Thursday, November 23, 2017

November Devotions

 28 Nov 2017


ఆనందతైలము

హెబ్రీయులకు 1: 9 నీవు నీతిని ప్రేమించితివి దుర్నీతిని ద్వేషించితివి అందుచేత దేవుడు నీతోడివారికంటె నిన్ను హెచ్చించునట్లుగా ఆనందతైలముతో అభిషేకించెను.

హెబ్రీయుల పత్రికలో పేర్కొన బడిన ఈ వాక్యము వివాహ కీర్తనగా అనబడే 45వ కీర్తన నుండి తీసుకొని ప్రస్తావించబడినది (quoted from). కొంత మంది ఈ కీర్తన దావీదు మహారాజు యొక్క ఒక భార్యతో జరిగిన వివాహం లో పాడిన పాట అంటారు మరి కొంత మంది ఇది పరలోకపు వివాహమునకు సాదృశ్యముగా ఉన్నది, యేసు క్రీస్తు పెండ్లి కుమారుడు మరియు సంఘము ఆయన వధువు అని. మరి నిజముగా ఈ కీర్తన దావీదు వివాహమందు పాడబడినదో లేదో తెలియదు కాని, ఈ పత్రికలో ఈ వాక్యము ప్రస్తావించుట వలన యేసు క్రీస్తు మెస్సయ్యా అని మరియు ఆయన దేవుడని మరియు ఆయన రాజ్యము నిత్యము నిలిచి ఉండునని పునరుద్ఘాటించ బడినది. 

ఇక వాక్యము లోని మూల పదాలు చూసినట్లయితే, అభిషేకించెను , తలను లేదా పూర్తి శరీరాన్ని నూనెతో అభిషేకము చేయడము అనేది పాత నిబంధన కాలములో, యూదులకు మరియు కొన్ని దేశముల ప్రజలకు వాడుక అయిన పద్ధతే. ముఖ్యముగా తలను నూనెతో అభిషేకించడము అనేది యాజకులకు, రాజులకు మరియు అతిథులకు చేయడం జరిగేది. ఇంకా జీవం లేని వస్తువులకు అభిషేకం చేయడం అనేది వాటిని మత సబంధ విషయాలకు వేరుగా ఉంచుటకు జరిగేది. కొత్త నిబంధన కాలమునకు వస్తే నూనెతో అభిషేకము రోగులకు స్వస్థత కొరకు ప్రార్థించే టప్పుడు చేస్తారు. ఈ వచనములో ఆనందతైలముతో అభిషేకము అనగా ఆధ్యాత్మిక అభిషేకము అంటే పరిశుద్దాత్మ అభిషేకము అని అర్థము. నీతోడివారికంటె అనగా హెచ్చింపు అని అర్థము. కనుక క్రీస్తు దేవుని చేత అభిషేకింప బడినవాడు మరియ దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. ఫిలిప్పీయులకు 2: 11. అంతే కాదు దేవుడు తన కృపను బట్టి పరిశుద్దాత్మ అభిషేకమును కేవలము తన కుమారునికే పరిమితం చేయ లేదు కాని ఆయన కుమారుని యందు విశ్వాసముంచిన అందరికీ ఈ ధన్యతను ఇచ్చి యునారు.  అయితే విశ్వాసులకు పరిశుద్దాత్మ అభిషేకము అనేది దేవుని యందు రాజులు మరియు యాజకులయిన వారి మీద  పరిశుద్దాత్మ యొక్క పవిత్రీకరణ ప్రభావములను వ్యక్తము చేస్తుంది.

ఈ రోజు వచనము ఇంకా ఏమి చెబుతున్నది అంటే ఆయన నీతిని ప్రేమించెను మరియు దుర్నీతిని ద్వేషించెను అని. అందువలననే మనము భరోసా గా ఉండవచ్చు, దేవుడు దుర్నీతిని వ్యాప్తి చెందనివ్వరు అని మరియు తన నీతిని బట్టి తన ప్రజల పక్షమున ప్రతీకారము తప్పక తీర్చును అని. క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు ఈ ప్రపంచమును నీతి న్యాయములతో పరిపాలన చేసెదరు భూమికి తీర్పు తీర్చుటకై నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చుటకై న్యాయమును బట్టి జనములకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేసియున్నాడు.కీర్తనలు 98: 9 మరియు ఆయన రాజ్యము తరతరములు నిలిచి యుండును.

