Wednesday, October 4, 2017

October Devotions

26 Oct 2017

దైవిక యుద్ధోపకరణములు


2 కోరింథీయులకు 10: 4 మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావుగాని, దేవుని యెదుట దుర్గములను పడద్రోయజాలినంత బలముకలవైయున్నవి.

చాలా మంది ఏమనుకుంటారంటే మనము కళ్ళతో చూసేది, చెవులతో వినేది, చేతులతో తాకేది లేదంటే ముక్కుతో వాసన చూసేవి మాత్రమే ఉనికిలో ఉంటాయి అని. అయితే మన కంటికి కనిపించేదానికంటే, చెవికి వినిపించేదానికంటే మరియు మన చేయి తాకే దానికంటే ఇంకా ఎంతో ఉంది. అదే ఆధ్యాత్మిక రాజ్యం. ఆధ్యాత్మిక రాజ్యంలో జరిగేవి మన కంటికి కనిపించవు మన చెవులకు వినిపించవు అయినా అది ఉనికిలో తప్పక ఉంది. ఈ ఆధ్యాత్మిక రాజ్యము గురించి బైబిల్లో మనకు కొన్ని చోట్ల కనిపిస్తుంది, ఉదాహరణకు దానియేలు ప్రార్థించినప్పుడు అతని ప్రార్థనకు జవాబు తీసుకుని వస్తున్న ప్రధాన దూతను సైతాను అనుచర దూతలు అడ్డుకోవడం దానియేలు 10:12-13, మరియు ఇంకొక సందర్భములో ఒక పాపి పశ్చాత్తాపము పడినప్పుడు పరలోకంలో దేవ దూతల సమక్షంలో సంతోషము లూకా 15:10 ఇలా కొన్ని చోట్ల పరలోకంలో జరిగే విషయాలు బైబిల్ లో ప్రస్తావించడం చూస్తాము.

ఎప్పుడైనా సంఘర్షణలు లేదా కలహాలు లేదా పొట్లాటలు జరిగినప్పుడు మనము కాస్త ఆగి అవతలి వ్యక్తి మనకు హాని చేస్తున్నాడని కాక దుష్టుడు వారి చేత అలా చేయిస్తున్నాడు అని ఆలోచించాలి. ఈ విషయమై అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు 6: 12*లో తెలియ జెప్పి ఉన్నారు ఏలయనగా మనము పోరాడునది శరీరులతో (మూలభాషలో-రక్తమాంసములతో) కాదు, గాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకార సంబంధులగు లోక నాథులతోను, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము అని. అందుకనే దేవుని బిడ్డలకు మన ఎదురుగా కనిపించేదానికన్నా అసలు విషయం ఏమి జరుగుతుందో అర్థం చేసుకోవడం ముఖ్యం.

ఇతరులతో కలహం మాత్రమే కాదు, మన జీవితంలో కూడా ఇంత ప్రయత్నించినా కొన్ని విషయాల్లో ఓటమినే చవి చూస్తున్నట్లయితే ప్రియమైన దేవుని బిడ్డా నీవు నీ శరీర శక్తితో పోరాడటం ఆపివేసి దుర్గములను పడద్రోయజాలినంత బలముకలవైయున్న దేవుని యుద్ధోపకరణములు వాడుట మొదలు పెట్టాలి. దేవుడు మనకు అలా చేయడానికి ఏర్పాటు చేసి యున్నారు. ఎఫెసీయులకు 6: 11-18 లో అపొస్తలుడైన పౌలు మనము సర్వాంగ కవచమును ధరించుకొనవలెనని చెప్పి యున్నారు. మన ఆలోచనలను కాచు కొనుటకు రక్షణ అను శిరస్త్రాణమును, మన భావోద్వేగాలను కాచు కొనుటకు నీతియను మైమరువును, మన ఎదురుగా కనిపించేది కాక అసలు విషయం తెలుసు కోవడానికి మన నడుముకు సత్యము అనే దట్టీని, పాదములకు సమాధాన సువార్త వలననైన సిద్ధమనస్సను జోడు తొడుగుకొన వలెను. అలానే దుష్టుని అగ్ని బాణ ములను ఆర్పుటకు విశ్వాసము అను డాలు, దేవుని వాక్యము అను ఆత్మ ఖడ్గము మన రక్షణ కొరకు మరియు పోరాడట కొరకు ధరించ వలెను. ప్రతి ఉదయం మన పడకల మీద నుండి లేవక ముందే ఈ సర్వాంగ కవచమును ధరించండి మరియు దేవునికి లోబడియుండుడి, అపవాదిని (సాతాను) ఎదిరించుడి, అప్పుడు వాడు మీయొద్దనుండి పారిపోవును.యాకోబు 4: 7. ఇక నా జీవితం సాఫీగానే సాగి పోతుంది అనుకునే వారు  నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి; మీ విరోధియైన అపవాది (సాతాను) గర్జించు సింహమువలె ఎవరిని మింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు.1పేతురు 5: 8.

