ్బు కొనలేదు.

5 Sept 17

హృదయశుద్ధి


మత్తయి 5: 8 హృదయశుద్ధిగలవారు ధన్యులు; వారు దేవుని చూచెదరు.



ఆసక్తికరముగా దేవుని వాక్యము పరిపూర్ణ మైన వారు దేవుని చూచెదరు అని చెప్పడం లేదు కాని దానికి బదులు హృదయశుద్ధిగలవారు ధన్యులు; వారు దేవుని చూచెదరు అని చెబుతున్నది. అందువలననే హృదయశుద్ధి అనేది దేవుని బిడ్డలకు ఐచ్ఛికమైనది కాదు (optional) ఖచ్చితంగా కావలసిన విషయము. ఒక వైపు అపవిత్రమైన జీవితం జీవిస్తూ ఇంకొక వైపు దేవునిని చూడటం మరియు ఆయన స్వరం వినడం అనేది అసాధ్యం. ఇశ్రాయేలు ప్రజలకు ఇవ్వబడిన పాత నిబంధన లోని కట్టడలు దేవుడు ఎంత పరిశుద్ధుడో మరియు ఆయనను సమీపించడం ఎంత కష్టమైన పనో తెలియజెప్పాయి. అప్పట్లో కొన్ని కొన్ని విషయాలకు కొన్ని కొన్ని శుద్ధీకరణ పద్ధతులు కావాల్సి ఉండేవి. ప్రత్యక్ష గుడారములోనికి ప్రవేశించడానికి కూడా శుద్ధి చేసుకోవాల్సి వచ్చేది.  అయితే కొంతమంది ఏమనుకుంటారంటే ఇప్పుడు యేసు క్రీస్తు వచ్చేసారు కనుక మనము ఆజ్ఞలను కట్టడలను పెద్దగా పట్టించుకొనవసరం లేదు అని , లేదు ప్రియమైన వారలారా యేసు క్రీస్తు స్వయంగా తానే చెప్పారు ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టి వేయవచ్చితినని తలంచవద్దు; నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. మత్తయి 5: 17 అని. పాత నిబంధన కట్టడలు పాటించడానికి బాహ్య పరిశుద్ధత కావాల్సి వచ్చింది కాని క్రీస్తు యొక్క నూతన నిబంధన హృదయ శుద్ధిని ఖచ్చితం చేసింది. దావీదు మహారాజు కూడా ఈ విషయాన్నే తన కీర్తనలలో  కూడా తెలియ జేశారు. యెహోవా పర్వతమునకు ఎక్కదగినవాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు? వ్యర్థమైనదానియందు మనస్సు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులును శుద్ధమైన హృదయమును కలిగి యుండువాడే. కీర్తనలు 24: 3-4



దురదృష్టవశాత్తు మనలో కొంతమందిమి హృదయశుద్ధి, మాటలలో పవిత్రత, ఆలోచనలలో పవిత్రత లేకుండా మనము ఏమి చేసినా కూడా అది దేవుని దృష్టికి ఇష్టముగా ఉండవని కఠిన మార్గంలో నేర్చుకుంటున్నాము. మన సేవ ఎంత పెద్దదయినా, మనము బయటకి ఎంత అద్భుతంగా కనిపించినా మన హృదయంలో పవిత్రత లేక పోతే మనము చేసే ప్రతి పని  కఱ్ఱ, గడ్డి మరియు కొయ్యకాలే మరియు ఒక రోజు అవి అగ్నికి కాలి బూడిద కావాల్సిందే. 


మరి పవిత్రులుగా ఎలా చేయబడతాము? మనకు మారుగా  క్రీస్తు సిలువ పైన మరణించడం వలన  మనకు పాప విమోచన కలిగింది మరియు మన అపరాధముల నుండి శుద్ధి చేయబడ్డాము. అందువలన ఎప్పుడయితే మనము మన పాపముల నిమిత్తము పశ్చాత్తాప పడి, క్రీస్తు యొక్క విమోచనను అంగీకరించి, ఆయనను మన హృదయములోనికి మన రక్షకునిగా అధిపతిగా అంగీకరించామో ఆ క్షణమే మనము పవిత్రులుగా చేయబడినాము. అయితే దానిని అనగా ఆ పవిత్రతను కొనసాగించడం అనేది ప్రతి రోజు చేయ వలసిన కార్యము. మరి ఎలా కొనసాగించగలము? కీర్తనా కారుడు చెప్పినట్లు యౌవనస్థులు దేనిచేత తమ నడత శుద్ధిపరచు కొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే గదా? కీర్తనలు 119:9 మనము మన హృదయాలను దేవుని వాక్యముతో నింపుకోవాలి. అలా చేసినప్పుడు మన శోధనలలో, మన అవసరతలలో పరిశుద్ధాత్మ దేవుడు తగిన వాక్యములను గుర్తు చేసి మనలను అధిగమించే వారిగా చేస్తారు. నీ యెదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని యున్నాను.కీర్తనలు 119: 11