అందుకే ప్రియమైన విశ్వాసి 

  • దీని యందు ఆనందించు, ప్రస్తుత కష్టములు మరియు ఈ లోకములోని అన్యాయము ఇంక కొంత కాలము వరకే ఉంటాయి తర్వాత మన ప్రభువు తిరిగి వచ్చినప్పుడు నీతి నివసించే, న్యాయము వ్యాప్తి చెందే కొత్త పరలోకం మరియు కొత్త భూమి యందు మనము పాలి భాగస్తులము అవుతాము. అయినను మనమాయన వాగ్దానమునుబట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమికొరకును కనిపెట్టుచున్నాము; వాటియందు నీతి నివసించును.2పేతురు 3: 13
  • దీని యందు ఆనందించు, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదలచేసి, తాను ప్రేమించిన తన కుమారునియొక్క(మూలభాషలో-తన ప్రేమ కుమారుని) రాజ్యనివాసులనుగా చేసెను. కొలస్సీయులకు 1: 13 అని.
  • ఇంక మరి ముఖ్యముగా ఈ విషయమందు ఆనందించు, యేసు క్రీస్తు మూలముగా పరిశుద్దాత్మ అభిషేకము కేవలము ఎన్నికోన బడిన కొందరికే పరిమితము కాలేదు కాని ఆయన పిల్లల మైన మనము అందరము కూడా ఆనందతైలముతో అభిషేకించ బడవచ్చుని. ...దుఃఖమునకు ప్రతిగా ఆనందతైలమును... వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. యెహోవా తన్ను మహిమపరచుకొనునట్లు నీతి అను మస్తకివృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్ట బడును.యెషయా 61: 3. మరియు ఈ పరిశుద్దాత్మ అభిషేకము వలన మనము ఈ లోకములో కూడా జయ జీవితమును జీవించ గలుగుతాము. ఎందుచేతనంటే    మృతులలో నుండి యేసును లేపినవాని ఆత్మ మీలో నివసించినయెడల, మృతులలో నుండి క్రీస్తుయేసును లేపినవాడు చావునకులోనైన మీ శరీరములను కూడ మీలో నివసించుచున్న తన ఆత్మద్వారా జీవింపజేయును.రోమీయులకు 8: 11

27 Nov 2017

యెహోవా సఫలము చేయును


కీర్తనలు 138: 8 యెహోవా నా పక్షమున కార్యము సఫలముచేయును. యెహోవా, నీ కృప నిరంతరముండును



విశ్వాసులమైన మనలో అనేక మందికి దేవుడు మన పట్ల చిత్తము మరియు ఉద్దేశము కలిగి ఉన్నారని తెలుసు అలానే కొంత మందిమి వాటిని మనకు తెలియ జెప్పమని దేవునికి శ్రద్ధగా ప్రార్థన కూడా చేస్తాము. అయితే మనలో ఎంత మందిమి దేవుడు తన ఉద్దేశ్యాన్ని మన పట్ల నేర వేరుస్తారు అని నమ్ముతాము? అంటే దేవునికి ప్రార్థన చేసి ప్రభువా మీ ఉద్దేశాలు నా జీవితంలో నెరవేరుటకు ఏ విధంగా నడవాలో దానికి అనుగుణముగా నడుచుకొంటాను అని చెప్పడం ఒక ఎత్తు ఇంక ఆయన నన్ను బట్టి కూడా నా జీవితంలో తన ఉద్దేశాన్నీ నేరవేరుస్తారు అని నమ్మడం  అంటే నేను ఆవిధేయత, బలహీనతలు, మరియు ఓటములు కలిగి ఉన్నప్పటికీ దేవుడు తన ఉద్దేశాలను నా జీవితంలో నెరవేరుస్తారు అని నమ్మడం ఇంకొక ఎత్తు. మనము కనుక అబ్రాహాము జీవితాన్ని చూసినట్లయితే ఆయన కొన్ని మార్లు దేవునిని సంప్రదించకుండా తన సొంత నిర్ణయాలు తీసుకొని తన జీవితాన్ని గందరగోళం చేసుకున్నారు మరియు దాదాపు వాగ్దాన పుత్రుడిని కోల్పోయే పరిస్థితిని తెచ్చుకున్నారు. అయితే దేవుడు కలుగ జేసుకొని తన ఉద్దేశాన్ని నెరవేర్చారు. అలానే సంసోను జీవితంలో దేవుడు అతనికి మరియొక ఆఖరి అవకాశం ఇచ్చి ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చారు. ఇలా అనేక ఉదాహరణలు మనము బైబిల్ పుటలలో చూడ వచ్చును. అయితే ఒక హెచ్చరిక గమనించండి, మన ఓటములతో పని లేకుండా దేవుడు తన ఉద్దేశాలను నెరవేర్చు సమర్థుడు కాని మనము మన అవిధేయతకు మరియు పాపమునకు పరిణామాలు అనుభవించాల్సిందే. ఎలా అంటే అబ్రాహాము జీవితంలో ఐగుప్తు వెళ్లడం మరియు హాగరును పెళ్లి చేసుకోవడం వలన తన జీవితంలో మరియు తన కుటుంబంలో అనేక తలనెప్పులు తెచ్చు కున్నాడు ఇంకా చెప్పాలంటే దాని పరిణామాలు దేవుని బిడ్డలు ఇప్పటికీ అనుభవిస్తూనే ఉన్నారు. అలానే సంసోను యొక్క ఆవిధేయత తన ప్రాణము మీదికే తెచ్చింది, అతడు ఫిలిస్తీయుల మీద విజయాన్ని ప్రాణముతో ఉండగా చూడలేక పోయాడు. 

