Friday, January 5, 2018

Jan 2018

5 jan 2018

నిత్యము స్తుతించుము


కీర్తనలు 34: 1 నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును.

మ్యూజిక్ అంటే ఇష్టపడని వ్యక్తి ఈ లోకంలో ఎవరూ ఉండరని నా నమ్మకం. మన ఇష్టాలు వేరుగా ఉండవచ్చు, కొందరికి పాత పాటలు, కొందరికి కొత్తవి, కొందరికి ఫాస్ట్ మరియు కొందరికి స్లోగా ఉండే పాటలు  ఇష్టం ఉండొచ్చు కాని అందరము మ్యూజిక్ ఇష్ట పడతాము. మనము పాటలు వింటాము మరియు పాడతాము లేదా మనసులో పాడతాము. అయితే ఎంత మంది రోజంతా పాడగలరు లేదా పాటలు వినగలరు? ఒక వేళ మీరు కూడా నా లాగ అయితే అప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు లేదా పనులు చేసేటప్పుడు రోజంతా మ్యూజిక్ పెట్టుకోవచ్చు. లేదా మనము ప్రార్థన చేసే ముందు మన హృదయాలను దేవుని ఎదుట సిద్ధము చేసు కోవడానికి మ్యూజిక్ వినొచ్చు. ఇంకోకటి తెలుసా, నేను గమనించింది ఏమిటంటే ఒకొక్క సారి మన హృదయం చాలా కఠినమయి పోతుంది, ఒక వైపు మనకు మన హృదయాన్ని దేవుని ఎదుట కుమ్మరించాలి అని అనిపిస్తుంది కాని ఎందుకనో కాని హృదయం అంతకంతకు కఠిన మవుతూ ఉంటుంది ప్రార్థన కూడా సరిగా చేయ లేక పోతాము. అలాంటప్పుడు మనము కనుక పాటలు పాడుతూ లేదా మ్యూజిక్ పెట్టి దేవునిని స్తుతిస్తూ ఉంటే మన హృదయము కరిగి మనము దేవుని ఎదుట ప్రార్థించ గలుగు తాము. మ్యూజిక్ కి స్వస్థ పరిచే శక్తి ఉంది అలానే కఠిన హృదయాలను విరుగ కొట్టే శక్తి కూడా ఉంది.

ఈ మధ్యన నేను ఒక గొప్ప దైవ సేవకులు తన వర్తమానంలో ఈ విధంగా చెప్పడం విన్నాను, మనము రోజంతా పాటలు పాడుతూ ఉండాలి అని మరియు ఆయన సరదాగా ఇలా కూడా అన్నారు, మన కుటుంబ సభ్యులను తిట్టడం కూడా ఒక పాటలాగా పాడుతూ తిట్టాలి అని. అది విన్నప్పుడు నేను నా అక్క కూతురితో సరదాగా నవ్వుతూ తిట్టడం ఎలాగో నీ మీద ప్రాక్టీస్ చేస్తాను అని తనను ఏడిపించిన మాటలు గుర్తుకు వచ్చి నవ్వు ఆపుకో లేక పోయాను. అయితే ఇతరులను పాట పాడుతూ తిట్టడం సరైనది కాక పోవచ్చు కాని మ్యూజిక్ మాత్రము టెన్షన్ ను తగ్గిస్తుంది. మనకందరికి తెలుసు స్తుతి విచారాన్ని మరియు నిరాశను పారద్రోలుతుందని. ఎప్పుడైనా సరే మనము ఒక వేళ నిరాశ నిస్పృహ చెందితే అప్పుడు మనము పాటలు పాడుతూ దేవునిని స్తుతిస్తే అప్పుడు మనకు తెలియ కుండానే మనము ఆదరణ పొందుతాము మరియు మన హృదయము లో ఒక విధమైన సంతోషము కలుగుతుంది.

ఈ రోజు వాక్య భాగములో చూసినట్లయితే దావీదు తాను నిత్యము దేవుని కీర్తి తన నోట ఉండును మరియు ఎల్లప్పుడు యెహోవాను సన్నుతించెదనని చెబుతున్నారు. ఆయన మీరు సంతోషముగా ఉన్నప్పుడు దేవుని స్తుతించండి లేదా అన్నీ మనము అనుకున్నట్లు బాగా జరుగు తున్నట్లయితేనే దేవునిని స్తుతించండి అని చెప్పడం లేదు. ఇంకా చెప్పాలంటే ఈ కీర్తన యొక్క చరిత్ర చూసినట్లయితే దావీదు ఈ కీర్తనను అబీమెలేకు రాజు వద్ద పిచ్చి వాని లాగ నటించి అక్కడి నుండి పంపి వేయ బడినప్పుడు వ్రాసారు. దావీదు సౌలు నుండి తప్పించు కోవడానికి అక్కడ ఇక్కడ దాగు కొన వలసి వచ్చింది, ఎందుకంటే సౌలు మహారాజు దావీదు ప్రాణము తీయడానికి ఆయనను వెంటాడారు. అయితే దేవుని మీద కోపము తెచ్చుకొని నిరాశ పడటానికి బదులు దావీదు దేవునిని స్తుతిస్తున్నారు మరియు ఆయనను కీర్తిస్తున్నారు. దావీదు నకు తెలుసు సమస్తము, మంచి మరియు చెడు దేవుడు అనుమతిస్తేనే మన వద్దకు వచ్చునని మరియు దేవుడు అన్నిటినీ తన మేలునకు మార్చునని. ఆయన దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని నమ్మారు మరియు దేవును యొక్క మంచి తనము మీద నమ్మకము కలిగి యున్నారు. దేవుడు నమ్మదగిన వాడని ఆయన విశ్వసించారు మరియు దేవుడు కనుక వాగ్దానము చేసినట్లయితే దానిని ఆయన తప్పక నెరవేరుస్తారని నమ్మారు. అందరూ తనకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు కూడా తనను తాను దేవునిలో ప్రోత్సాహించు కోవడం నేర్చుకున్నారు.

మీరు అడగ వచ్చు నేను ఇంత బాధలో ఉన్నాను మరి దేవునిని ఎలా స్తుతించ గలను అని. మొదట దేవుడు మనలను ఇంకొక సంవత్సరం జీవించే ఆశీర్వాదం ఇచ్చారన్న విషయాన్ని బట్టి స్తుతించండి. ఆయన మనకు అనుగ్రహించిన ఆహారము, వస్త్రములు మరియు నివాస స్థలమును బట్టి స్తుతించండి. ఆయన మనకు దయ చేసిన రక్షణను బట్టి మరియు నిత్య జీవము కొరకు ఆయనను స్తుతించండి. ఇలా మనము మన ఆశీర్వాదాలు గుర్తు చేసుకుంటూ దేవునిని స్తుతించడం మొదలు పెడితే అప్పుడు ఆయనను కీర్తించడానికి మనకు అనేక కారణాలు తప్పక దొరుకుతాయి.

ప్రియమైన వార లారా, ఈ నూతన సంవత్సరం ఒక స్తుతి సంవత్సరం కానివ్వండి. కీర్తనా కారుని వలె ఎల్లప్పుడూ మన నోట కూడా దేవుని స్తుతి  ఉండును గాక.

పైనున్న వాక్య ధ్యానంలో మ్యూజిక్ అని నేను వాడినప్పుడు అది క్రైస్తవ మ్యూజిక్ అని నా ఉద్దేశము

No comments:

Post a Comment