అలానే మనము మన మాటలలో పవిత్రత, ఆలోచనలలో పవిత్రత మరియు మన చూపులో పవిత్రత కలిగి ఉండుట లక్ష్యము చేసుకుంటే అప్పుడు మన హృదయము పవిత్రముగా ఉంటుంది. అందుకే మనము ఏది ఆలోచిస్తున్నాము మరియు మన హృదయాలను దేనితో నింపుకుంటున్నాము అనేది చాలా ముఖ్యము. టీవీ లో మరియు ఇంటర్నెట్ లో చూసే వాటి గురించి మనము జాగ్రత్త వహించాలి మరియు మనము మన మనస్సులోనికి ఏ ఆలోచనలను రానిస్తున్నాము అనే దాని పట్ల శ్రద్ధ వహించాలి. మనము సత్యమైన, మాన్యమైన, న్యాయమైన, పవిత్రమైన, రమ్యమైన, ఖ్యాతిగల, యోగ్యమైన మరియు మొప్పయిన వాటి మీద ధ్యాన ముంచుకోవాలి ఫిలిప్పీయులకు 4: 8. ఈ విషయాలను మనము నమ్మకముగా పాటిస్తూ ఉన్నట్లయితే  అప్పుడు దేవుడు మనకు తన కృపను అనుగ్రహించి క్రీస్తు దినమునకు పవిత్రులుగా మరియు నిర్దోషులుగా ఉంచును ఫిలిప్పీయులకు 1: 11

4 Sept 17

 ఫలమిచ్చు చెట్టువలె 

కీర్తనలు 1: 3 అతడు నీటికాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలె నుండును అతడు చేయునదంతయు సఫలమగును.

దేవుని వాగ్దానాలలో కొన్ని నిబంధనలతో కూడినవి, ఈ రోజు వాక్య భాగము అలాంటి వాగ్దానములలో ఒకటి. ఒక వ్యక్తి నీటికాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలె ఎప్పుడు ఉంటాడంటే అతడు కొన్ని విషయాలు చేయడం వలన మరియు కొన్ని విషయాలు చేయకుండుట వలన. మీరు కనుక ఒకసారి గుర్తు చేసుకుంటే కొన్ని నెలల క్రితము మనము ఇలాంటి ఇంకో వాక్యాన్ని ధ్యానించాము యిర్మియా 17: 7-8 ​యెహోవాను నమ్ముకొను వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలములయొద్ద నాటబడిన చెట్టువలె నుండును; అది కాలువల ఓరను దాని వేళ్లు తన్నును; వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగానుండును, వర్షములేని సంవత్సరమున చింతనొందదు కాపు మానదు. ఈ వాక్యము ప్రకారము ఒక వ్యక్తి యెహోవాను నమ్ముకొని ఆయనను విశ్వసించిన యెడల అతడు ఫలభరితమైన చెట్టు వలె ఉండును. అలానే ఈ రోజు వాక్య భాగము ప్రకారము ఒక వ్యక్తి ఫలభరితమైన చెట్టు వలె ఉండడానికి అతడు
1.దుష్టుల ఆలోచనచొప్పున నడువక 
2.పాపుల మార్గమున నిలువక 
3. అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక
4. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు
5. దివారాత్రము దానిని ధ్యానించుచు ఉండును.
మొదటి మూడు చేయకూడని పనులు వచనము 1 మరియు చివరి రెండు చెయ్యవలసిన పనులు వచనము 2 లో వ్రాయ బడినవి కీర్తన 1 లో. వీటిని గురించి వివరంగా తెలుసుకుందాం.

1.దుష్టుల ఆలోచన చొప్పున నడువక ఉండును
దేవుని వాక్యము ప్రకారము భక్తిహీనులు (దుష్టులు) చెప్పు ఆలోచనలు మోసకరములు. సామెతలు 12: 5b. దుష్టులు పాపముతో, చేటుతో మరియు అబద్ధముతో నిండి ఉంటారు కీర్తనలు 7:14, దేవునిని వెదుకరు మరియు దేవుని భయము వారిలో లేదు కీర్తనలు 10:4,36:1 పాపయోచనను యోచించును కీర్తనలు 36:4, అప్పు చేసి తీర్చకయుందురు కీర్తనలు 37:21. భక్తిహీనులు అర్పించు బలులు, వారి మార్గములు మరియు వారి ఆలోచనలు దేవునికి హేయములు సామెతలు 15:8-9,26. కాబట్టి ఒక వ్యక్తి ఫలభరితమైన జీవితం జీవించాలి అని కోరినట్లయితే అతడు దుష్టుల మోసకరమైన ఆలోచనల చొప్పున నడువక, పాపమును మరియు చెడు తనమును విసర్జించి, దేవునిని వెదుకుతూ ఆయన యందు భయభక్తులు కలిగి ఉండ వలెను.