ఇక ఈ రోజు వాక్య భాగములో చూసినట్లయితే కీర్తనాకారుడైన, దావీదు మహారాజు చాలా నమ్మకంతో చెబుతున్నారు దేవుడు తన పక్షమున కార్యము సఫలం చేయును అని అనగా దేవుడు తన జీవితంలో ఆయన ఉద్దేశాలను నెరవేర్చును అని. తాను ఇంక ఎప్పుడూ ఆవిధేయత చూపను లేదా ఓటమి పోందను అని నమ్ముట వలన ఆయన ఇలా అనలేదు కాని దేవుని యొక్క గుణమును బట్టి ఇలా చెప్ప గలిగారు. వచనము యొక్క తదుపరి భాగమును చూసినట్లయితే ఈ విధంగా ఉంది యెహోవా, నీ కృప నిరంతరముండును దీని యందే దావీదు యొక్క నమ్మకము నిలిచి ఉన్నది, దేవుని కృప నిరంతరము నిలిచి ఉండును కనుక మరియు దేవుడు ఎంతో ప్రేమామయుడు కనుక ఆయన తన ప్రజలను ఎన్నడునూ మధ్యలో విడిచి పెట్టక ఆయన మొదలు పెట్టిన కార్యమును పూర్తి చేయును మరియు ఆయన తన చిత్తమును మరియు ఉద్దేశమును వారి జీవితాలలో జరిగించును. 

ప్రియమైన వారలారా, మన పిలుపు మరియు ఎన్నిక మనను బట్టి కాదు, అది దేవుడే నిర్ణయిస్తారు. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు;.. మీరు వెళ్లి ఫలించుటకును, మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని.యోహాను 15: 16 దేవుని పిలుపు మరియు ఎన్నిక మనకు గ్రహింప శక్యం కాదు. ఆయన సాధారణ బెస్తవాడైన పేతురును తన సంఘమును కట్టుటకు ఎన్నుకొనెను మరియు క్రైస్తవులను హింసించుచున్న పౌలును అన్యజనులకు సువార్తను చాటుటకు ఎన్నుకొనెను. ఆయన దానియేలును ఎన్నుకొనెను మరియు దావీదును ఎన్నుకొనెను, ఏసేపును ఎన్నుకొనెను మరియు సంసోనును ఎన్నుకొనెను. కాబట్టి అపొస్తలుడైన పౌలు కోరింధీయులకు వ్రాసిన పత్రికలో చెప్పిన్నట్లు ఏ శరీరియు దేవుని యెదుట అతిశయింపకుండునట్లు, జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములోనుండు వెఱ్ఱివారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైనవారిని దేవుడు ఏర్పరచుకొని యున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైనవారిని, తృణీకరింప బడినవారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు. 1కోరింథీయులకు 1: 27-29

అందుకే ప్రియమైన వారలారా, ఒక వేళ దేవుడు మిమ్ములను దేనికైనా పిలుస్తుంటే భయముతో వెనకడుగు వేయవద్దు లేదా ఒక వేళ దేవుడు మీకు ఇచ్చిన దర్శనము నెరవేరుటలో ఆలస్యము జరుగుతున్నట్లయితే నిరాశ చెందవద్దు ఎందుకంటే దేవుడు తాను ఉద్దేశించిన దానిని తప్పక నెరవేరుస్తారు. ఆయన మీ జీవితం పట్ల మరియు నా జీవితం పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నారు మరియ ఏది ఏమయినా కూడా ఆయన దానిని తన మహిమార్థమై తప్పక జరిగించును. మన పని మాత్రము ఆయన ఎదుట విధేయతతో నడచుకొనుటయే అప్పుడు మనము మరియు మన చుట్టూ ఉన్నవారు ఆయన ఆశీర్వాదాల యొక్క మహాదైశ్వర్యాలను ఈ లోకములో మరియు పరలోకంలో కూడా అనుభవించ గలుగు తాము. 