అదే సమయంలో ఒకటి గుర్తుంచు కోండి, సైతాను ఓడి పోయిన శత్రువు, తన సమయం చాలా తక్కువని అతడికి తెలుసు అందుకనే సాధ్యమైనంత మందిని తనతో కూడా నరకాగ్ని లోనికి తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నము చేస్తున్నాడు. అందుకని దేవుని బిడ్డల మైన మనము సర్వాంగ కవచాన్ని ధరించి, మన కొరకు మరియు మన ఇంటి వారి కొరకు మాత్రమే కాక, నాశనము వైపు పరిగెత్తుతున్న వారందరు కూడా మహోన్నతుడైన ఆ ప్రభువు కాపుదల క్రిందకు రావాలని ప్రార్థన చెయ్యాలి.

9 Oct 2017

తీర్పు తీర్చబడదు

యోహాను 3: 18 ఆయనయందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు; విశ్వసింపనివాడు దేవుని అద్వితీయకుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకు మునుపే తీర్పుతీర్చబడెను.

చాలా మంది అంటారు అంత ప్రేమామయుడైన దేవుడు మనుషులను నరకానికి పంపించడం అన్యాయం కదా అని. కాని అది నిజమేనా? మనుషులను నరకానికి పంపించేది దేవుడేనా? దీనికీ జవాబు చెప్పడానికి ఈ రోజు వాక్యన్ని చూద్దాం, వాక్య భాగము స్పష్టముగా చెబుతున్నది దేవుని యందు విశ్వసింపని వాడు ఇంతకు ముందే తీర్పు తీర్చబడెను అని. కాబట్టి మనుషులను నరకానికి పంపేది దేవుడు కాదు మనుషులే ఆ నిర్ణయాన్ని తీసుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే దేవుడు ప్రేమ కలిగిన వాడు కనుక మనుషులు నశించి పోక నిత్య జీవము పొందాలని తన అద్వితీయ కుమారునిని ఈ లోకములోనికి పంపించారు (వ16). కాబట్టి నీవు కనుక క్రీస్తు యందు విశ్వాసము ఉంచితే ఆయనతో కూడ స్వర్గములో నివాసము చేసేదవు లేదంటే ఆయనను విశ్వసింపక  పోయినట్లయితే పురుగు చావని, అగ్ని ఆరని నరకానికి (మార్కు 9:48) వెళ్లేదవు. నిర్ణయం నీదే.

ఇంకా మనుషులు క్రీస్తును విశ్వసింపనిది ఆయన దేవుడని నమ్మక కాదు కాని వారు కనుక వెలుగు లోనికి వస్తే తమ చెడు కార్యములు బయట పడతాయేమో నని  మరియు వారి దుష్ట కార్యములను విడిచి పెట్టాల్సి వస్తుందేమోనని భయము (వ 19-20). ప్రియ చదువరీ, మీరే ఆలోచించండి దుష్ట మైన సుఖ సంతోషాలు ఈ భూమి మీద అనుభవించి నరకానికి వెళ్లడము మంచిదా లేదంటే కష్టాలు శ్రమలు అనుభవించాల్సి వచ్చినా కూడా క్రీస్తును నమ్ముకొని ఆయన కొరకు జీవించి నిత్య జీవములో ఆయనతో కూడ జీవించుట మంచిదా. నిర్ణయం మీదే.

చివరగా, నీవు నమ్మినా నమ్మక పోయినా నిజము నిజమే అది ఏమిటంటే యేసు క్రీస్తు దేవుడు మరియు నిత్య జీవానికి మార్గము ఆయనే. ఆయన పాపులమైన మన కొరకు చనిపోవుటకై ఈ లోకమునకు వచ్చి యున్నారు మరియు ఒక దినమున తన యందు విశ్వాసముంచిన బిడ్డలతో కలిసి ఈ లోకమును పరిపాలించ డానికి తిరిగి రానై యున్నారు. ఆయన తిరిగి వచ్చిన రోజు ప్రతి మోకాలు వంగును మరియు ప్రతి నాలుక ఆయనే ప్రభువుని ఒప్పుకొనును. నీవు క్రీస్తుతో కూడ ఈ లోకమును పరిపాలించే గుంపులో ఉండాలనుకుంటున్నవా లేదంటే మహా శ్రమలు అనుభవించే గుంపులో ఉండాలని అనుకుంటున్నవా. నిర్ణయం నీదే

ఈ రోజే తెలివైన నిర్ణయం తీసుకుంటారని నా ప్రార్థన మరియు నా ఆశ.

No comments:

Post a Comment