2.పాపుల మార్గమున నిలువక ఉండును
నేను ఒక దేవుని సేవకుని దగ్గర పాపము యొక్క నిర్వచనాన్ని ఈ విధంగా విన్నాను. పాపము అనగా దేవుడు ఇచ్చిన వాంఛలను దేవుడు ఇచ్చిన తలాంతులు మరియు వరములను ఉపయోగించి తప్పైన పద్దతిలో మరియు తప్పైన సమయంలో తీర్చు కొనుట. పాపము అనగా దేవునికి మరియు ఆయన వాక్యమునకు వ్యతిరేకముగా ఆవిధేయత చూపించుట. పాపము యొక్క మార్గము చివరకు నాశనము మరియు మరణానికే దారి తీస్తుంది. కాబట్టి ఒక వ్యక్తి ఫలభరితమైన జీవితం జీవించాలి అని కోరినట్లయితే అతడు పాపుల మార్గాన్ని విసర్జించి దేవుని మార్గములో నడువ వలెను.

3. అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక ఉండును
అపహాస్యం అంటే గేలి చేయడం మరియు వాక్యము ప్రకారము అహంకారియైన గర్విష్ఠునికి అపహాసకుడని పేరు అట్టివాడు అమితగర్వముతో ప్రవర్తించును.సామెతలు 21: 24. కాబట్టి ఒక వ్యక్తి ఫలభరితమైన జీవితం జీవించాలి అని కోరినట్లయితే అతడు ఇతరులను తీర్పు తీర్చక, గేలి చేయక మరియు చిన్నబుచ్చక వారిని ప్రోత్సహించాలి మరియు పైకి లెవనెత్తాలి.

4. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు ఉండును
ధర్మశాస్త్రము అనగా దేవుని వాక్యము. ధర్మశాస్త్రమునందు ఆనందించుట అనగా మనము దేవుని వాక్యము చదువుటలో అత్యంత ఆనందాన్ని పొందుట. మనము ఎవరినైనా ప్రేమిస్తే వారి గురించి తెలుసు కోవాలి, వారితో సమయాన్ని గడపాలి అని కోరుకుంటాం. ఆ విధంగానే మనము దేవునిని కనుక ప్రేమిస్తే ఆయనతో సమయం గడపాలి, ఆయనను గురించి తెలుసు కోవాలి అని కోరుకుంటాం. మరియు దేవుని గురించి తెలుసు కోవడానికి ఆయన వాక్యము చదవడం అనేది శ్రేష్ఠమైన పద్ధతి. అసలు మనం దీనిని చూస్తే ఇది ఒక చక్రం లాగ ఉంటుంది, మనము దేవునిని ఎంత ఎక్కువ ప్రేమిస్తే అంత ఎక్కువగా వాక్యము చదవాలి అనుకుంటాము, మరియు దేవుని వాక్యము ఎంత ఎక్కువగా చదివితే దేవునిని అంత ఎక్కువగా ప్రేమించ గలుగుతాము. కాబట్టి ఒక వ్యక్తి ఫలభరితమైన జీవితం జీవించాలి అని కోరినట్లయితే అతడు దేవుని వాక్యమందు ఆనందించాలి.

5. దివారాత్రము దానిని ధ్యానించుచు ఉండును
దేవుని వాక్యమును ధ్యానించుట అంటే ఒక వాక్యము భాగమును మరల మరల చదువుచూ అది మనకు సజీవముగా మారే వరకు దానిని గురించి మనసులో మరల మరల గుర్తు చేసుకొనుట మరియు ఆ వాక్యము యొక్క సత్యము మన హృదయములో ఇంకి పోవుట. దేవుని వాక్యమును ధ్యానించు వానికి, దేవుని వాక్యము రొట్టె వలె మరియు జీవము అగును. కాబట్టి ఒక వ్యక్తి ఫలభరితమైన జీవితం జీవించాలి అని కోరినట్లయితే అతడు దేవుని వాక్యమును చదవాలి మరియు ధ్యానించాలి.

క్లుప్తంగా చెప్పాలంటే, నీటికాలువల యోరను నాటబడిన చెట్టువలె ఫలభరితమైన జీవితం కలిగిన వ్యక్తి ఎల్లప్పుడూ దేవుని యందు ఆనందించుచూ లోకమును మరియు దాని మార్గములను విసర్జించును.

మనలో చాలా మంది విశ్వాసులు దేవునిని తెలుసుకొని ఎన్నో సంవత్సరాలు అయినా కూడా ఫలాలు లేని జీవితం జీవిస్తున్నాము. అది ఎందువలన అంటే మనము పైన చెప్పబడిన సంగతులలో ఒక దానిని లేక కొన్నిటిని చేయక పోవడం వలన. అందుకే మరి ఈ రోజు మన జీవితాలను కీర్తనలు 1:1-3 తో సరి చూసుకొని, మనము ఎక్కడ తప్పి పోతున్నామో చూపించమని దేవునిని అడుగుదాం. అంతే కాదు ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించినవారమై, ప్రతి సత్కార్యములో సఫలులగుచు, దేవుని విషయమైన జ్ఞాన మందు అభివృద్ధి పొందుచు, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు, ఆయనకు తగినట్టుగా నడుచుకొనుటకు (కొలస్సీయులకు 1: 10) తన కృపను ఇవ్వమని కూడా ఆయనను అడుగుదాం.

No comments:

Post a Comment