24 Nov 2017

దాని కాలమందు చక్కనిది

ప్రసంగి 3: 11 దేనికాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించియున్నాడు; ఆయన శాశ్వతకాల జ్ఞానమును నరుల హృదయమందుంచి యున్నాడుగాని దేవుడు చేయుక్రియలను పరిశీలనగా తెలిసికొనుటకు అది చాలదు.



ఈ వాక్య భాగములోని మొదటి భాగమును వివాహ ఆహ్వాన పత్రిక లో వాగ్ధాన వచనము కింద ఎక్కువగా చూస్తుంటాము. అది సరి అయినదే ఎందుకంటే వివాహము అనేది సంతోషము మరియు వేడుకతో కూడిన అందమైన విషయం. అయితే ఈ వచనములో మూల పదం సమస్తము. ఈ ప్రసంగి గ్రంథాన్ని వ్రాసిన సొలొమోను రాజు అధ్యాయాన్ని ఈ విధంగా చెబుతూ మొదలు పెట్టారు ప్రతిదానికి (సమస్తమునకు) సమయము కలదు. ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు.ప్రసంగి 3: 1 తర్వాత ఆయన ఏఏ విషయాలకు సంబంధించి సమయము కలదో వివరించారు ....పుట్టుటకు,చచ్చుటకు...ఏడ్చుటకు నవ్వుటకు...యుద్ధము చేయుటకు సమాధాన పడుటకు ప్రసంగి 3:2-8. మరియు వ 11లో దేవుడు సమస్తమును దేనికాలమునందు అది చక్కగా నుండునట్లు నియమించియున్నాడు అని చెప్పారు.



ఈ వారంలో ఒక చావు మరియు వివాహం పక్క పక్కన రోజులలో జరగడం చూసిన తరువాత ఈ వచనాలు మానవ జీవితానికి ఎంత వర్తిస్తాయి అనే గ్రహింపు నాకు కలిగింది. బాధతో మరియు సంతోషముతో నిండిన ఈ రెండు దినాలు కూడా దేవుడు ముందు గానే నియమించి యున్నారు. చాలా సార్లు  ముఖ్యంగా మన దుఃఖ భరితమైన సమయాలలో ఎందుకు అనేది మనకు అర్థం కాదు అయితే దేవుని వాక్యము ప్రకారము సమస్తమును దేనికాలమునందు అది చక్కగా నుండునట్లు దేవుడు నియమించియున్నాడు. ఒక వేళ మీరు కనుక ఉద్యోగం కోసం లేదా జీవిత భాగస్వామి కోసం లేదా మీ ఉద్యోగములో లేదా వివాహ జీవితంలో ఒక పురోగతి కోసం లేదా వేరే ఎదో ఒకదాని కోసం ఎదురు చూస్తున్నట్లయితే నేను ఫలాన ఫలానా సమయంలో మీ ఎదురు చూపు ముగిస్తుంది అని చెప్ప లేను కాని ఒక విషయాన్ని మాత్రం ఖచ్చితంగా చెప్ప గలను ఈ ఎదురు చూపు కూడా దేవుడు రానిచ్చినదే లేదంటే నియమించినదే మరియు అది కూడా చక్కనిదే.

దేవుని వాక్యము ఇది కూడా చెబుతున్నది దేవుడు ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగ జేసేను సామెతలు 16:4 మరియు దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది 1 తిమోతి 4:4 అని. అందుకే మనము ఎదుర్కొనే ప్రతి దుఃఖము మరియు అనుభవించే ప్రతి సంతోషము, పడే ప్రతి బాధ మరియు కష్టము మరియు పొందే ప్రతి ఆశీర్వాదము సమస్తము దేవుని చేత చేయబడినవే మరియు అవి మంచివి మరియు వాటి సమయమందు అవి చక్కనివి. నిజముగా మానవ జీవితంలో ప్రతి విషయమునకు  సమయము కలదు మరియు అవి చక్కనివి ఎందుకంటే అవి దేవుని చేత నియమించబడినవి కనుక.

ఇక వాక్యము లోని రెండవ భాగము చెబుతున్నది *దేవుడు శాశ్వతకాల జ్ఞానమును నరుల హృదయమందుంచి యున్నాడుగాని దేవుడు చేయుక్రియలను పరిశీలనగా తెలిసికొనుటకు అది చాలదు అని. ఒక ప్రముఖ వాడుక ఉంది మన హృదయం దేవుడు ఒక్కడే నింపగలిన ఒక శూన్యము అని. అది ఎంత నిజము...క్రీస్తును కనుగొను వరకు మన హృదయాలకు విరామము లేదు. ఒక వ్యక్తి ఎంత విజయం సాధించినా మరియు ఎంత ప్రఖ్యాతులు మరియు అధికారం సంపాదించినా వారు కనుక దేవునిని కనుగొనక పోతే వారు నిజమైన సమాధానం పొందలేరు. మనము దేవుని స్వరూపమందు చేయ బడిన వారము మరియు మన సృష్టి కర్తను కనుగొనే వరకు మరియు ఆయనను మన హృదయం లోనికి ఆహ్వానించే వరకు నిజమైన సఫలత మనకు ఉండదు. అదే సమయంలో రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనము ఈ ధర్మ శాస్త్ర వాక్యములన్నిటి ననుసరించి నడుచుకొనునట్లు బయలుపరచబడినవి యెల్లప్పుడు మనవియు మన సంతతి వారివియునగునని చెప్పుదురు. ద్వితియోపదేశకాండము 29: 29 అందు వలననే దేవుడు చేసే ప్రతీది మనము అర్థము చేసుకోలేము. అయితే ఒక విషయములో నిశ్చయత కలిగి ఉండవచ్చు దేవుడు తనను ప్రేమించిన వారికి సమస్తమును సమకూర్చి మేలు కొరకు జరిగించును అని రోమీయులకు 8:28

మీరు కనుక ఇంకనూ క్రీస్తును మీ హృదయంలో అంగీకరించని వారు అయితే మీరు విలాసాలతో లేదా పనితో లేదా విజయాలతో లేదా చెప్పాలంటే దేవుడు తప్ప ఇంక ఏ విషయంతో అయినా మీ మనస్సును ఎంతగా పరధ్యానం (distract) పట్టించాలని  ప్రయత్నించినా మీకు నిజమైన సమాధానము లేదా విరామము లేదా సఫలత దొరకదు. అందుకే విశ్వాసములో ఒక అడుగు ముందుకు వేసి క్రీస్తును మీ హృదయములోనికి ఆహ్వానించండి ఎందుకంటే నేడే రక్షణ దినము 2 కోరింథీయులకు 6:2


23 Nov 2017

పైనున్న వాటి మీద

కొలస్సీయులకు 3: 1-2 మీరు క్రీస్తుతో కూడ లేపబడినవారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి యున్నాడు. పైనున్న వాటి మీదనేగాని, భూసంబంధమైన వాటిమీద మనస్సు పెట్టుకొనకుడి;

మనము ఎంత గొప్ప వారమైనా మరియు ఎంత విలాసవంతమైన జీవితాన్ని జీవించినప్పటికి ఒక దినమున మనము అంతటినీ వదిలి పెట్టి దేవుని వద్దకు వెళ్లాల్సినదే. మానవులముగా మనము కష్ట పడి పని చేసి మనము మరియు మన పిల్లలు సౌకర్యవంతమైన  జీవితం గడపాలని ఈ లోక ఆస్తులను కూడ బెట్టుకుంటాం. ఈ లోకము లోనిది ఏదీ శాశ్వతం కాదని తెలిసినా కూడా మనము ఈ లోకంలో బ్రతికినంత కాలము మన జీవితం మంచి స్థితిలో ఉండటానికి ప్రయత్నము చేస్తూనే ఉంటాము. మరి కొంచెము కాలము ఉండే విషయాల కొరకు మనము ఇంత కష్ట పడితే శాశ్వతమైన పరలోక సంబంధమైన విషయాల కొరకు ఇంకా ఎంత ఎక్కువ కష్ట పడాలి. 

ముఖ్యముగా క్రీస్తుతో కూడా లేప పడిన, విశ్వాసుల మైన మనము క్రీస్తు కూర్చుండి యున్న ఆ పైనున్న వాటినే వెదక వలెను. ఈ రోజు వాక్య భాగములో, పైనున్న వాటిని వెదుకుడి అని అపొస్తలుడైన పౌలు గారు అనడంలో అర్థం ఏమిటంటే మనము మన మనస్సులను పరలోకం మీద ఉంచాలి అని. మనము దేవుని రాజ్యమును మరియు ఆయన నీతిని వేదకాలి ఎందుకంటే ఎప్పటికీ ఉండి పోయేవి అవే కనుక. మనము దేవునితో మన సంబంధమును పెంచు కోవడానికి ప్రయత్నము చెయ్యాలి ఎందుకంటే చివరిలో ఈ విషయం ఒక్కటే అవసరం అవుతుంది. మనతో కూడా ఏ ఆస్తులను ఇంకా చెప్పాలంటే ఏ ఫలాలు మరియు తలాంతులను కూడా పరలోకానికి తీసుకు వెళ్ళ లేము. వ్యక్తి గతంగా నేను ఏమి నమ్ముతా నంటే పాడడం మినహాయించి ఏ ఆత్మీయ ఫలాలు లేదా తలాంతులు మనకు పరలోకంలో అవసర పడవు అని, అవును ఏ స్వస్థత, ఏ ప్రవచనం, ఏ భాషలలో మాట్లాడటం ఇవి ఏవీ మనకు పరలోకంలో అవసరం లేదు.


మరి అయితే పైనున్న వాటిని వేదకితే ఏమి జరుగుతుంది? మన దృష్టి లోక సంబంధ మైన విషయాల మీద నుండి పరలోకం మీదికి మరలితే అప్పుడు మనకు ఈ లోక కష్టాలు మరియు బాధలు అంత భారమైనవిగా అనిపించవు. ఎందుకంటే మనకు తెలుసు పరలోకంలో మనము అనుభవించే సంతోషము ముందు ఇవన్నీ సముద్రములో నీటి చుక్కంతటివి అని. పరలోకం ఎంత ఆనంద దాయకముగా ఉండబోతోందో అన్న విషయం మనము గ్రహించి నట్లయితే మనకు ఈ లోకములో ఏమి ఉన్నా లేక పోయినా ఏ ఆందోళన ఉండదు. ఎందుకంటే మనకు తెలుసు పర లోకములో మనము ఎటువంటి ఛాయ లేని దేవుని ప్రసన్నతను సదా కాలము అనుభవిస్తాము అని మరియు అక్కడ ఎప్పటికీ కన్నీరు ఉండదు బాధలు ఉండవు  అని. ఏ వ్యాధి కూడ భరించ లేనిదిగా అనిపించదు మరియు ఏ తీరని అవసరత కూడా అంత ముఖ్యమైనదిగా  అనిపించదు మనకు ఎందుకంటే మనకు తెలుసు పరలోకంలో మనము మహిమా శరీరాలను కలిగి ఉంటామని మరియు ఏ సంపదను మరియు సంబంధాలను అక్కడికి తీసుకొని పోలేమని.

అంతే కాదు మనము పైనున్న వాటిని వెదకినప్పుడు మనము ఈ లోక సంబంధ మైన వస్తువులను లేదా వ్యక్తిని గట్టిగా పట్టుకొని ఉండ లేము.  మనము ఎప్పుడయితే అన్నిటినీ తేలికగా పట్టుకుంటామో మరియు మన చుట్టూ ఉన్న వారి వద్ద నుండి ఏమీ ఆశించకుండా ఉంటామో అప్పుడు మనకు ఈ లోకములో కూడా తక్కువ నిరాశలు ఎదురవుతాయి. అంతే కాదు మన దృష్టి ఈ లోక సంబంధ మైన సంపదను ఎలా కాపాడు కోవాలి మరియు పెద్దదిగా చెయ్యాలి మరియు ఇతరులు మనలను ఏ విధంగా చూస్తున్నారు అనే విషయాల మీద కాకుండా, మనము దేవునిని ఎలా సంతోష పెట్టాలి మరియ ఈ  శుభ వర్తమానమును ఇతరులతో ఎలా పంచు కోవాలి తద్వారా వారు కూడా పరలోకంలో సంతోషిస్తారు కదా అనే విషయాల మీద మన దృష్టి ఉంటుంది. 


అందుకనే ప్రియమైన వారలారా, పైనున్న వాటి మీదనేగాని, భూసంబంధమైన వాటిమీద మనస్సు పెట్టుకొనకుడి (వ 2). ఎందుకంటే  దృశ్యమైనవి అనిత్యములు; అదృశ్యమైనవి నిత్యములు. 2కోరింథీయులకు 4: 18

No comments:

Post a Comment